అంబర్‌పేట్‌కు చెందిన రాఘవేందర్ బషీర్‌బాగ్‌లోని ఓ జ్యువెలరీ దుకాణంలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. సోమవారం (జూలై 27న) రాత్రి షాప్ యజమాని తనను పిలిచి ఈ నెల 31 నుంచి పనిలోకి రావొద్దని, బిజినెస్ బాలేనందున పనిలో నుంచి తీసేస్తున్నట్లు చెప్పాడు. కోవిడ్–19 పరిస్థితి చక్కబడ్డాక తిరిగి విధుల్లో చేరొచ్చని సూచించాడు. ఈ వార్త విన్న రాఘవేందర్‌కు గుండెలో రాయి పడినంత పనైంది. 3 రోజుల తర్వాత తన పరిస్థితి ఏమిటనే ఆందోళనలో పడ్డాడు.
ఘట్‌కేసర్‌కు చెందిన విజయ్ ఉప్పల్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో ఆరేళ్లుగా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం వేతనాలిచ్చిన షాప్ యజమాని ఇకపై పనిలోకి రావొద్దని తనతో పాటు మరో ఆరుగురికి చెప్పాడు. దీంతో విజయ్, అతని సహోద్యోగులు తెల్లముఖం వేశారు. ఉన్నట్టుండి ఉద్యోగంలో నుంచి తీసేస్తే ఎలాగంటూ లబోదిబోమంటున్నారు. మొత్తం 18 మంది పనిచేస్తున్న ఆ షాపింగ్ మాల్‌లో ఒకేసారి ఆరుగురిని పనిలో నుంచి తీసేశారు.
సాక్షి, హైదరాబాద్: దుకాణాలు, వ్యాపార సంస్థల్లో పనిచేసే చిరుద్యోగి సంకటంలో పడ్డాడు. లాక్‌డౌన్, అనంతర పరిణామాలతో వారి ఉద్యోగ భద్రత సంక్షోభంలో చిక్కుకుంది. కరోనాతో వివిధ రకాల వ్యాపారాలు డీలా పడటంతో ఈ పరిస్థితి నెలకొంది. నిర్వహణ భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఆయా యాజమాన్యాలు ఉద్యోగుల సర్దుబాటు చేస్తూ వారి సంఖ్యను తగ్గిస్తున్నాయి. వ్యాపారం పుం జుకున్నాక తిరిగి రావాలని సూచిస్తూ వారిని ఇంటికి పంపించేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జూలై 1 నుంచి 15వ తేదీ నాటికే ఏకంగా 38 వేల మంది ఇదే తరహాలో ఉద్యోగం కోల్పోయినట్లు అబిడ్స్‌లోని మార్కెటింగ్ రీసెర్చ్ బ్యూరో పరిశీలనలో తేలింది. గ్రేటర్ పరిధిలోనే కాకుండా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ నగరాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు చర్యలు జరుగుతున్నట్లు పేర్కొంది. దీంతో నిరుద్యోగిత మ రింత పెరిగే అవకాశమున్నట్లు ఆ సంస్థ అభిప్రాయపడింది.
హఠాత్తుగా తొలగిస్తే...
కోవిడ్–19 వ్యాప్తితో పలు వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయి. ఈ సమయంలో వ్యాపారులు తమ ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నారు. తక్షణ చర్యలతో వారికి కొంత లాభం కలిగినప్పటికీ మళ్లీ వ్యాపారం పుంజుకుంటే ఉద్యోగుల సంఖ్య పెంచాల్సిందే. కానీ ఇప్పటికే ఆయా వ్యాపారులను నమ్ముకుని పనిచేస్తున్న వారిని హఠాత్తుగా పనిలో నుంచి తొలగించడంతో ఆయా ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. మరోవైపు ఈ సంక్షోభ పరిస్థితుల్లో కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే సాహసం ఏ వ్యాపారి చేయకపోవడంతో ఉద్యోగాలు కోల్పోయిన వారి జీవనం మరింత దుర్భరంగా మారుతుందని వ్యాపార విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగాల నుంచి తొలగించడం కంటే వేతనాల్లో సర్దుబాటు చేసే అంశంపై దృష్టి పెట్టాలని, పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పాత పద్ధతిలో కొనసాగించాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఇదే తరహాలో తొలగింపులు జరిగితే ఆగస్టు నెలాఖరు నాటికి పరిస్థితి మరింత దారుణమవుతుందని, చిరుద్యోగులు మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉన్నట్లు బిజినెస్ అనలసిస్ట్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment