
భద్రత ఉద్యోగ లక్షణం!
సర్కారులో చిన్న కొలువుకూ సై అంటున్న యువత
ఉద్యోగ భద్రతకే పట్టభద్రుల పెద్దపీట
ప్రైవేటు రంగంలో ఉన్నత ఉద్యోగానికే మొగ్గు
ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ల అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్: పీజీలు, పీహెచ్‌డీలు చేసినా చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం వైపే ఎక్కువగా మొగ్గుచూపుతోంది నేటి యువత. సర్కారు కొలువైతే ఉద్యోగ భద్రత ఉంటుందని భావిస్తుండటమే దీనికి కారణం. అందుకే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాన్ని కాదని ప్రభుత్వ ఉద్యోగాలకే వారు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అది వీలుకాకపోతే ఉన్నత స్థాయి ఉద్యోగమైతేనే ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు ఎంపికైన తీరు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిపై వర్సిటీ సీనియర్ ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు. వారి రిపోర్టును పరిశీలిస్తే ఉద్యోగ భద్రతనిచ్చే చిన్న ప్రభుత్వ ఉద్యోగానికే యువత ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తేలింది.
ఆర్థిక సంక్షోభం దెబ్బకు...
2009 లో సంభవించిన అమెరికా ఆర్థిక సంక్షోభం ప్రైవేటు ఉద్యోగాల పట్ల విద్యార్థుల్లో భయాన్ని సృష్టించినట్లు వీరి అధ్యయనంలో తేలింది. అప్పటి నుంచి ప్రైవేటు ఉద్యోగాలంటే గాలిలో దీపం అని యువత భావిస్తోంది. 2001-08 మధ్య కాలంలో యువత ఎక్కువగా ఐటీ వైపు దృష్టి సారించేది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలను వదిలి మరి సాంకేతిక కోర్సులు నేర్చుకుని ఐటీ రంగంలో అడుగుపెట్టారు. అయితే ఆర్థిక సంక్షోభం దెబ్బతో పరిస్థితి మారింది. 2009 తర్వాత ఉద్యోగాల ఎంపికలో యువత తీరు మారింది. ప్రైవేటు ఉద్యోగం కంటే ప్రభుత్వంలో చిన్న కొలువున్నా సరే చేరి పోవాలనే నిర్ణయానికి వచ్చారు.
చిన్న ఉద్యోగాలకూ భారీగా పోటీ..
గ్రూప్-1, గ్రూప్-2 లాంటివే కాకుండా వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వంటి చిన్న సర్కారు ఉద్యోగాలకు సైతం యువత భారీగా పోటీపడుతోంది. సర్కారు కొలువులకు చదువుకునేవారు అవసరమైన వాతావరణం ఉంటుందనే భావనతో ఎక్కువగా వర్సిటీలో చే రేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో గత ఐదేళ్లలో వర్సిటీలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది.
కంపెనీల వర్సిటీ బాట..
మరోవైపు గత ఐదేళ్ల నుంచి అనేక కంపెనీలు ఓయూలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ చేపడుతున్నాయి. గతేడాది వరకు దాదాపు 40 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. కంపెనీల సంఖ్యతో పాటు ఉద్యోగాల కోసం నమోదు చేసుకునే అభ్యర్థుల సంఖ్య, కొలువులు సాధించిన వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. అయితే అత్యధిక శాతం మంది ఐటీ ఉద్యోగాల వైపే వెళుతున్నారు. ప్రైవేటులో చిన్న ఉద్యోగాలైతే ఆఫర్లు కాదనుకొని క్యాంపస్‌లోనే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు.
ప్రైవేటు జాబ్ వచ్చినా చేరరు..
కొన్నాళ్లుగా ఓయూలో ఇంజనీరింగ్ తర్వాత ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసిన వారే ఎక్కువగా కార్పొరేట్ ఉద్యోగాల్లో చేరారు. అలా చేరని వారు ప్రైవేటు ఉద్యోగాలను కాదని నెట్, జేఆర్‌ఎఫ్, గ్రూప్స్ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యారు. ఇక ఆర్ట్స్ కోర్సులు చేసిన వారు ప్రైవేటులో చిన్న ఉద్యోగాలకు ఆఫర్లు వస్తున్నా ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.