చిన్న, సన్నకారు రైతులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద ఊరట కల్పించింది. రైతులకు పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాల పరిమితిని రూ.1.66 లక్షల నుండి రూ. 2 లక్షలకు పెంచింది. ద్రవ్య విధాన కమిటీ సమావేశం పూర్తయిన అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తన ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
“వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు, మొత్తం ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.6 లక్షల నుండి రూ. 2 లక్షలకు పెంచాలని నిర్ణయించడం జరిగింది. ఇది చిన్న, సన్నకారు రైతులకు రుణ లభ్యతను మరింత పెంచుతుంది.’’ అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితి పెంపునకు సంబంధించి ఆర్బీఐ త్వరలో ప్రత్యేక సర్క్యులర్‌ను జారీ చేయనుంది. ఈ రుణాలను రుణాలు పొందడానికి రైతులు హామీగా ఎలాంటి ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితిని చివరిసారిగా 2019లో సెంట్రల్ బ్యాంక్ సవరించింది. అప్పట్లో రూ. 1 లక్ష నుండి రూ. 1.6 లక్షలకు పెంచింది.
రైతుల మేలు కోసం..
చిన్న, సన్నకారు రైతుల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం 2019 ఫిబ్రవరిలో రూ.3 లక్షల లోపు ఉన్న క్రాప్ లోన్‌లకు ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, తనిఖీ, లెడ్జర్ ఫోలియో ఛార్జీలను కూడా మాఫీ చేసింది. అంతకు ముందు 2014లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల (సిఐసి) నుండి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌లను (సిఐఆర్) పొందేందుకు తగిన నిబంధనలను తమ క్రెడిట్ అప్రైజల్ ప్రాసెస్‌లు/లోన్ పాలసీలలో చేర్చాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించింది. తద్వారా క్రెడిట్ నిర్ణయాలు సిస్టమ్‌లో అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడి ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment