కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్
* చట్టంలో మార్పుకు క్యాబినెట్ సబ్‌కమిటీ అంగీకారం
* వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా బిల్లు
* మంత్రి ఆంజనేయ వెల్లడి
సాక్షి, బెంగళూరు : కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టే నియామకాల్లోనూ ఇకపై రిజర్వేషన్లు పాటించాల్సి ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టంలో మార్పు చేయడానికి తన అధ్యక్షతన ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ మంగళవారం అంగీకరించిందన్నారు. బ్యాక్లాగ్పోస్టుల భర్తీ, అవుట్సోర్స్ నియమకాల్లో రిజర్వేషన్ల విషయమై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ మంగళవారం ఇక్కడి విధానసౌధలో సమావేశమై సుధీర్ఘంగా చర్చింది.
ఇందులో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఆంజనేయ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు పొందిన లక్ష మంది రాష్ట్రం లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఈ నియమకాలు ఏవీ రిజర్వేషన్లు అనుసరించి జరగలేదన్నారు. ఇకపై కాంట్రాక్ట్ పద్ధతిలో జరిగే నియామకాల్లోనూ రిజర్వేషన్లు పాటించాల్సి ఉంటుందన్నా రు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బాక్వర్డ్ క్లాస్ అపాయింట్మెంట్-1990 చట్టంలో మా ర్పులు తీసుకువస్తున్నట్లు తెలి పారు.
ఈ మేరకు రూపొం దించిన ముసాయిదా బిల్లుకు రానున్న అసెంబ్లీ సమా వేశాల్లో అనుమతి పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. తను నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖలో ఇకపై కాంట్రాక్ట్ పద్ధతిన నియామకాలు చేపట్టడానికి అంగీకరించబోమని, శాశ్వత ప్రతిపాదికనే నియామకాలు ఉంటాయని తెలిపారు. ఇందుకు రాష్ట్ర ఆర్థిక శాఖతోపాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు.
కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టే నియామకాల్లో అనేక లోపాలు ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మిగిలిన విభాగాల్లో కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తే బాగుంటుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమేనని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ కాని బ్యాక్లాగ్ పోస్టుల వివరాలను అందజేయడానికి సంబంధిత అధికారులకు రెండు నెలలు గడువు ఇచ్చామన్నారు. వివరాలు అందిన వెంటనే నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని వివరించారు.