పోస్టు ద్వారా పాస్‌బుక్
పోస్టు ద్వారా పాస్‌బుక్
Published Sat, Aug 10 2013 2:08 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : పట్టాదారు పాస్‌పుస్తకాల జారీలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. రెవెన్యూ సిబ్బంది అవినీతికి అడ్డుకట్ట పడనుంది. వ్యవసాయ భూముల కొనుగోలు సమయంలో రూ.100 చలానా కడితే 45 రోజుల్లో పోస్టు ద్వారా పట్టాదారుపాస్ పుస్తకం ఇంటి అడ్రసుకు బట్వాడా కానుంది. ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలోనే ఈ విధానం అమలులోకి రానుంది. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో పాస్‌పుస్తకాల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. డిమాండ్ బట్టి పాస్ పుస్తకానికి రూ.10 వేల నుంచి రూ.50 వేలు వరకు రెవెన్యూ సిబ్బంది వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
అడిగినంత ముట్టజెప్పినా అనేక మందికి ఏళ్ల తరబడి పాసుపుస్తకాలు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో వాటి జారీని సులభతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పేర్లు, విస్తీర్ణం ఆధారంగానే రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడినట్టయింది. కొత్త విధానం ప్రకారం తాజాగా భూముల కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకునే సందర్భంలో పట్టాదారు పాసుపుస్తకాల కోసం అదనంగా రూ.100 చలానా తీయాల్సి ఉంటుంది. పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే భూముల రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఆ శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో రెవెన్యూ శాఖకు సమాచారాన్ని చేరవేస్తారు.
దీని ఆధారంగా రెవెన్యూ సిబ్బంది ఆయా భూములకు సంబంధించి తమ కంప్యూటర్లలో యజమాని పేరు, కొనుగోలు చేసిన విస్తీర్ణం మార్పు చేసి ఆన్‌లైన్‌లో వెంటనే సమాచారాన్ని హైదరాబాద్‌కు పంపుతారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. పాస్‌పుస్తకాల జారీ కోసం ఒక ప్రైవేటు ఏజెన్సీని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రెవెన్యూ కార్యాలయాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ప్రైవేటు ఏజెన్సీల నిర్వాహకులు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం ముద్రించి నేరుగా భూముల యజమానులకు పోస్ట్‌లో పంపుతారు. అది పూర్తికాగానే ట్యాంపర్ ప్రూఫ్‌తో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు(కార్డులు) జారీ ప్రక్రియ 45 రోజుల్లో పూర్తవుతుంది. గ తంలో భూముల కొనుగోలు సమయంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో కొనుగోలుదారు పేరు, వయసు, ఊరు వివరాలు మాత్రమే రాయించే వారు.
ఇక నుంచి ఇంటి పేరుతో సహా పూర్తి పేరు, చిరునామా రాయిస్తేనే కొనుగోలుదారు పేరు మీద ముద్రించే పట్టాదారు పాస్‌పుస్తకం నేరుగా పోస్టులో ఇంటికే వస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం పోస్టులో వచ్చే పాస్‌పుస్తకం లామినేషన్‌కార్డు రూపంలో ఉంటుందని, ప్రస్తుతం ఉన్నట్టు పుస్తక రూపంలో ఉండదని అధికారులు చెబుతున్నారు. కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ప్రస్తుతానికి ఈ విధానం అమలులో ఉంటుంది. దశల వారీగా పాత వారికి కూడా ఈ పద్ధతిని అమలుకు అవకాశముంది.
Advertisement
Advertisement