జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ఉర్దూ అకాడమీలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న 167 మంది తాత్కాలిక ఉద్యోగులకు వేతన భరోసాతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తమను ఆదుకోవడం ద్వారా పెద్ద మనసు చాటుకున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలోని ఉర్దూ అకాడమీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద గురువారం సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి.. థాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు.
దాపు 1990 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఉర్దూ అకాడమీలో నేరుగా నియామకాలు జరిగాయి. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు తమకు నచ్చిన వారికి తాత్కాలిక సిబ్బంది పేరుతో నియామకాలు చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం–2014 షెడ్యూల్ 10 ప్రకారం తెలంగాణ, ఏపీ ఉర్దూ అకాడమీ సిబ్బంది కేటాయింపు 2015 నవంబర్ 2న పూర్తయింది. దీని ప్రకారం ఏపీకి 182 మంది కన్సాలిడేటెడ్ పే ఉద్యోగులను కేటాయించగా.. ప్రస్తుతం 167 మంది ఏపీలో పనిచేస్తున్నారు. వారికి వేతనాల చెల్లింపునకు అవసరమైన ప్రభుత్వ అనుమతిలేదు.
వారిలోనూ దాదాపు 80 మందికి ఎటువంటి అధికారిక నియామక పత్రాలు, రికార్డులు, అనుమతులు లేకపోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది మార్చిలో సమావేశమైన ఏపీ ఉర్దూ అకాడమీ బోర్డు.. ఉద్యోగులుగా గుర్తింపునకు నోచుకోని 167 కన్సాలిడేటెడ్ పే ఉద్యోగుల జాబితాను ప్రభుత్వానికి నివేదించింది.
ఈ అంశాన్ని పరిశీలించిన ప్రభుత్వం ఏపీ ఉర్దూ అకాడమీలో 69 మంది ఫ్యాకల్టీ, 45 మంది లైబ్రేరియన్స్, 53 మంది సబార్డినేట్లను కన్సాలిడేటెడ్ పే ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు, నిబంధనల ప్రకారం వారికీ వేతనాలు చెల్లించేలా ఈ ఏడాది జూన్ 28న ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్, సభ్యులు, మైనారిటీ శాఖ కార్యదర్శి ఇంతియాజ్ తదితరులకు ఉద్యోగులు కృతజ్ఞతలు చెబుతూ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు.
సీఎం జగన్ పెద్దమనసు వల్లే..
అభివృద్ధి, సంక్షేమమే కాదు.. ఉద్యోగులకు మేలు చేయడంలోనూ పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిరూపించారు. వాస్తవానికి ఉర్దూ అకాడమీలో నిబంధనలకు విరుద్ధంగా గత పాలకులు తమకు నచ్చిన వారికి, నచ్చినట్టు.. కనీసం నియామక పత్రాలు కూడా లేకుండా కన్సాలిడేటెడ్ పే అంటూ కొలువులు ఇచ్చేశారు. ఇప్పుడు వారిని తొలగిస్తే వారి కుటుంబాలు వీధిన పడతాయి. సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసుతో ఉద్యోగ భద్రత, వేతన భరోసా ఇవ్వడం గొప్ప విషయం.
– హిరియల్ నదీమ్ అహ్మద్, ఉర్దూ అకాడమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment