2వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్లపై వేటు!
ఏకీకృత సర్వీసు పేరిట ఇంటికి పంపాలని సర్కారు నిర్ణయం
సాక్షి, అమరావతి: జాబు కావాలంటే బాబు రావాలన్నారు. ఇది 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు మాట. ఆ మాట చెప్పి ఎన్నికల్లో నెగ్గిన చంద్రబాబు సీఎం పీఠంపై కూర్చుని మూడేళ్లు గడిచిపోయాయి. కొత్తగా ఉద్యోగాల కల్పన మాట అటుంచి ఉన్న ఉద్యోగాలకు సైతం ఆయన ఎసరు పెడుతున్నారు. తాజాగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లపై వేటు వేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రస్తుతం 4000 మంది వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 1900 మందికి పైగానే ఇంటికి పంపాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
కొద్దిరోజుల్లోనే ఈ మేరకు ఉత్తర్వులు వెలువడే అవకాశముందని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకీకృత సర్వీసు నిబంధనల పేరిట ప్రభుత్వం వీరిపై వేటు వేయాలని చూస్తోంది. తమను రెగ్యులర్ చేయాలని గత ఏడాదిలో వీరు సమ్మె చేయగా ప్రభుత్వం వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, దశల వారీగా రెగ్యులర్ పోస్టుల్లో నియమిస్తామని హామీ ఇచ్చింది. తీరా ఇప్పుడు అసలుకే ఎసరు తెస్తూ హూస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
ఇలా ఇళ్లకు పంపుతారా?
ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలపై కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడం, దానిపై కేంద్రం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏకీకృత సర్వీసు నిబంధనలను రూపొందిస్తోంది. ఈ నెల 16లోపు వీటి ముసాయిదాకు తుది రూపు ఇచ్చి అనంతరం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇదే ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్లకు శాపంగా మారుతోంది. దాదాపు 18 ఏళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చి, ఇప్పుడు తమ జీవితాలను అంధకారంలోకి నెడుతున్నారని వారు ఆక్రోశిస్తున్నారు.
21న గుంటూరులో నిరసన
తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఏకంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని చూడడం దారుణమని ప్రభుత్వ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు గాంధీ, ఇతర నాయకులు ధ్వజమెత్తుతున్నారు. దీనిపై ఈ నెల 21న చలో గుంటూరు కార్యక్రమానికి పిలుపు నిస్తున్నామన్నారు.