ఐటీ లైఫ్‌.. కల చెదిరిందా? | Job security losing in IT employees | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ కొలువులపై మెత్తని కత్తి

Published Fri, Jul 14 2017 3:24 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

ఐటీ లైఫ్‌.. కల చెదిరిందా?

ఐటీ లైఫ్‌.. కల చెదిరిందా?

- సాఫ్ట్‌వేర్‌ కొలువులపై మెత్తని కత్తి
- ఉద్యోగ భద్రత లేక అల్లాడుతున్న ఐటీ ఉద్యోగులు
- ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన.. ఇల్లు, వాహనాల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్న ఉద్యోగులు
- నగరంలో గృహ నిర్మాణ కార్యకలాపాలు తగ్గుముఖం
- అమ్మకాలు తగ్గుతున్నాయంటున్న బిల్డర్లు
- కార్ల అమ్మకాల్లోనూ మందగమనం
- అమెరికాలోనూ అదే పరిస్థితి.. ఒక్క కొలువుకు పది మంది పోటీ
- కనుమరుగవుతున్న కన్సల్టెన్సీలు


4,000 నగరంలో గత మూడు నెలల్లో వేటు పడిన ఉద్యోగుల సంఖ్య
65% అమెరికాలో తగ్గిన క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు


సాక్షి, హైదరాబాద్‌:
ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో టెక్నికల్‌ కన్స ల్టెంట్‌గా పని చేస్తున్న విక్రమ్‌రెడ్డి హైటెక్‌ సిటీ ప్రాంతంలో ఓ ఫ్లాట్‌ కొనుగోలు చేయడానికి బిల్డర్‌తో అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. బ్యాంక్‌ రుణానికి దరఖాస్తు చేయడం, బ్యాంక్‌ ఆ మొత్తాన్ని మంజూరు చేయడం చకచకా జరిగి పోయింది. ఇంకేముంది.. సొంతింటి కల నెర వేరుతుందని ఆశపడ్డాడు. అంతలోనే ఆయన పని చేస్తున్న ఆఫీసులో ఒకేరోజు 25 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించడంతో అభద్రతాభా వానికి లోనయ్యాడు. బిల్డర్‌ వద్దకు వెళ్లి తాను చెల్లించిన అడ్వాన్స్‌లో 10 శాతం వదులుకుని మిగిలిన మొత్తాన్ని వెనక్కి తీసుకున్నాడు.

ఇంజనీరింగ్‌ కాగానే ప్రముఖ ఐటీ కంపె నీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేరి ఐదేళ్లుగా పని చేస్తున్న అరవింద్‌కు తల్లిదండ్రులు పెళ్లి సంబం« దం చూశారు. ముహూర్తం కూడా నిర్ణయిం చారు. పెళ్లికి సరిగ్గా మూడు వారాల ముందు ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ కంపెనీ నుంచి అరవింద్‌కు ఆదేశం అందింది. దీంతో దిక్కుతోచని ఆయన కుదుర్చుకున్న పెళ్లిని రద్దు చేసుకున్నాడు.

ప్రముఖ ఐటీ కంపెనీలు ఎడాపెడా ఉద్యో గాలు తొలగిస్తుండటంతో వాటిలో పని చేస్తు న్న వేలాది మంది అభద్రతాభావంతో బిక్కు బిక్కుమంటున్నారు. గడచిన మూడు నెలల్లోనే హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు 4 వేల మం ది ఉద్యోగులను తొలగించాయి. 23  చిన్నాచి తక సాఫ్ట్‌వేర్‌ సంస్థలు మూతపడ్డాయి. కళ్ల ముందే సహచరులు ఉద్యోగాలను కోల్పోతుం డటంతో మిగతావారు భవిష్యత్‌పై బెంగ పెట్టుకుంటున్నారు. ఎప్పుడేమవుతుందో తెలి యక కొందరు.. ఇల్లు కొనుగోలుకు ఇచ్చిన అడ్వాన్స్‌ను వెనక్కి తీసుకుంటున్నారు. సైబరా బాద్‌ ఏరియాలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ బహుళ అంతస్తుల సముదాయంలో ఫ్లాట్‌ బుక్‌ చేసుకున్న ఐటీ ఉద్యోగుల్లో మూడొంతుల మంది ఇలా డబ్బులు వెనక్కి తీసుకున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో సొమ్ము వెనక్కి తీసుకుంటున్నామన్న వారి ఆవేదనను అర్థం చేసుకున్న సదరు సంస్థ అడ్వాన్స్‌ బుకింగ్‌ నగదులో 10% కోత పెట్టకుండానే వెనక్కి ఇచ్చేసింది. మరికొన్ని సంస్థలు మాత్రం కొత్త బుకింగ్‌ వస్తేనే డబ్బులు వాపస్‌ చేస్తామని మొండికేస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలపై ఆధారపడ్డ స్టార్టప్‌ కంపెనీలు కూడా ప్రాజెక్టు ల్లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

‘‘రూ.48 వేల నెలసరి వాయిదాతో ఇల్లు కొనుగోలు చేయవచ్చు. కానీ ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియనప్పుడు అంత రిస్క్‌ తీసుకోవడం అవసరమా? అందుకే నేను ఇల్లు కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకున్నా..’’అని మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న శ్రీనివాస్‌ వాపో యాడు. తన లాంటి వారు వందలాది మంది ఇప్పుడు ఉద్యోగ భద్రత లేక అయోమయంలో పడ్డారని, కొందరైతే పెళ్లిళ్లు కూడా రద్దు చేసుకున్నారని చెప్పాడు. మాదాపూర్‌లో కార్ల డీలర్లు.. గడచిన ఏడాది విక్రయించిన కార్లలో ఈసారి సగం కూడా అమ్మడం లేదు. ‘అమ్మకాల సంగతెలా ఉన్నా... కనీసం ఎంక్వైరీలు కూడా రావడం లేదు. కారు బుక్‌చేసి డెలివరీ అయ్యే సమయానికి రద్దు చేసుకుంటున్నార’ని ప్రముఖ కార్ల డీలర్‌ ఎగ్జిక్యూటివ్‌ సోమసుందర్‌ పేర్కొన్నారు.

కొత్త ప్రాజెక్టులు లేకపోవడం వల్లే..
గడచిన ఏడాది నుంచి కొత్తగా ప్రాజెక్టులు లేకపోవడం వల్లే సీనియర్‌ ఉద్యోగులను వదులుకోవాల్సి వస్తోందని బెంగళూరు ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఐటీ కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఓ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ‘‘2012–2014 సంవత్సరాలతో పోలిస్తే 2014–2016లో దాదాపు అన్ని కంపెనీలకు 26 నుంచి 40 శాతం మేర కొత్త ఆర్డర్లు తగ్గిపోయాయి. ఆ మేరకు మేం ఖర్చులు తగ్గించుకుంటేనే మా ఆదాయాన్ని స్థిరంగా కాపాడుకోగలుగుతాం. అప్పుడే మా ఇన్వెస్టర్లకు మాపై విశ్వాసం సడలకుండా ఉంటుంది. అందుకు.. అవసరం లేని ఉద్యోగులను వదులుకోవడం తప్ప మరో మార్గం లేదు’’అని ఆయన వివరించారు. వృత్తి నైపుణ్యం లేనివారిని వదిలించుకుంటే సమస్య ఏమిటి? దానికి అంతగా గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఉందా అంటూ ముంబై ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ సీనియర్‌ అధికారి ఒకరు అదే వెబ్‌సైట్‌లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అదే నిజమైతే నైపుణ్యం లేని వీరికి ఐదారేళ్లలో వారి వేతనాలను 300 నుంచి 400 శాతం ఎందుకు పెంచాల్సి వచ్చిందని ఐటీ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వారికి కేవలం వారి కంపెనీల బాగు తప్ప సామాజిక బాధ్యత లేదని మండిపడుతున్నారు.

సీనియర్లను వదిలించుకుంటూ..
ఓవైపు సీనియర్‌ ఉద్యోగులను వదిలించుకుంటున్న కంపెనీలు మరోవైపు ఈ ఏడాది జోరుగా క్యాంపస్‌ నియామకాలకు సిద్ధమవుతున్నాయి. వివిధ కాలేజీల నుంచి అందిన సమాచారం ప్రకారం.. గడచిన ఏడాది కంటే ఈ ఏడాది కంపెనీలు 10 శాతం ఎక్కువగా ఉద్యోగులను నియమించుకోబోతున్నాయి. ‘‘మా కాలేజీకి వచ్చే దాదాపు అన్ని కంపెనీలు ఈ ఏడాది 10 శాతం ఎక్కువకు ఇండెంట్‌ ఇచ్చాయి. వాటిలో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలతో పాటు బహుళజాతి కంపెనీలు కూడా ఉన్నాయి’’అని ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ప్లేస్‌మెంట్‌ అధికారి ఒకరు చెప్పారు. గతేడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌కు రాని సంస్థలు కూడా ఈసారి నియామకాలకు ముందుకొస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రారంభ స్థాయి ఉద్యోగులకు తక్కువ వేతనం ఇచ్చి ఎక్కువ పని చేయించుకునేందుకు ఐటీ సంస్థలు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే నాస్కామ్‌ వీటిని తిప్పి కొడుతోంది. కొత్తగా ప్రాజెక్టులు లేనప్పుడు కొత్త ఉద్యోగులతో 75 శాతం పనులు చేసుకోగలుగుతామని చెబుతోంది.

అమెరికాలోనూ ఇదే పరిస్థితి
అమెరికాలోనూ పరిస్థితులు ఇందుకు భిన్నంగా లేవు. ఐటీ ఉద్యోగాల కోసమే ఎంఎస్‌ చేసేందుకు అక్కడికి లక్షల సంఖ్యలో వెళ్లిన విద్యార్థులకు ఉద్యోగం దొరకడం గగనమైంది. గడచిన నాలుగేళ్లలో అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి ఎంఎస్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసిన వారు 2.75 లక్షల మంది ఉన్నారంటేనే ఉద్యోగాల కోసం పోటీ ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ ఏడాది 1.25 లక్షల మంది ఎంఎస్‌ పూర్తి చేసి ఉద్యోగాల కోసం వేట మొదలుపెట్టారు. రెండేళ్ల క్రితం కన్సల్టెన్సీ సంస్థల ద్వారా తేలిగ్గా ఉద్యోగం సాధించిన వారికి ఇప్పుడు అది అంత ఈజీగా లేదు. కన్సల్టెన్సీ సంస్థలు దొంగ సర్వీసు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యూఎస్‌ లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్చరించింది. దీంతో ఈ ఏడాది 13 శాతం కన్సల్టెన్సీలు మూతపడ్డాయి. దానికి తోడు ఐటీ వృత్తి నిపుణులు ఏటా లక్షల సంఖ్యలో యూనివర్సిటీల నుంచి బయటకు వస్తుండటం కూడా ఉద్యోగాలు దొరకకపోవడానికి ప్రధాన కారణమని న్యూయార్క్‌ టైమ్స్‌ ఇటీవల ప్రత్యేక కథనంలో విశ్లేషించింది. ‘ఇప్పుడు అమెరికాలో ఒక వృత్తి నిపుణుడు అవసరం ఉంటే పది మంది పోటీ పడే పరిస్థితి ఉంది. ఇది మున్ముందు మరింత పెరిగే అవకాశాన్ని ఇక్కడి విశ్వవిద్యాలయాలు పెంచి పోషిస్తున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు ప్రాచుర్యం కల్పించి విదేశీ విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసే పనిలో బిజీగా ఉన్నాయి’’అని విరుచుకుపడింది. దానికి తోడు కనీస వార్షిక వేతనం 80 వేల డాలర్లు చేయడంతో ఐటీ సంస్థలు నియామకాలను తగ్గించుకుంటున్నాయి. గతేడాది అమెరికాలో విశ్వవిద్యాలయాల నుంచి జరిపిన రిక్రూట్‌మెంట్లతో పోల్చి చూస్తే ఈ ఏడాది 65 శాతం నియామకాలు తగ్గాయి.
(చదవండి: పుణెలో తెలుగు టెకీ ఆత్మహత్య)

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement