మహ్మదాపురం(దుగ్గొండి) : కుటుంబ పోషణ భారం కావడంతోపాటు చేస్తున్న ఉద్యో గానికి భద్రత లేదని మనోవేదనకు గురైన ఓ కండక్టర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మహ్మదాపురం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన చింత రమేష్(33)కు మూడేళ్ల క్రితం ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో కండక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. మొదట నర్సంపేట డిపోలో పనిచేశాడు. ఇటీవల జనగామ డిపోకు బదిలీ అయ్యాడు.
ఉద్యోగం తప్ప మరేలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో వచ్చిన జీతం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. దీంతో తరచూ ఇంట్లో మనోవేదనకు గురవుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన భార్య హారికను ఆమె పుట్టినూరైన ద్వారకపేటలో దింపి వచ్చాడు. నాలుగు రోజులపాటు తాను జనగామలోనే ఉంటానని ఆమెకు చెప్పి తిరిగి మహ్మదాపురం చేరుకున్నాడు. రాత్రి తన ఇంట్లోనే క్లచ్‌వైర్‌తో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గమనించిన ఇరుగుపొరుగు వారు అతడిని కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి చొక్కా జేబులో మాత్రం ‘నా చావుకు ఎవరూ కారణం కాదని’ అని రాసి ఉన్న చిన్నకాగితం లభించదని పోలీసులు తెలిపారు. మృతుడి భార్య హారిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముజాహిద్ తెలిపారు. మృతుడికి రెండేళ్ల కుమారుడు. ఏడు నెలల పాప ఉన్నారు. చిన్నారులిద్దరిని చూసిన గ్రామస్తులు కంటతడిపెట్టారు. మృతుడి భార్య, బంధువులు చేసిన రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.
ఉద్యోగ భద్రత లేదని కండక్టర్ ఆత్మహత్య
Published Tue, Oct 21 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM