
విధులు నిర్లక్ష్యం చేస్తే ఇంటికే..
అంగన్‌వాడీలపై చర్యలు
వేతనంతో పాటు బాధ్యతలను పెంచిన ప్రభుత్వం
జోగిపేట : చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు పునాదులు వేసి, వారు ఆరోగ్యంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యం వహించినా విధులు సక్రమంగా నిర్వహించకపోయినా గతంలో మాదిరిగా ఊరుకునే పరిస్థితిలేదు. సిబ్బంది ప్రవర్తన, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేయడానికి అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక విధానాలను అమలు చేయనుంది. కేంద్రాల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు చేపట్టనుంది. సిబ్బంది పనితీరుపైనే కేంద్రాల నిర్వహణ ఆధారపడి ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం పలు నిబంధనలను అమలు చేస్తొంది. జీఓ ఎంఎస్ నంబరు 14 ప్రకారం నిబంధనల్లో ఏ ఒక్కటి పాటించకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మార్గదర్శకాలు ఇవే..
ఆహర నిల్వల్లో వ్యత్యాసం, మళ్లింపు, దుర్వినియోగం, నిల్వ పత్రాలు సక్రమంగా లేకపోతే సిబ్బందిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తారు.
ఆహారం శుభ్రంగా ఉండకపోయినా తప్పుదోవ పట్టించినా ఇంటికే..
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కేంద్రాలను నిర్వహించాలి.
అనుమతి లేకుండా కేంద్రాలు తెరవకున్నా ఇతర ప్రాంతాలకు వెళ్లినా, సమయపాలన పాటించకపోయినా రెండు సార్లు మెమోలు జారీ చేస్తారు. అయినా తీరు మారకుంటే విధుల నుంచి తొలగిస్తారు.
మూడు నుంచి ఆరు సంవత్సరాల చిన్నారుల హజరు 90 శాతం ఉండకపోతే మూడు మెమోలు జారీ చేస్తారు. అయినా నిబంధనల మేరకు హాజరు శాతం ఉండేలా జాగ్రత్తలు తీసుకోకపోతే విధుల నుంచి తొలగిస్తారు.
రిజిష్టర్లు సక్రమంగా వినియోగించకపోయినా, తప్పుడు సమాచారం పొందుపరిచినా మూడు మెమోలు జారీ చేస్తారు. తీరు మారకుంటే చర్యలు తీసుకుంటారు.
-అంగన్‌వాడీ కార్యకర్తలు ముందస్తు అనుమతి లేకుండా 15 రోజుల పాటు సెలవులు తీసుకుంటే వేతనంలో అయిదు శాతం కోత విధిస్తారు.
సెక్టారు, ప్రాజెక్టు సమావేశాలకు గైర్హాజరైతే అయిదు శాతం కోత విధిస్తారు.
నెలలో 15 రోజులు గృహ సందర్శన చేయకపోతే వేతనంలో 10 శాతం కోత విధిస్తారు.
బరువు, పోషక విలువలు తక్కువ ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే వేతనంలో 10 శాతం కోత.
ఆహర భద్రత పరిశుభ్రత పాటించకపోతే ఒక మెమో జారీ చేస్తారు. తీరు మారనట్లయితే విధులు నుంచి తొలగిస్తారు.
ఆయాలకు....
కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం వహిస్తే రెండు మెమోలు జారీ చేస్తారు. అయినా వినకుంటే వేతనంలో అయిదు శాతం కోత విధిస్తారు.
ఆహారపదార్థాలను పరిశుభ్రమైన చోట ఉంచకపోతే వేతనంలో అయిదు శాతం కోత.
సమయపాలన ప్రకారం కేంద్రాలను తెరవాలి.
అనుమతి లేకుండా 15 రోజులు సెలవు పెడితే విధుల నుంచి తొలగిస్తారు.
నిబంధనలను సవరించాలి
జీఓ 14లోని నిబంధనలను సవరించాలి. ప్రతిదానికి మెమోలు జారీ చేయడం వల్ల మానసికంగా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. అంగన్‌వాడీ ఉద్యోగులపై అంక్షలు ఎత్తివేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రాయితీలు కల్పించాలి.
- ఇందిర, జోగిపేట ప్రాజెక్టు కార్యకర్తలు, ఆయాల యూనియన్ అధ్యక్షురాలు
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
విధులను నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంగన్‌వాడీ సిబ్బంది నడచుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. మండలాల్లో సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించాలి. నిబంధనల ప్రకారం కార్యకర్తలు, ఆయాల వల్ల తప్పులు జరిగితే మెమోలు జారీ చేస్తాం. మెమోలు జారీ చేసినా వారిలో మార్పులేనట్లయితే శాఖపరమైన చర్యలుంటాయి. - ఎల్లయ్య, జోగిపేట ఐసీడీఎస్ సీడీపీఓ