సాక్షి, అమరావతి : వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ పథకంపై ఈనాడు మరోసారి విషం కక్కింది. రైతులను గందరగోళపర్చేలా.. వాస్తవాలకు ముసుగేసి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. చిన్న, సన్నకారు, వాస్తవ సాగుదారులు సాగుకోసం తీసుకునే పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడం ద్వారా వారిలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే లక్ష్యంగా అమలుచేస్తున్న వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకంపై తన అక్కసును వెళ్లగక్కింది. ‘పావలా తీసేసి.. సున్నా చుట్టేశారు’.. అంటూ అబద్ధాలను అచ్చేసింది. ఈ అవాస్తవ కథనంపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే..
ఆరోపణ : గతంలో తక్షణమే ప్రయోజనం..
వాస్తవం : సీజన్‌లో ప్రతీ రైతు వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకునేవారు. రూ.లక్షలోపు రుణాన్ని తిరిగి చెల్లిస్తే బ్యాంకులు వసూలుచేసే ఏడు శాతం వడ్డీలో మూడుశాతం కేంద్రం రాయితీ ఇస్తోంది. మిగిలిన నాలుగు శాతం రైతులు భరించేవారు. గతంలో ‘వడ్డీలేని రుణ పథకం’ కింద రైతులు చెల్లించిన వడ్డీ రాయితీని బడ్జెట్ కేటాయింపులను బట్టి ఏడాదికో.. రెండేళ్లకో బ్యాంకులకు జమ చేసేవారు.
ఈ మొత్తాన్ని బ్యాంకులు రైతులు చెల్లించాల్సిన అప్పు ఖాతాలకు సర్దుబాటు చేసుకునే వారు. గతంలో క్లైయిమ్స్ డేటాను అప్‌లోడ్ చేయడానికి నోడల్ బ్రాంచ్‌లకు మాత్రమే యాక్సెస్ ఉండేది. బ్రాంచ్‌లకు ఉండేది కాదు. ఎంతమంది అర్హత పొందారు.. వారికెంత వడ్డీ రాయితీ జమైందో రైతులకే కాదు.. బ్యాంకులకు కూడా తెలిసేది కాదు. బ్యాంకుల వద్ద కానీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ ప్రదర్శించే పరిస్థితులు ఉండేవి కాదు.
ఆరోపణ : సవాలక్ష నిబంధనలు?
వాస్తవం : వడ్డీలేని రుణ పథకానికి మరింత మెరుగులు దిద్ది ఖరీఫ్–2019 నుంచి ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని’ అమలుచేస్తున్నారు. వడ్డీ రాయితీ చెల్లింపుల్లో జాప్యానికి తావులేకుండా ఉండేందుకు ఏడాదిలోపు రుణం చెల్లించిన లబ్ధిదారుల డేటా బ్యాంకుల ద్వారా ఎస్వీపీఆర్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
ఈ డేటా ఈ–క్రాప్ డేటాతో ధ్రువీకరించిన తర్వాత అర్హులైన రైతుల జాబితాను గుర్తించి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. మొబైల్ ద్వారా https:// karshak.ap.gov.in/ysrsvpr/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి హోంపేజి లో ‘ జుnౌఠీ yౌuట ట్ట్చ్టuట’’ అనే విండో ఓపెన్ చేసి ఆధార్ నంబరుతో చెక్ చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు. ఒకవేళ వడ్డీ రాయితీకి అర్హత పొంది, జాబితాలో తమ పేర్లు లేకపోతే దరఖాçస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతకంటే పారదర్శకత ఏముంటుంది?
ఆరోపణ : కేవలం 12.3 శాతం మందికే వర్తింపు..
వాస్తవం : ఏటా 65 లక్షల మంది రుణాలు తీసుకుంటారు. వీరిలో ఏడాదిలోపు రుణాలు తీసుకునే వారికి ఏటా రూ.3వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.15వేల కోట్ల వడ్డీ రాయితీ చెల్లించాలి కదా అంటూ ఈనాడు కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. చంద్రబాబు హయాంలో రైతులు పొందిన రుణాలను బట్టి ఏటా రూ.2,500 కోట్ల చొప్పున కనీసం 12వేల కోట్లకు పైగా వడ్డీరాయితీ చెల్లించాలి కదా.
కానీ, టీడీపీ ఐదేళ్లలో వడ్డీ రాయితీ చెల్లించింది ఎంతో తెలుసా అక్షరాలా 40.61 లక్షల మందికి కేవలం రూ.685.46 కోట్లు మాత్రమే. చెల్లించిన మొత్తం కంటే ఎగ్గొట్టిన బకాయిలే అధికం. ఏకంగా 39.08 లక్షల మందికి రూ.1,180.66 కోట్లు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదే. పోనీ ఐదేళ్ల పాలనలో ఇంత తక్కువ వడ్డీ రాయితీ ఎందుకు చెల్లించావని కానీ, బకాయిలు ఎందుకు ఎగ్గొట్టావ్ బాబు అని కానీ ఏనాడు రామోజీ సింగిల్ కాలమ్ వార్త రాసిన పాపాన పోలేదు కదా..
ఆరోపణ : అరకొరగా పథకం అమలు..
వాస్తవం : చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.1,180.66 కోట్ల చెల్లింపునకు ముందుకొచ్చి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన వెంటనే అణాపైసలతో సహా బకాయిలు చెల్లించి రైతులపట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఇక 57 నెలల్లో బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా 73.88 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.1,834.55 కోట్లు వడ్డీ రాయితీ సొమ్మును జమచేసింది. రబీ 2021–22, ఖరీఫ్ 2022 సీజన్లకు సంబంధించి అర్హత పొందిన 10.79 లక్షల మంది రైతులకు రూ.220 కోట్ల సున్నా వడ్డీ రాయితీ మొత్తాన్ని త్వరలో వారి ఖాతాలకు జమచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది.
బాబు హయాంలో సగటున ఏటా రూ.137 కోట్ల వడ్డిరాయితీ చెల్లిస్తే ఈ ప్రభుత్వం త్వరలో చెల్లించబోయే మొత్తంతో కలుపుకుంటే సగటున రూ.421 కోట్లు చెల్లించినట్లవుతుంది. ఎవరి హయాంలో వడ్డీ రాయితీ ఎక్కువగా చెల్లించారో ఇంతకంటే ఏం చెప్పాలి. నిజంగా అరకొరగా అమలుచేయాలని ఆలోచన చేస్తే బాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించాల్సిన అవసరమేముందో రామోజీకే తెలియాలి.
ఆరోపణ : అంతంతమాత్రంగానే పంట రుణాలు..
వాస్తవం : బాబు ఐదేళ్ల పాలనలో 3.97 కోట్ల మందికి రూ.3.64 లక్షల కోట్ల రుణాలు అందిస్తే.. ఈ ప్రభుత్వ హయాంలో గడిచిన 57 నెలల్లో ఏకంగా 5.17 కోట్ల మంది రైతులకు రూ.8.59 లక్షల కోట్ల పంట రుణాలు అందించారు. పంట సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్సీ) ద్వారా ఇప్పటివరకు 14.13 లక్షల కౌలు రైతులకు రూ.8,346 కోట్ల వ్యవసాయ రుణాలు అందించారు.
ప్రస్తుత 2023–24 సీజన్‌లో రికార్డుస్థాయిలో 8.31 లక్షల కౌలు రైతులకు సీసీఆర్సీలు జారీచేయగా, ఇప్పటికే వారిలో 5.48 లక్షల మందికి రూ1,907.8 కోట్ల వ్యవసాయ రుణాలు అందించారు. బాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించడమే కాదు.. రుణాల మంజూరులో కానీ, సున్నా వడ్డీ రాయితీ చెల్లింపుల్లో కానీ రైతు సంక్షేమమే పరమావధిగా ముందుకెళ్తుంటే ఈనాడు మాత్రం బురదజల్లడమే పనిగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment