రంగంపేట (తూర్పుగోదావరి): ఎన్నో ఏళ్లుగా అంకిత భావంతో పనిచేస్తున్నా ఉద్యోగ భద్రతగాని, వేతనాలు పెంపుగాని లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్న 104 వాహనం సిబ్బంది. 2008 ఫిబ్రవరి 10వతేదీన నాటి ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఈ పథకం ప్రారంభమయింది. జిల్లా వ్యాప్తంగా 64 మండలాలలోను 26 వాహనాలున్నాయి. దీనిలో లాబ్ టెక్నీషియన్, పార్మసిస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్ పోస్టులలో 165 మంది సిబ్బంది పని చేస్తున్నారు. నెలకు లాబ్‌టెక్నీషియన్‌కు రూ.10,900, డ్రైవర్‌కు రూ.8,000, ఫార్మసిస్టుకు రూ.10,900, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.9,500, వాచ్‌మెన్‌కు రూ.6,700 రూపాయలు ప్రస్తుత వేతనాలు అందిస్తున్నారు.
వీరికి ప్రతి నెలా 7నుంచి 10వతేదీలోగా వేతనాలు అందాలి. అయితే ఒకనెల వేతనం మాత్రం బకాయిగా వుంటుంది. లాబ్‌టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కనీసం 23వేల రూపాయలు, డ్రైవర్లకు 9వేల రూపాయలు వేతనం పెంచాలని ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. గిరిజన ప్రాంతాలకు కొత్త వాహనాలు మంజూరు చేయాలని, మైదాన ప్రాంతంలో వున్న 11 వాహనాల సేవలు విస్తృతం చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సిబ్బంది మనవి చేస్తున్నారు.