ప్రైవేటు ఉద్యోగుల భద్రతకు త్వరలో చట్టం
- యజమాని మారినా ఉద్యోగ భద్రత
- విశ్వకర్మ జయంతి సభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగంలో మాదిరిగానే ప్రైవేటు రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కంపెనీ యాజమాన్యం మారినా ఉద్యోగులను తొలగించకుండా కొనసాగించేలా నూతన చట్టం రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అకస్మాత్తుగా కంపెనీ మూసేయాల్సి వస్తే కార్మికుడు పొందుతున్న వేతనానికి మూడురెట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా పలు రంగాల్లోని కార్మికులను ఆదివారం ఇక్కడ ఆర్టీసీ కళాభవన్‌లో ఘనంగా సన్మానించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రతి ఏటా భారతదేశ మొట్టమొదటి ఇంజనీరు విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు.
విశ్వకర్మ తయారు చేసిన పనిముట్ల వల్లే దేశంలో లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కలుగుతోందని అన్నారు. విశ్వకర్మ చేసిన సేవలను ప్రపంచానికి తెలియజేయాలనే ఆయన జన్మదినాన్ని జాతీయ కార్మికదినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యరహిత కార్మికుల దినసరి వేతనాన్ని రూ.160 నుంచి రూ.350కి పెంచామని, నైపుణ్యం కలిగిన కార్మికులకు నెలకు రూ.22 వేలు చెల్లించేలా చట్టం తీసుకొచ్చామని వివరించారు. ముద్ర బ్యాంకు ద్వారా ఇప్పటి వరకు రూ.1.80 లక్షల కోట్ల రుణాలు అందజేసినట్లు పేర్కొన్నారు. 43 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ సదుపాయం, 2022 నాటికి దేశంలోని కార్మికులందరికీ గృహవసతి కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పదివేల మంది బీడీ కార్మికులకు ఇళ్లు కట్టించడానికి కార్మికశాఖ సిద్ధంగా ఉందని అన్నారు.
కార్మికుల హక్కులకు సంబంధించిన 44 చట్టాలను నాలుగు కోడ్‌లుగా, వేతనబోర్డు, ఇండస్ట్రియల్ రిలేషన్స్(ఐ.ఆర్), సామాజిక భద్రత, హెల్త్ అండ్ వర్కింగ్ అంశాల విభాగాల ఆధారంగా విభజిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ హీరాలాల్ సమారియా, ఎంబీసీ జాతీయ నాయకులు కేసీ కాలప్ప తదితరులు పాల్గొన్నారు.