వర్సిటీల్లో అధ్యాపక పోస్టులు భర్తీ అయ్యేనా!
⇒ రెగ్యులరైజేషన్ కోసం ఆందోళన ఉధృతం చేసిన కాంట్రాక్టు లెక్చరర్లు
⇒ పోస్టుల భర్తీ, క్రమబద్ధీకరణపై ఏం చేయాలన్న ఆలోచనల్లోనే ప్రభుత్వం
⇒ పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు పెండింగ్‌లోనే..
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు ఇప్పట్లో భర్తీ అవుతాయా? లేదా? అన్న సందిగ్ధత నెలకొంది. ఓవైపు కాంట్రాక్టు లెక్చరర్ల నిరవధిక సమ్మె.. మరోవైపు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలన్న డిమాండ్.. ఇంకోవైపు పోస్టులను భర్తీ చేయాలంటున్న నిరుద్యోగుల డిమాండ్లతో యూనివర్సిటీల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఒక్కొక్కటి పరస్పరం ఒక్కో సమస్యతో ముడిపడి ఉండటంతో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇద్దామంటే సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలంటూ కాంట్రాక్టు లెక్చరర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు.
పైగా రెగ్యులరైజ్ చేస్తామంటూ సీఎం హామీ ఉండటం.. పోనీ అదీ చేద్దామన్నా న్యాయ పరమైన చిక్కులతో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుదామంటే నోటిఫికేషన్లు ఇవ్వరా? అంటూ నిరుద్యోగుల ఆందోళనలతో ప్రభుత్వం సతమతం అవుతోంది. దీంతో ప్రభుత్వం ఈ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఈ పరిస్థితుల్లో యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ నియామకాలు ఇప్పట్లో అయ్యేనా? అన్న అనుమానాలు నెలకొన్నాయి.
దశల వారీగానైనా నియామకాలు జరిగేనా?
ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులు మొత్తంగా 2,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ప్రాధాన్య క్రమంలో పోస్టులను భర్తీ చేయాలని ఇదివరకే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏయే యూనివర్సిటీలో ఏయే సబ్జెక్టుల పోస్టులను మొదట భర్తీ చేయాలి? ఏయే పోస్టులను రెండో దశలో భర్తీ చేయాలి? అన్న అంశాలపై వర్సిటీల వారీగా వివరాలను సేకరించి, అవసరాలను గుర్తించి నివేదిక అందజేయాలని ప్రభుత్వం తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఆదేశించింది. దీంతో మండలి ఆ కసరత్తు పూర్తి చేసి గత నవంబరు నెలలోనే ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఇందులో మొదటి దశలో 11 యూనివర్సిటీల్లో 32 ప్రొఫెసర్ పోస్టులను, 109 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను, 701 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మొత్తంగా 842 అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని పేర్కొంది.
అలాగే రెండో దేశలో 586 పోస్టులను భర్తీ చేయాలని, రెండు దశల్లో 1,428 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే అవి నవంబరులో ప్రభుత్వానికి నివేదిక అందజేసే సమయానికి ఉన్న ఖాళీలు మాత్రమే. ఈ రెండు నెలల కాలంలోనూ పలు పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగుల సమస్య, కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ తంటాలు వచ్చి పడ్డాయి. పైగా యూజీసీ నిబంధనలు, యూ నివర్సిటీల పోస్టుల భర్తీ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్ అంత సులభం కాదని ఉన్నత విద్యాశాఖ వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం రెండు దశల్లో 1,428 పోస్టులను భర్తీ చేయాలని భావిస్తుండగా.. కాంట్రాక్టు లెక్చరర్లే 1,531 మంది వరకు ఉన్నారు. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ప్రభుత్వం పడింది.