సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2012లో ఉద్యోగాలు పొందిన దాదాపు 3 వేల మంది వీఆర్‌ఏలు ఉద్యోగ భద్రత లేక నిరాశతో కొట్టుమిట్టాడుతున్నారు. డైరెక్ట్ రిక్రూటీ వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో విలీనం చేసే అంశాన్ని 6 నెలల్లో పరిష్కరించాలని గతేడాది ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ ఆదేశించినా రెవెన్యూ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో హామీ నెరవేరడం లేదు.
ఉద్యోగాలు వచ్చాయన్న మాటేగానీ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా తెలంగాణలో 4,100 మంది వీఆర్‌ఏలుగా ఉద్యోగాలు పొందారు. వీరిలో 2,500 మంది 2012లో.. 1,600 మంది 2014లో నియమితులయ్యారు. ఉద్యోగాలు వచ్చాయన్నమాటే గానీ ఇప్పటివరకు క్రమబద్ధీకరణ జరగలేదు. ప్రస్తుతం గౌరవ వేతనం కింద నెలకు రూ.10,500 పొందుతున్న వీరికి 010 పద్దు ద్వారా కాకుండా 280–286 పద్దు కింద వరద బాధితుల ఖాతాలో జీతాలు ఇస్తున్నారు.
డీఏ, ప్రసూతి సెలవులూ లేకపోవడంతో తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. అయితే పెండింగ్‌లో ఉన్న ‘రెగ్యులరైజ్’ ఫైలుకు గతేడాది ఫిబ్రవరి 24న సీఎం కేసీఆర్ మోక్షం కలిగించారు. ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో వీఆర్‌ఏలను టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇతర శాఖల్లో విలీనం చేయాలని ఆదేశాలిచ్చారు. ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న డ్రైవర్, అటెండర్ పోస్టుల్లో వీరిని నియమించాలని, ఖాళీల వివరాల ప్రకారం 6 నెలల్లో నియామక ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.
వివరాలున్నా పంపడం లేదు
చాలీచాలని వేతనాలతో ఉద్యోగాలు చేయలేక ఐదారేళ్లలో 1,000 మంది వరకు ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారని, కొందరు ఎలాంటి ప్రయోజనాలు పొందలేక మరణించారని వీఆర్‌ఏలు చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు డైరెక్ట్ రిక్రూటీ వీఆర్‌ఏల వివరాలు టీఎస్‌పీఎస్సీకి ఇచ్చి రోస్టర్ పద్ధతిలో ఇతర శాఖల్లో విలీనం చేయాల్సిన సీసీఎల్‌ఏ అధికారులు ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలే చేయలేదని ఆరోపిస్తున్నారు. ఇటీవలే రాష్ట్రంలోని వీఆర్‌ఏల వివరాలు సేకరించిన సీసీఎల్‌ఏ.. ఆ వివరాలు టీఎస్‌పీఎస్సీకి పంపడం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. సీఎం ఆదేశాలను త్వరగా అమలు చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాయి.
ఈ సమావేశాల్లోనే తేల్చాలి
‘డైరెక్ట్ రిక్రూటీలను ఇతర శాఖల్లో విలీనం చేసే అంశాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను గతేడాది ఫిబ్రవరిలో సీఎం ఆదేశించారు. కానీ ఇప్పటికీ తేల్చలేదు. రాష్ట్రంలో వీఆర్‌ఏల సమాచారం కావాలం టూ కాలయాపన చేస్తున్నారు. మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఉద్యోగాలు వదిలి వెళ్తున్న వారు పెరుగుతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మా విషయం తేల్చాలి’ – వి.ఈశ్వర్, డైరెక్ట్ రిక్రూటీ వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment