పాస్‌బుక్, టైటిల్ డీడ్ లేకుండానే..పంట రుణం
గత నెలలోనే ఆర్డినెన్స్ జారీ
⇒ అయినా పట్టించుకోని బ్యాంకులు
⇒ ఆర్డినెన్స్‌కు ప్రచారం లేకపోవడమే కారణం
⇒ ఇకపై టైటిల్‌డీడ్ కమ్ పాస్‌బుక్ ఒకటే రికార్డు
⇒ ఆన్‌లైన్‌లోనే ఆర్‌వోఆర్ రికార్డుల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్
పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ లేకుండానే రైతులకు పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. నెల రోజుల కిందే ఈ ఆర్డినెన్స్‌ను అమల్లోకి తెచ్చింది. ‘తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ (అమెండ్‌మెంట్)’పేరుతో గత నెల 17న జారీ చేసిన ఆర్డినెన్స్‌లో దీనితో సహా పలు కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. వాటి ప్రకారం రాష్ట్రంలో బ్యాంకులు రైతుల వద్ద పూచీకత్తు పత్రాలేవీ తీసుకోకుండానే రుణాలు మంజూరు చేయాలి. కానీ ఈ ఉత్తర్వులు ఇంకా క్షేత్రస్థాయిలో అమల్లోకి రాలేదు. పట్టాదారు పాస్ పుస్తకం లేదా టైటిల్ డీడ్, సంబంధిత వ్యవసాయ అధికారి ధ్రువీకరణ ఉంటే తప్ప రుణం ఇచ్చే ప్రసక్తే లేదంటూ బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను తగినంతగా ప్రచారం చేయకపోవడం, విధి విధానాల అమలుపై దృష్టి కేంద్రీకరించక పోవటంతో ఈ పరిస్థితి నెలకొంది.
టీఎల్‌ఆర్‌ఎంఎస్‌లో భూముల వివరాలు
ఆర్డినెన్స్ ప్రకారం రాష్ట్రంలో భూముల యా జమాన్య సంబంధిత రెవెన్యూ రికార్డులన్నీ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్) ఎలక్ట్రానిక్ నమూనాలో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏ సర్వే నంబర్‌లో ఉన్న భూమి అయినా ఏ రైతుకు చెందినదో తెలుసుకునేందుకు వీలుగా ‘తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (టీఎల్‌ఆర్‌ఎంఎస్)’ను రూపొందించారు. టీఎల్‌ఆర్‌ఎంఎస్‌తో పాటు మీసేవ పోర్టల్‌లో ఈ వివరాలు అందుబాటులో ఉంటాయి. బోగస్ పాస్‌బుక్‌లు, టైటిల్‌డీడ్లకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
పాత పద్ధతి వీడని బ్యాంకులు
కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకర్లు టీఎల్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లోని లోన్ మాడ్యుల్ ద్వారా రైతుకు సంబంధించిన భూమి వివరాలు పరిశీలించి.. వారికి ఇవ్వగలిగిన స్థాయిలో పంట రుణాన్ని మంజూరు చేయాల్సి ఉంది. అంతేతప్ప రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లను తమ వద్ద పెట్టుకోవద్దు. కానీ ఈ ఆర్డినెన్స్ అమలుపై ప్రభుత్వం ఇంకా దృష్టి సారించకపోవడంతో.. బ్యాంకులు పాత పద్ధతిలోనే పాస్‌బుక్‌లు, టైటిల్ డీడ్‌లను తనఖాగా పెట్టుకుని రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈనెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో దాదాపు 8.15 లక్షల మంది రైతుల పంట రుణాలు రెన్యువల్ చేయగా... కేవలం 1,712 మందికి మాత్రమే లోన్ మాడ్యుల్ పద్ధతిలో రుణాలు మంజూరు చేసినట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి.
ఇకపై ఒకటే ఎలక్ట్రానిక్ పాస్‌బుక్
ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్‌లు వేర్వేరుగా ఉండకుండా.. వాటి స్థానంలో టైటిల్ డీడ్–పాస్‌బుక్ పేరుతో ఒకటే రికార్డు ఉంటుంది. ఈ ఏడాది చివరిలోగా అత్యంత భద్రమైన ఎలక్ట్రానిక్ కార్డు రూపంలో దీనిని అందజేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు బోగస్ రిజిస్ట్రేషన్లు, డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు కళ్లెం చేసేందుకు టీఎల్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లో ఉన్న వివరాలతోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.