
ఆనిమేటర్లపై పోలీసు జులుం
రాప్తాడు : ఉద్యోగ భద్రత కల్పించాలంటూ 44వ జాతీయ రహదారిపై రాప్తాడు వద్ద ఆనిమేటర్లు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రాస్తారోకో కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. వారిని అరెస్టు చేసి, అనంతరం పూచీకత్తుపై విడిచిపెట్టారు. సీఐటీయూ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో బుధవారం రాప్తాడులో జాతీయ రహదారిపై జిల్లాలోని 63 మండలాల యానిమేటర్లు రాస్తారోకో నిర్వహించారు.
సుమారు రెండు గంటల పాటు అనంతపురం-బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆనిమేటర్లకుఎమ్మెల్సీ గేయానంద్, ఎన్‌జీఓ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి మద్దతు పలికారు. ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మహిళల ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్న ఆనిమేటర్లపై ప్రభుత్వంనిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
పేదరిక నిర్మూలనలో ఆనిమేటర్ల పాత్ర కీలకమైందన్నారు. గత 15 నెలలుగా వారితో వెట్టిచాకిరీ చేయిస్తూ.. కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సంబంధం లేని పనులు చేస్తున్న ఆనిమేటర్లను కట్టుబానిసలుగా చూడడం సరికాదన్నారు. వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు కనీస వేతనంగా రూ.5 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతన బకాయిల చెల్లింపుతో పాటు ఉద్యోగ భద్రత, బీమా కల్పించాలని కోరారు.
అన్నీ మోసపూరిత హామీలే
ఎన్నికల్లో గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసపూరిత వాగ్దానాలు చేశారని వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. హమీలను నెరవేర్చకుండా.. విజయవాడను రాజధానిగా చేసేందుకే నాలుగు నెలలు వెళ్లదీశారని విమర్శించారు. ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హమీలిచ్చి మోసగించారన్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పి, ఇప్పుడు కంటితుడుపుగా దీపావళి కానుకంటూ 20 శాతం రుణాలు మాఫీ చేస్తానని చెప్పడం చంద్రబాబు నయవంచనకు నిదర్శనమన్నారు.
జాబు కావాలంటే బాబు రావాలని టీడీపీ నాయకులు తప్పుడు మాటలు చెప్పి, అధికారంలోకి రాగానే యానిమేటర్లను తొలగించడం దారుణమన్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో ఎసై విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సీఐటీయూ నాయకులు, ఆనిమేటర్లను అరెస్టు చేసి, పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఇంతియాజ్, గోపాల్, నాగరాజు, ఐకేపీ ఆనిమేటర్ల జిల్లా నాయకులు వెంకటేష్, నాగరాజు, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.