Central Labour Department
-
సింగరేణి ఎన్నికలు.. హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సింగరేణి ఎన్నికలపై మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సింగరేణి ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ తాజాగా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. కార్మిక సంఘం ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడంలేదని కేంద్ర కార్మిక శాఖ పిటిషన్ దాఖలు చేసింది. వివరాల ప్రకారం.. సింగరేణి ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును ఆశ్రయించింది. సింగరేణిలో కార్మిక సంఘం ఎన్నికలకు సంస్థ యాజమాన్యం సహకరించడంలేదని హైకోర్టులో పిటిషన్ వేసింది. గత నెల 27న మీటింగ్‌కు సింగరేణి యాజమాన్యం హాజరుకాలేదని కేంద్రం పిటిషన్లో పేర్కొంది. సింగరేణి తుది ఓటర్ల జాబితాను ప్రకటించలేదని తెలిపింది. కోర్టు ఆదేశాలతో ఈనెల 28న ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ చేశామని కేంద్రం వెల్లడించింది. సింగరేణి సహాయ నిరాకరణ వల్ల ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని కేంద్రం పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని సింగరేణి, ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్రం పిటిషన్లో కోరింది. ఇక, సింగరేణి అప్పీల్‌తో కలిపి కేంద్ర కార్మికశాఖ పిటిషన్‌పై ఈనెల 11న విచారణ చేపట్టనున్నట్టు హైకోర్టు తెలిపింది. అంతకుముందు.. కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో అక్టోబర్ 5న విచారణ జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. అయితే, ఈ నెలాఖరులోగా కార్మిక సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని సింగరేణి డివిజన్ బెంచ్‌ను సింగరేణి సంస్థ కోరింది. సింగరేణి యాజమాన్యం అభ్యర్థనపై స్పందన తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ సింగరేణి అప్పీలుపై తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును ఆశ్రయించింది. ఇది కూడా చదవండి: దసరా హాలీడే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఏరోజున అంటే? -
ఇకపై అందరికీ వారానికి నాలుగు రోజులపాటే పని...!
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ విషయంలో కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నాలుగు లేబర్ కోడ్స్ అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే లేబర్ కోడ్స్ అమల్లోకి రావాల్సి ఉండగా.. కొత్త విధివిధానాలను రూపొందించడంలో జాప్యం జరగడంతో లేబర్ కోడ్స్ అమలు నిలిచిపోయింది. వివిధ కార్మిక చట్టాలను సవరించిన వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత; ఆరోగ్యం, పని పరిస్థితులు పేరిట నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ లేబర్ కోడ్స్‌కు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్రం రూపొందించింది. ఉమ్మడి జాబితాలో... కేంద్రం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్స్ ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కూడా విధివిధానాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే 18 రాష్ట్రాలు లేబర్ కోడ్స్ డ్రాఫ్ట్‌ను ప్రచురించాయి. ఈ 18 రాష్ట్రాలు నియమ నిబంధనలను ఖరారు చేసినట్లు ఇటీవల కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ రాజ్యసభలో వెల్లడించారు. అన్ని రాష్ట్రాలూ నిబంధనలను ఖరారు చేశాక వచ్చే ఏడాది నుంచి ఈ లేబర్ కోడ్లు అమల్లోకి రానున్నాయని కార్మిక శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. లేబర్ కోడ్స్ అమలులోకి వస్తే..! ఈ కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే ఉద్యోగుల ప్రాథమిక వేతనం, ప్రావిడెంట్ ఫండ్ లెక్కించే విధానంలో గణనీయమైన మార్పులు రానున్నాయి. ప్రస్తుతానికి పలు కంపెనీలు బేసిక్‌ను తక్కువగా చూపి అలవెన్సుల రూపంలో ఎక్కువ మొత్తం ఇచ్చేవి. కొత్త వేతనాల కోడ్ ప్రకారం.. ఉద్యోగి స్థూల వేతనం 50 శాతం, అలవెన్సులు 50 శాతం చొప్పున ఉండాలి. అంటే ఉద్యోగులు టెక్ హోమ్ శాలరీ తగ్గి, ఆయా కంపెనీలు పీఎఫ్ వాటాలు గణనీయంగా పెరగనున్నాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉద్యోగుల పనిదినాలు కూడా మారనున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న వారానికి ఐదు రోజుల పాలసీకు బదులుగా, వచ్చే ఏడాది నుంచి నాలుగు రోజుల పాటు పనిచేసే అవకాశం ఉద్యోగులకు రానుంది. ఒకవేళ ఈ ప్రతిపాదన వస్తే..ఆ నాలుగు రోజుల్లో ఉద్యోగులు 12 గంటలపాటు పని చేయాల్సి ఉంటుందని కార్మిక శాఖ వెల్లడించింది. చదవండి: క్రిప్టోకరెన్సీ చట్టం: ముగియనున్న సమావేశాలు! క్రిప్టో బిల్లుపై జాప్యానికి కారణాలు ఏంటంటే.. -
e-Shram: కార్మికులకు అండగా ఇ-శ్రమ్
అసంఘటిత రంగంలో అనామకంగా ఉండిపోయిన కార్మికలకు అండగా నిలించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. సంక్షేమం, ఉపాధి, ప్రభుత్వ పథకాలు తదితర అంశాల్లో కార్మికులకు సహాయకారిగా ఉండేందుకు ఇ శ్రమ్ పేరుతో పోర్టల్‌ని ప్రారంభించనుంది. ఎంతమంది కార్మికులు భారత దేశంలో అసంఘటిత రంగంలో దాదాపు 38 కోట్ల మంది కార్మికులు ఉన్నట్టు అంచనా. కోవిడ్ సంక్షోభం సమయంలో లాక్డౌన్ విధించినప్పుడు వీరంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఊరుకాని ఊరిలో ఇటు యజమానులు, అటు ప్రభుత్వ మద్దుతు సరైన సమయంలో అందక ఇక్కట్ల పాలయ్యారు. దీంతో ఇటు పౌర సమాజం, అటు న్యాయస్థానాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అసంఘటిత కార్మికులు ఎంత మంది ఉన్నారు, సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే అంశంపై నిర్థిష్ట కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. ఇ-శ్రమ్ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం లక్ష్యంగా కేంద్రం ఆగస్టు 26న ఇ శ్రమ్ వెబ్ పోర్టల్‌ని అందుబాటులోకి తేనుంది. ఆధార్‌కార్డు ఆధారంగా కార్మికులు తమ వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల అసంఘటిత రంగంలో ఎంత మంది కార్మికులు ఉన్నారు. వీరిలో నిర్మాణ రంగం, వలస కార్మికులు, వీధి వ్యాపారులు ఇలా కేటగిరిల వారీగా ఎంత మంది ఉన్నారనే సమాచారం ప్రభుత్వానికి అందుతుంది. అదే విధంగా ఆయా కేటగిరిల కింద ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకు అందించే వీలు కలగనుంది. ఒకే గొడుకు కిందికి ఇ శ్రమ్ పోర్టల్ అందుబాటులోకి రావడం వల్ల ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్మిక సంఘాలు కూడా ఒకే గొడుకు కిందకు వచ్చే అవకావం ఉంది. దీని వల్ల కార్మికుల సమస్యల వెలుగులోకి రావడంతో పాటు సమస్యల పరిష్కారం సైతం త్వరగా జరిగేందుకు వీలు ఏర్పడనుంది. ఆగస్టు 26న పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. కార్మికుల కోసం హెల్ప్‌లైన్ ఇ శ్రమ్ వెబ్ పోర్టల్‌తో పాటు అసంఘటిత కార్మికుల కోసం కార్మిక శాఖ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయనుంది. అందులో భాగంగా 14434 నంబరును దేశవ్యాప్తంగా కార్మికులకు అందుబాటులోకి తేనుంది. చదవండి: JioMeet : ఆన్లైన్ క్లాసుల కోసం జియోమీట్.. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో -
ఇక వారానికి నాలుగే పనిరోజులు!
న్యూఢిల్లీ: ఇక మీదట వీకెండ్ అంటే రెండు రోజులు కాదు. మూడు రోజులు.. ఎంచక్కా వారానికి మూడు రోజులు రిలాక్స్ అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. అలాగని పనిగంటలు తగ్గిపోతాయని అనుకోవద్దు. మిగిలిన నాలుగు రోజులు ఊపిరి సలపకుండా పనిచేయాల్సి ఉంటుంది. వారంలో నాలుగు రోజులు పనిదినాలుగా మార్చుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు అనుమతినివ్వడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి కొత్త కార్మిక కోడ్లపై కేంద్ర కార్మిక ఉపాధి శాఖ కసరత్తు చేస్తోంది. అయితే వారానికి 48 గంటల పని విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ కంపెనీలు వారానికి మూడు రోజులు వీకెండ్ సెలవులుగా ఇస్తే, నాలుగు రోజులు పనితో ఉద్యోగులకు ఊపిరి కూడా సలపదు. రోజుకి 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ‘‘కంపెనీలు వారానికి మూడు రోజులు సెలవు ఇస్తే, మిగిలిన నాలుగు రోజులు రోజుకి 12గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల అనుమతితోనే ఈ మార్పులు చెయ్యాలి. ఈ విషయంలో ఉద్యోగులు, యాజమాన్యాలపై బలవంతం ఉండదు. కేవలం వారికి ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా పని సంస్కృతిలో మార్పులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాం’’అని కార్మిక ఉపాధి శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర చెప్పారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నిబంధనల మేరకు వారానికి 48 గంటలు పని చెయ్యాలి. అంతకంటే ఎక్కువగా పని చేయించుకోవడం నిబంధనలకు వ్యతిరేకం. మన దేశంలో సాధారణంగా రోజుకి ఎనిమిది గంటలు చొప్పున వారానికి ఆరు రోజులు పని దినాలుగా ఉన్నాయి. సాఫ్ట్ట్వేర్ కంపెనీలు మాత్రమే శని, ఆదివారాలు సెలవు ఇస్తున్నాయి. ఈ కొత్త కార్మికుల కోడ్ అమల్లోకి వస్తే ఏ కంపెనీ అయినా తమ ఉద్యోగుల అనుమతితో వారానికి నాలుగు రోజుల పనిదినాల్ని అమల్లోకి తేవచ్చు. దీంతో పాటు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేలా కూడా కార్మిక కోడ్స్‌లో మార్పులు తీసుకురానున్నారు. 40% పెరిగిన ఉత్పాదకత 2019లో జపాన్‌లో మైక్రోసాఫ్ట్ 4రోజుల విధానాన్ని ప్రయోగాత్మకంగా తెచ్చింది. 4 రోజులు పని చేయడం వల్ల ఆ కంపెనీ ఉత్పాదకత ఏకంగా 40శాతం పెరిగింది. కుటుంబసభ్యులతో కలిసి మూడు రోజులు గడపడం వల్ల మిగిలిన రోజుల్లో రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేశారు. ఇలా చేయడం వల్ల కంపెనీలకు కూడా డబ్బులు ఆదా అవుతాయి. విద్యుత్ ఇతర ఖర్చులు బాగా కలిసొచ్చి ప్రతీ ఏడాది కంపెనీ టర్నోవర్‌లో 2% మిగులుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేసింది. అయితే కేవలం నాలుగు రోజులు పని చేస్తే వినియోగదారుల అంచనాలకు తగ్గట్టుగా పని జరగదన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. మరోవైపు జర్మనీలోని అతి పెద్ద ట్రేడ్ యూనియన్ ఐజీ మెటాల్ ఫోర్ డే వీక్ కోసం గత ఏడాది పిలుపునివ్వడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మన దేశంలో ఈ విధానం అమలు చేయడానికి మరో అయిదేళ్లు పడుతుందన్న అంచనాలున్నాయి. -
ప్రైవేటు ఉద్యోగుల భద్రతకు త్వరలో చట్టం
- యజమాని మారినా ఉద్యోగ భద్రత - విశ్వకర్మ జయంతి సభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగంలో మాదిరిగానే ప్రైవేటు రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కంపెనీ యాజమాన్యం మారినా ఉద్యోగులను తొలగించకుండా కొనసాగించేలా నూతన చట్టం రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అకస్మాత్తుగా కంపెనీ మూసేయాల్సి వస్తే కార్మికుడు పొందుతున్న వేతనానికి మూడురెట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా పలు రంగాల్లోని కార్మికులను ఆదివారం ఇక్కడ ఆర్టీసీ కళాభవన్‌లో ఘనంగా సన్మానించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రతి ఏటా భారతదేశ మొట్టమొదటి ఇంజనీరు విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. విశ్వకర్మ తయారు చేసిన పనిముట్ల వల్లే దేశంలో లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కలుగుతోందని అన్నారు. విశ్వకర్మ చేసిన సేవలను ప్రపంచానికి తెలియజేయాలనే ఆయన జన్మదినాన్ని జాతీయ కార్మికదినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యరహిత కార్మికుల దినసరి వేతనాన్ని రూ.160 నుంచి రూ.350కి పెంచామని, నైపుణ్యం కలిగిన కార్మికులకు నెలకు రూ.22 వేలు చెల్లించేలా చట్టం తీసుకొచ్చామని వివరించారు. ముద్ర బ్యాంకు ద్వారా ఇప్పటి వరకు రూ.1.80 లక్షల కోట్ల రుణాలు అందజేసినట్లు పేర్కొన్నారు. 43 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం, 2022 నాటికి దేశంలోని కార్మికులందరికీ గృహవసతి కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పదివేల మంది బీడీ కార్మికులకు ఇళ్లు కట్టించడానికి కార్మికశాఖ సిద్ధంగా ఉందని అన్నారు. కార్మికుల హక్కులకు సంబంధించిన 44 చట్టాలను నాలుగు కోడ్లుగా, వేతనబోర్డు, ఇండస్ట్రియల్ రిలేషన్స్(ఐ.ఆర్), సామాజిక భద్రత, హెల్త్ అండ్ వర్కింగ్ అంశాల విభాగాల ఆధారంగా విభజిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ హీరాలాల్ సమారియా, ఎంబీసీ జాతీయ నాయకులు కేసీ కాలప్ప తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల సంక్షేమం కోసం కృషి
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్: ఎన్డీయే ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని.. ఇందులో భాగంగానే అసంఘటిత రంగ కార్మికులను ఈఎస్ఐసీ పరిధిలోకి తీసుకురానున్నామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని సీతారాంబాగ్‌లో ఈఎస్ఐసీ డిస్పెన్సరీ, 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికులకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణలోనే అతిపెద్ద మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ ఈఎస్ఐసీ ఆస్పత్రికి కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించిందన్నారు. హైదరాబాద్ పాతనగరంలోని సుమా రు 5 లక్షల మందికి ఈ ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యసేవలు అందించనున్నామన్నారు. కేంద్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో రెండు కొత్త చట్టాలను కూడా అమలులోకి తేనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో ఆస్పత్రిని ఏర్పా టు చేయడం హర్షణీయమన్నారు. రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాల్లో అధ్వానంగా ఉన్న ఈఎస్ఐసీ ఆస్పత్రులను పునరుద్ధరించాలన్నారు. రాష్ట్రంలో అన్ని ఈఎస్ఐసీ డిస్పెన్సరీలను పది పడకల ఆస్పత్రులుగా మారుస్తున్నామని కేంద్రమంత్రి ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్‌లోథ, ఎమ్మెల్సీలు కె. జనార్దన్‌రెడ్డి, సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీ, ఎస్. ప్రభాకర్‌రావు, ఈఎస్ఐసీ మెడికల్ కమిషనర్ ఆర్.కె. కటారియా, డెరైక్టర్ డాక్టర్ సి.హెచ్. దేవికారాణి, రీజనల్ డెరైక్టర్లు ఆర్.ఎస్. రావు, పి.కె. జైన్, మాజీ ఎమ్మెల్యేలు ప్రేమ్‌సింగ్‌రాథోడ్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.