జూన్ 2 నుంచి అమ్మఒడి
- ఆరోజు నుంచే కేసీఆర్ కిట్లు ప్రారంభం
- వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి
- ఆధార్‌తో గర్భిణులకు బ్యాంకు ఖాతాలు
సాక్షి, హైదరాబాద్: అమ్మఒడి, కేసీఆర్ కిట్ల కార్యక్రమాన్ని జూన్ 2న ప్రారంభించను న్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఇందుకు శక్తిమంతమైన సాఫ్ట్‌వేర్‌ని రూపొందించామని, పైలట్ ప్రాజెక్టుగా పాలమూరు వివరాలు పొందు పరిచామని చెప్పారు. పథకాల ఏర్పాట్లపై సోమవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అమ్మఒడి, కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమా న్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారుల ను ఆదేశించారు. గర్భిణులను ప్రాథమిక దశలోనే గుర్తించడం, వివరాలు నమోదు చేయడం, నెల నెలా పరీక్షలు చేయించడం విధిగా జరగాలన్నారు.
పరీక్షల సమయం లోనే హైరిస్క్ కేసులని గుర్తించాలని, ఆ ప్రకారం ఆస్పత్రిలో ప్రసవం చేయించాల న్నది నిర్ణయించాలన్నారు. ఆ నిర్ణయాన్ని ముందుగానే గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు తెలిపి నిర్ణీత కేంద్రాల్లోనే ప్రసవా లు జరిగేట్లు చూడాలన్నారు. సిజేరియన్ సంఖ్యని మరింత తగ్గించేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని లక్ష్మారెడ్డి చెప్పారు. ఆధార్ అనుసంధానంతో గర్భిణీలకు బ్యాంకు ఖాతాలు తెరిపించాలని.. వృద్ధులకి అందిస్తున్న ఆసరా పెన్షన్ల మాదిరిగా వేగంగా డబ్బులు జమచేయడం, విత్‌డ్రా చేసుకునే వీలుండాలన్నారు.
ఆటంకం లేకుండా డబ్బులందాలి
గర్భిణీలకు ఏఎన్‌సీ పరీక్షల సమయంలో రూ.4 వేలు, ప్రసూతి సమయంలో రూ.4 వేలు, ప్రసవానంతరం బిడ్డలకి టీకాల కోసం రూ.4 వేలు ఆటంకం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆడ బిడ్డ పుడితే అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ల పథకంలో ప్రభుత్వం ఇస్తున్న అదనపు రూ.వెయ్యి కలిపి ఇవ్వాలన్నారు. గర్భిణీ వివరాలు నమోదు చేసుకున్నప్పటి నుంచి టీకాలిచ్చే వరకు పూర్తి సమాచారం సాఫ్ట్‌వేర్‌లో ఉండాలని చెప్పారు. పథకం సరిగా అమలవడానికి ప్రభుత్వ ప్రసవ కేంద్రాల్లో అన్ని వసతులుండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.