న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు ఆవిర్భవిస్తున్న కొత్త టెక్నాలజీల ఫలితంగా ఉద్యోగ భద్రత పట్ల మెజారిటీ నిపుణుల్లో (82 శాతం మంది) ఆందోళన వ్యక్తమవుతోంది. వేగంగా మార్పు చెందుతున్న పని వాతావరణాన్ని అధిగమించేందుకు నైపుణ్యాల పెంపు సాయపడుతుందని వారు భావిస్తున్నారు. విద్యార్థులు, నిపుణులు, విద్యావేత్తలు ఇలా రెండు లక్షల మంది అభిప్రాయాలను హీరో వేద్ (హీరో గ్రూప్ కంపెనీ) పరిగణనలోకి తీసుకుని ఒక నివేదికను విడుదల చేసింది.
పని ప్రదేశాల్లో వస్తున్న నూతన మార్పులను, సవాళ్లను అధిగమించడానికి నైపుణ్యాల పెంపు పరిష్కారమని 78 శాతం మంది చెప్పారు. నేటి ఉద్యోగ మార్కెట్‌లో నిలిచి రాణించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అధ్యయనం, నైపుణ్యాల పెంపుపై అవగాహన పెరుగుతుందడానికి ఇది నిదర్శనమని హీరో వేద్ సీఈవో అక్షయ్ ముంజాల్ తెలిపారు. ‘‘సుస్థిరత, సామర్థ్యం, మానసిక ఆరోగ్యంపై నిపుణులు, కంపెనీలు ఒకే విధమైన దీర్ఘకాల దృష్టితో ఉన్నాయి.
దీంతో ఈ రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది’’అని చెప్పారు. కృత్రిమ మేథ (ఏఐ) విజ్ఞానం కలిగి ఉండడం, తమ కెరీర్‌లో మెరుగైన అవకాశాలు అందుకోవడానికి కీలకమని 39 శాతం మంది అంగీకరించారు. తమ సంస్థలు ఏఐపై సరైన శిక్షణ అందించడం లేదని 43 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఏఐ విభాగంలో కావాల్సిన నైపుణ్యాలకు, అందిస్తున్న శిక్షణకు మధ్య అంతరాన్ని ఇది తెలియజేస్తున్నట్టు నివేదిక గుర్తు చేసింది. 18–55 ఏళ్ల మధ్య వయసున్న నిపుణుల్లో 43.5 శాతం మంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అదనపు నైపుణ్యాలు, ముఖ్యంగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని 83 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment