
వాటర్ వర్క్స్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
కూడేరు :
పీఏబీఆర్ డ్యాంలో ఏర్పాటు చేసిన నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, వారి కుటుంబాలను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓబులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొన్ని నెలలుగా వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటుండటాన్ని నిరసిస్తూ కార్మికులు మంగళవారం కూడేరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చొన్న కార్మికులు నాగరాజు, రామాంజనేయులు, కొండారెడ్డి, శ్రీరాములు, రవి, రమేష్, గంగాధర్‌లకు మద్దతుగా ఓబులు పాల్గొని మాట్లాడారు.
ప్రాజెక్ట్ పరిధిలో ఫేజ్-1, 2, 3లో వందలాది మంది వర్కర్లు పని చేస్తున్నారని, వీరికి నెలకు రూ.7 వేల చొప్పున ఇస్తున్న జీతాన్ని గత ఐదు నెలలుగా చెల్లించడం లేదని అన్నారు. అలాగే ఫేజ్-4 లోను వందల మంది పని చేస్తున్నారని, వీరికి నెలకు రూ. 3 వేలు మాత్రమే జీతం ఇస్తున్నారన్నారు. దానిని కూడా గత ఐదు నెలలుగా ఇవ్వడం లేదన్నారు. ఫలితంగా కార్మికుల కుటుంబాలు పూట గడవని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని ఓబులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం ఉద్యమాలు చేస్తే, అధికారులు రెణ్ణేళ్ల వేతనం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.
కార్మిక చట్టం ప్రకారం కనీస వేతనాలు పెంచాలని, ఏప్రిల్ నుంచి పెంచిన వాటిని తక్షణం చెల్లించాలని, అలాగే కార్మికులపై రాజకీయ వే ధింపులు ఆపాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ వైస్‌ఎంపీపీ రాజశేఖర్, దేవేంద్ర, వెంకటరామిరెడ్డి, ఆంజనేయులు, దండోరా రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాను ప్రకాష్, సీపీఎం నాయకులు నాగేష్, రాధాకృష్ణ, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.