కొత్త పాస్ పుస్తకాల పంపిణీపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహిస్తున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ నంబర్‌ను కచ్చితంగా అనుసంధానం చేయాలని రైతులకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. లేదంటే పాస్ పుస్తకాల్లోని భూములను బినామీ ఆస్తులుగా గుర్తించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. భూ రికార్డులకు ఆధార్ కార్డు లింక్ చేయడానికి కొంతమంది ముందుకు రావడం లేదని, ఇప్పటికైనా వారందరూ ఆధార్ నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘భూ రికార్డులను పక్కాగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేస్తున్నాం. మేడ్చల్, రంగారెడ్డితో పాటు కొన్ని జిల్లాల్లో కొందరు తమ ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయించుకోలేదు. అలాంటి వారందరూ అధికారులకు ఆధార్ నంబర్ ఇవ్వాలి. లేకుంటే అవన్నీ బినామీలుగా గుర్తించే అవకాశం ఉంది’’అని స్పష్టం చేశారు. పాస్ పుస్తకాల పంపిణీపై ప్రగతి భవన్‌లో సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సీఎస్ ఎస్.కె.జోషి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రాజేశ్వర్ తివారి, భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ప్రత్యేక అధికారి వాకాటి కరుణ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇతర పట్టాదారులతోపాటుగానే అసైన్డ్ భూములున్న వారికి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. అసలు లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న భూములను గుర్తించి, వాటి యాజమాన్యంపై స్పష్టతనివ్వాలని, వారి పేరిట పాస్ పుస్తకాలు తయారు చేయాలని ఆదేశించారు.
వ్యవసాయేతర భూమిని నమోదు చేయాలి
వ్యవసాయ భూమి ఉన్న రైతుకు అదే గ్రామంలో వ్యవసాయేతర భూమి ఉంటే, ఆ వివరాలు కూడా పాస్ పుస్తకంలో నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. అందుకు అదనపు కాలమ్ పెట్టాలని సూచించారు. ‘‘మార్చి 11న పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించిన మాట నిజమే. అయితే అసైన్డ్ భూముల యజమానులను గుర్తించడం, వివరాలను పరిశీలించడం, వ్యవసాయేతర భూముల వివరాలు కూడా నమోదు చేయడం లాంటి పనులన్నీ చేయడానికి కొంత సమయం పడుతుంది. పాస్ పుస్తకాల తయారీ పక్కాగా జరిగిన తర్వాతే పంపిణీ కార్యక్రమం చేపట్టాలి. సొంత భూమి ఉన్న రైతులతోపాటు ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూమిని సాగు చేసుకుంటున్న రైతుల వివరాలు కూడా సేకరించాలి. వారికి కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. అందుకు కొంత అదనపు సమయం పడుతుంది. అయినా ఫర్వాలేదు. కలెక్టర్లతో మాట్లాడి కచ్చితమైన వివరాలు తెప్పించాలి. అసైన్డ్‌దారులకు కూడా భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత ఇవ్వాలి. తొందరపాటులో పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. పాస్ పుస్తకాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతీ ఎంట్రీని క్షుణ్ణంగా పరిశీలించాలి’’అని సీఎం పేర్కొన్నారు.
మార్చికల్లా అన్ని గ్రామాలకు మంచినీరు
ఈ ఏడాది మార్చి 31 నాటికి అన్ని గ్రామాలకు మంచినీళ్లు అందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామాలకు పైపులైన్లు వేసుకుంటూనే సమాంతరంగా అంతర్గత పైపులైన్ల నిర్మాణ పనులు కూడా చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో అంతర్గత పైపులైన్లు నిర్మించి, ఇంటింటికీ నల్లాలు బిగించి మంచినీళ్లు సరఫరా చేసే విషయంలో ఎమ్మెల్యేలు చొరవ చూపాలన్నారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో మిషన్ భగీరథపై సీఎం సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment