=అడంగళ్లలో తప్పులు సరిదిద్దుతున్న అధికారులు
=నెల రోజుల్లో వివరాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం
=పోస్టు ద్వారా పట్టాదారు పాస్‌పుస్తకాలు
=త్వరలో అమలుకు సన్నాహాలు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఇక తిరగాల్సిన పని లేదు. అధికారులు, సిబ్బంది చేతులు తడపాల్సిన అవసరముండదు. భూముల రిజిస్ట్రేషన్ చేసుకున్న 45 రోజుల్లో నేరుగా ఇంటికే పాస్‌బుక్ రానుంది. పాస్‌పుస్తకాల జారీలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎలక్ట్రానిక్ పాస్‌బుక్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక నుంచి పట్టాదారు పాస్‌పుస్తకాలు పోస్టాఫీస్ ద్వారా పంపిణీ చేయనున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని ప్రారంభించేందుకు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది అడంగళ్లలో ఉన్న తప్పులను సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు.
సమ్మెతో జాప్యం : వాస్తవానికి మూడు నెలల క్రితమే ఈ విధానం అమలుకు అధికారులు చర్యలు చేపట్టారు. సమైక్యాంధ్ర సమ్మె కారణంగా ఈ ప్రక్రియకు అప్పట్లో తాత్కాలికంగా బ్రేక్ పడింది. సమ్మె ముగిశాక దీనిపై జాయింట్ కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వరుసగా తుపాన్లుతో మళ్లీ బ్రేక్ పడింది. ప్రస్తుతం అన్ని ఆటంకాలు తొలగడంతో అడంగళ్లలో ఉన్న తప్పులను సరిదిద్దే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది.
పోస్టు ద్వారా పాస్‌పుస్తకాలు : ప్రస్తుతం పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం రోజులు, నెలల తరబడి రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. డిమాండ్‌ను బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేలు వరకు ముట్టచెబుతున్న వైనం జరమెరిగిన సత్యం. ప్రధాన ంగా వన్‌బీ రికార్డు, అడంగళ్లలో అనేక తప్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటిని సరిదిద్దడానికి సిబ్బంది ఆసక్తి చూపడం లేదన్న వాదన ఉంది. తాజాగా ఎలక్ట్రానిక్ పాస్‌పుస్తకం విధానం అమలు చేయాల్సి ఉండడం, జేసీ ఆదేశాల మేరకు ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న తప్పులను ముందుగా గుర్తించారు. వాటిని సరిదిద్ది ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు.
ఈ ప్రక్రియ పూర్తయితే పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే భూముల రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఆ శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో రెవెన్యూ శాఖకు సమాచారాన్ని చేరవేస్తారు. దీని ఆధారంగా రెవెన్యూ సిబ్బంది ఆయా భూములకు సంబంధించి తమ కంప్యూటర్లలో యజమాని పేరు, కొనుగోలు చేసిన విస్తీర్ణం మార్పు చేసి ఆన్‌లైన్‌లో వెంటనే సమాచారాన్ని హైదరాబాద్‌కు పంపుతారు. పాస్‌పుస్తకాల జారీ కోసం ఒక ప్రైవేటు ఏజెన్సీని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
ట్యాంపర్ ప్రూఫ్ కార్డులు
రెవెన్యూ కార్యాలయాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ప్రైవేటు ఏజెన్సీల నిర్వాహకులు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం ముద్రించి నేరుగా భూముల యజమానులకు పోస్ట్‌లో పంపుతారు. అది పూర్తికాగానే ట్యాంపర్ ప్రూఫ్‌తో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలు(కార్డులు) జారీ ప్రక్రియ 45 రోజుల్లో పూర్తవుతుంది. గతంలో భూముల కొనుగోలు సమయంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో కొనుగోలుదారు పేరు, వయస్సు, ఊరు వివరాలు మాత్రమే రాయించే వారు. ఇక నుంచి ఇంటి పేరుతో సహా పూర్తి పేరు, చిరునామా రాయిస్తేనే కొనుగోలుదారు పేరు మీద ముద్రించే పట్టాదారు పాస్‌పుస్తకం నేరుగా పోస్టులో ఇంటికే వస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం పోస్టులో వచ్చే పాస్‌పుస్తకం లామినేషన్‌కార్డు రూపంలో ఉంటుందని, ప్రస్తుతం ఉన్నట్లు పుస్తక రూపంలో ఉండదని అధికారులు చెబుతున్నారు.
త్వరలో ఈ-పాస్‌బుక్
Published Sat, Dec 7 2013 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement
Advertisement