న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు తమ ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. వచ్చే 12 నెలల్లో తాము ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయని 54 శాతం మంది భావిస్తున్నారు. భారత్ విషయంలో ఇది 57 శాతంగా ఉంది. ఉద్యోగాలను కోల్పోతామని ఆందోళన పడుతున్న వారిలో దాదాపు 70 శాతం మంది... కొత్త ఉపాధి అవకాశాలను పొందడంలో తమ యాజమాన్యాలు సహకరిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుండడం మరో విశేషం.
ఆన్‌లైన్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ‘జాబ్స్ రిసెట్ సమ్మిట్’లో విడుదలైన ఒక గ్లోబల్ సర్వే ఈ అంశాలను తెలియజేసింది. దేశాల వారీగా సర్వే అంశాలను పరిశీలిస్తే... దాదాపు 27 దేశాల్లో 12,000కుపైగా ఉద్యోగులపై ఈ సర్వే జరిగింది. రష్యాలో సగటున ప్రతి నలుగురు ఉద్యోగుల్లో ముగ్గురు ఉద్యోగ అభద్రతా భావంలో ఉన్నారు. జర్మనీ విషయంలో ఈ సంఖ్య ఒకటిగా ఉంది. భారత్‌లో 57 శాతం మంది తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన ఉంటే, వీరిలో 25 శాతం మంది ఆందోళన తీవ్రంగా ఉంది. 31 శాతం మందిలో ఒక మోస్తరుగా ఉంది. ఉపాధి అవకాశాలపై ఆందోళనకు సంబంధించి 75 శాతంతో రష్యాలో టాప్‌లో ఉంది. తరువాతి స్థానంలో స్పెయిన్ (73 శాతం), మలేషియా (71 శాతం) ఉన్నాయి. అత్యంత తక్కువగా ఉన్న కింద స్థాయి నుంచి చూస్తే, జర్మనీ (26 శాతం), స్వీడన్ (30 శాతం), నెథర్లాండ్స్, అమెరికా (36 శాతం) ఉన్నాయి. తమ ప్రస్తుత యాజమాన్యం ద్వారా భవిష్యత్ ఉద్యోగం పొందడానికి తగిన, అవసరమైన నైపుణ్యతను పెంచుకోగలుగుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా 67 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ విషయంలో మొదటి స్థానంలో మొదటి స్థానంలో స్పెయిన్ (86 శాతం) ఉంది. తరువాతి స్థానాల్లో పెరూ (84%), మెక్సికో (83%), భారత్ (80%) ఉన్నాయి. జపాన్ ఈ విషయంలో 45 శాతంగా ఉంటే, స్వీడన్ 46 శాతంగా ఉంది. రష్యా విషయంలో ఇది 48 శాతం.
ఆశావాదమే అధికం : గత రెండేళ్లతో పోల్చితే ప్రస్తుతం ఉపాధి కల్పన గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం ప్రధాన సంక్షోభం ఇదే. ఈ నేపథ్యంలో ఉద్యోగ భద్రతపై ఆందోళన ఉంది. అయితే అంతకన్నా ఎక్కువగా ఆశావాదమే కనిపిస్తుండడం ఇక్కడ ప్రధానాంశం -సాదియా జహాదీ, డబ్ల్యూఈఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment