
ఉద్యోగ భద్రత కల్పించండి
కర్నూలు(న్యూసిటీ): కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.రామాంజనేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సీఐటీయూ ఆశా వర్కర్స్ యూనియన్ మహిళలు, ఏఎన్‌ఎంలు భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో మూడు లక్షల మంది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. ఏఎన్‌ఎంలకు 10వ పే రివిజన్ స్కూలు అమలు చేయాలని వివరించారు. ఏఎన్‌ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. సెకండ్ ఏఎన్‌ఎంలను తొలగింపును విరమించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జాబు వస్తుందని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు.
ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి.రమీజాబీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.15 వేలు నిర్ణయించి అమలు చేయాలని కోరారు. ఆశావర్కర్లకు 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని తెలిపారు. అర్హులైన ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చి, రెండో ఏఎన్‌ఎంలుగా తీసుకోవాలని కోరారు. ఆశా వర్కర్లు కలెక్టరేట్ గేట్లు తీసుకుని లోపలికి వెళ్లటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డగించారు. దీంతో ఆశా వర్కర్లకు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది.
డీఎంహెచ్‌ఓ హామీ:
ఆశా వర్కర్లకు నాలుగు నెలల పెండింగ్ వేతనాలను వారం రోజుల్లోపు చెల్లిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శారద హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.మహాలక్ష్మి, జిల్లా గౌర వాధ్యక్షుడు టి.చంద్రుడు, జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఏఎన్‌ఎం జిల్లా కార్యదర్శి రవినాజ్యోతి, జిల్లాలోని అనేకమంది ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.