గతంలో కుదిరిన ఒప్పందాలను అమలుచేయాలని డిమాండ
అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం
రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ధర్నాలు
సాక్షి నెట్‌వర్క్: తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం అన్ని జిల్లాల్లో వారు పెద్దఎత్తున ధర్నాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ కదంతొక్కారు. ఎక్కడికక్కడ అధికారులకు వినతిపత్రాలిచ్చారు. పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని.. ఖాళీ పోస్టులను రాజకీయ జోక్యం లేకుండా ప్రభుత్వమే భర్తీచేయాలని విజయవాడలో నేతలు డిమాండ్ చేశారు.
రిటైర్‌మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, రూ.60 వేలు పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని, చనిపోయిన ఆశాలకు మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని నరసరావుపేటలో డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం గతంలో చేసుకున్న ఒప్పందాలను వెంటనే అమలుచేయాలని ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తలు కోరారు. ఈ ఒప్పందాలకు సంబంధించి జీఓలు ఇవ్వమంటే కూటమి ప్రభుత్వం తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం సరైనది కాదని ఏలూరు, భీమవరంలో నేతలు అన్నారు.
గత ఆరునెలల్లో సీఎంను, ఆరోగ్యశాఖా మంత్రిని, అధికారులను అనేకసార్లు కలిసి తమ సమస్యలు వివరించి వినతిపత్రాలు ఇచ్చామని.. అయినా ఎలాంటి స్పందనాలేకపోవడంతో రోడ్డు మీదకు రావాల్సి వచ్చిందన్నారు. సకాలంలో జీతాలు ఇవ్వకుండా.. జీతాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇక ఉదయం నుంచీ ఆందోళన చేసినా డీఎంహెచ్‌ఓ కలెక్టరేట్ నుంచి బయటకు రాకపోవడంతో అమలాపురంలో ఆశా కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి దూసుకువెళ్లారు. దీంతో పోలీసులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
తమపై విధించిన ఆంక్షలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, తమను అసభ్యపదజాలంతో పిలుస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని శ్రీకాకుళంలో ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు కనీస వేతనాలు అమలుచేస్తామన్న చంద్రబాబు పట్టించుకోకపోవడం అన్యాయమని విశాఖలో నాయకులు మండిపడ్డారు.
ఐదు నెలలైనా అమలుచేయకపోవడం బాధాకరం..
ఇక తమ ప్రభుత్వం వస్తే ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని టీడీపీ, జనసేన నాయకులు తమ శిబిరాల వద్దకొచ్చి హామీలు ఇచ్చినందున వారికి అధికారం కల్పించారని.. అధికారం పొంది ఐదు నెలలు పూర్తవుతున్నా హామీలు అమలుచేయకపోవడం బాధాకరమని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వారు ఆవేదన వ్యక్తంచేశారు. కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు.
అధికారంలోకి వచ్చాక ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని వారు విమర్శించారు. తమతో అదనపు పనులు చేయించడం అన్యాయమని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆశా వర్కర్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. మిషన్ ఇంధ్రధనస్సు, హౌస్‌హోల్డ్ సర్వే, సంబంధిత ఫార్మెట్లు ఇవ్వకుండా ఆశాలతోనే జిరాక్స్ కాపీల ఖర్చు పెట్టిస్తున్నారని అన్నమయ్య జిల్లా రాయచోటిలో నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment