రైతు: రాజు, ఏదులాపూర్, శివ్వంపేట మండలం
139/2 సర్వే నంబర్‌లో 26. 1/2 (ఇరువై ఆరున్నర గుంటల) భూమి కుమారి సులోచనపై రిజిస్ట్రేషన్ చేయించాము. కాని కొత్త పాస్‌బుక్‌లో 20.1/2(ఇరవైన్నర) గుంటల భూమి ఉన్నట్లు నమోదు చేశారు. మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే గ్రామశివారులోని ముత్తయ్య చెరువు కాలువను దాడ్వాయి అశోక్ అనే వ్యక్తి పూడ్చేశారు. ఈ విషయంపై ముత్యాలు అనే వ్యక్తి ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.
జేసీ: పాత రికార్డుల ప్రకారం ఎంత ఉంటే అంతా సర్వే చేయిస్తాము. ముతయ్య చెరువు కాలువ పూడ్చివేత పై చర్యలు తీసుకుంటాను.
సాక్షి మెదక్/మెదక్ రూరల్:
సాధాబైనామాలో భూమి తగ్గింది
రైతు: రెడ్డిగారి వీరమణి, యెనగండ్ల గ్రామం, కొల్చారం మండలం
కొల్చారం మండలం యెనగండ్ల గ్రామశివారులో గల 62 సర్వే నంబర్‌లో 2.4 ఎకరాల పట్టా భూమి ఉండగా, సాధాబైనామా తర్వాత అందులో 12 గుంటల భూమి తగ్గించి మంగళి ఆగమయ్య పేరిట నమోదు చేశారు. సంబంధిత తహసీల్దార్‌కు దరఖాస్తు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.
జేసీ: మీ సమస్య గురించి సంబంధిత తహసీల్దార్‌తో మాట్లాడి పరిష్కరిస్తాను.
ప్రభుత్వం ఇచ్చిన భూమిని కబ్జా చేశారు
రైతు: నర్సయ్య, నిజాంపేట మండలం, నస్కల్ గ్రామం
గ్రామ శివారులో గల 229/అ సర్వే నంబర్‌లో నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని నలుగురికి ఇచ్చారు. అందులో తమకు ఇచ్చిన 1.15 ఎకరాల భూమిని ఇతరులు కబ్జా చేశారు. అధికారులను పొజిషన్ చూపించాలని కోరితే పట్టించుకోవడం లేదు.
జేసీ: సర్వేయర్‌ను పంపించి సమస్యను పరిష్కరిస్తాము.
ఐదు గుంటలు తక్కువ నమోదు చేశారు
రైతు: లక్ష్మీనర్సయ్య, నిజాంపేట మండలం, కె. వెంకటాపూర్ గ్రామం
గ్రామ శివారులోని 315, 316, 317 సర్వే నంబర్లలో మొత్తం 2 ఎకరాల పట్టా భూమి ఉంది. కాని కొత్త పాస్‌బుక్‌లో 5 గుంటల భూమిని తగ్గించి నమోదు చేశారు.
జేసీ: సంబంధిత మండల రెవెన్యూ అధికారులకు చెప్పి న్యాబద్ధమైనదైతే సరిచేస్తాము.
పాస్‌బుక్కులు ఇవ్వలేదు
రైతు: నర్సింలు, రామాయంపేట
రామాయంపేట శివారులోని 1421 సర్వే నంబర్‌లో గల లవాణీ పట్టా భూమికి సంబంధించి 15 మందికి పట్టా సర్టిఫికెట్ ఇచ్చి పాస్‌బుక్కులను ఇవ్వలేదు.
జేసీ: ఆ భూమిలో ఏం పంటలు సాగు చేస్తున్నారు. సర్వేయర్‌ను పంపించి వారం రోజుల్లోగా పాస్‌బుక్కులను ఇప్పిస్తాము.
మా భూమిని కబ్జా చేశారు
రైతు: నర్సింలు, రాంపూర్ గ్రామం, అల్లాదుర్గం మండలం
గ్రామ శివారులోని 234 సర్వే నంబర్‌లో ఉన్న అసైన్డ్ భూమికి సంబంధించి 1977లో తాత పేరిట సర్టిఫికెట్ ఇచ్చారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లాము. ప్రస్తుతం తమ భూమిని పక్క పొలం వ్యక్తి కబ్జా చేశాడు.
జేసీ: మూడేళ్లకు మించి ఆ భూమిలో పొజిషన్‌లో లేకుంటే ప్రభుత్వం రద్దు చేస్తుంది. భూమిని సాగు చేస్తున్న వాళ్లకే వర్తిస్తుంది.
భూ సమస్యను పరిష్కరించండి
రైతు: సూర్యం చౌహాన్, బిక్యాతండా, శివ్వంపేట మండలం
పంచాయతీ పరిధిలో గల 315, 316 సర్వే నంబర్‌లో ఉన్న భూ సమస్యను పరిష్కరించి రైతులకు పాస్‌బుక్కులు అందించగలరు.
జేసీ: భూమి ఉన్నదాని కంటే ఎక్కువ ఉండటం వల్ల ఫారెస్ట్ అధికారులు గెజిట్ పబ్లికేషన్ తీసుకొచ్చి హద్దులు వేశారు. సమస్య ఉన్నందున ఆ భూమిని పార్ట్ బీలో పెట్టడం జరిగింది. సర్వే చేయించి సమస్య పరిష్కరించి పాస్‌బుక్‌లను అందిస్తాము.
లవాణీ పట్టా కొనుగోలు చేశాం
రైతు: నర్సింగ్, చిన్నచింతకుంట గ్రామం, నర్సాపూర్
గ్రామ శివారులోని 918 సర్వే నంబర్‌లో లవాణీ పట్టాను కొనుగోలు చేశాము. పట్టా చేయడం లేదు.
జేసీ: హెచ్‌ఎండీఏ పరిధిలో ఉంది కాబట్టి చట్ట ప్రకారం పట్టా కాదు.
పాస్‌బుక్ ఇప్పించండి
రైతు: సిద్ధయ్య, వడియారం గ్రామం, చేగుంట మండలం సర్వే నంబర్ 642లో గల 32 గుంటల ఇనాం భూమికి సంబంధించి పాస్‌బుక్ రాలేదు.
జేసీ: ఓఆర్‌సీ ఇప్పించి 10 రోజుల్లో పాస్‌బుక్‌లను అందిస్తాము.
ఒకే భూమిని ఇద్దరికి విక్రయించారు
రైతు: వహీబ్‌ఖాన్, నర్సాపూర్
సర్వే నంబర్ 17/12లో గల లవాణీ పట్టా భూమిని 1989లో తీసుకున్నాము. కాని అదే భూమిని 2006లో ఇతరులకు విక్రయించారు. ఇలా ముగ్గురి పేర్లమీద ఉంది.
జేసీ: ఆ భూమిని ఎవరూ కొనడానికి వీలులేదు. అందులో చేపట్టిన నిర్మాణాలను పడగొట్టి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటాము.
భూమిని మ్యూటేషన్ చేస్తలేరు
రైతు: శ్రీనివాస్, రాజ్‌పల్లి, మెదక్ మండలం
సర్వే నంబర్ 427/అ 2లో గల 13 గుంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించాము. కాని మోటేషన్ చేయమంటే సంబంధిత వీఆర్వో పట్టించుకోవడం లేదు.
జేసీ: రెండు రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తాము.
అధికారులు పట్టించుకోవడం లేదు
రైతు: విభూది రాచప్ప, దొంతి గ్రామం, శివ్వంపేట మండలంతల్లి ఎల్లమ్మ పేరిట ఉన్న 8గుంటల పట్టా భూమిని పౌతి చేయమంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.
జేసీ: రెండు రోజుల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూస్తాను. నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకుంటాను.
నా భూమి వేరే వ్యక్తి పేరిట నమోదైంది
రైతు: నారాయణ, శివాయిపల్లి, మెదక్ మండలం
43/ఇ2 సర్వేనంబర్‌లో గల 13 గుంటల బారాణ భూమిని నా పేరుతో ఉన్న మరో వ్యక్తి అయిన నారాయణ పేరిట నమోదయ్యింది. మా పేర్ల పక్కన తండ్రి పేరును గమనించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సమస్య పరిష్కరించాలని వీఆర్వో, ఎమ్మార్వోల చుట్టూ తిరిగినా పట్టించుకోవడవం లేదు.
జేసీ: వారం రోజుల్లో సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను.
పాస్‌బుక్కులు ఇవ్వలేదు
రైతు: బిక్షపతి, రాయిలాపూర్, కౌడిపల్లి మండలం
394, 387 సర్వే నంబర్‌లో ఉన్న రైతులకు ఎవరికి పాస్‌బుక్కులు రాలేవు. దీంతో రైతుబంధు, రైతుబీమా డబ్బులను కోల్పోవాల్సి వస్తుంది.
జేసీ: వారం రోజుల్లో సర్వే చేయించి సమస్యను పరిష్కరిస్తాను.
ఇద్దరికి చెందాల్సిన భూమిని
ఒక్కరికే ఇచ్చారు
రైతు: శంకరయ్య, ఎల్లుపల్లి, టేక్మాల్ మండలం
141 సర్వే నంబర్‌లో గల 21 గుంటల భూమి శంకరయ్య, సుధాకర్‌ల పేరు మీద ఉంది. కాగా సాధా బైనామాలో ఇద్దరికి చెందిన భూమిని సుధాకర్ ఒక్కిరి పేరిట రాసారు.
జేసీ: ఆర్డీఓకు ఆర్‌ఓఆర్ అప్పీల్ చేస్తే సమస్య పరిష్కారమవుతుంది.
పాస్‌బుక్ రాలేదు
రైతు: విజయ్‌కుమార్, కోనాపూర్ గ్రామం, రామాయంపేట433/202 సర్వే నంబర్‌లో గల ఎకరం లవాణీ పట్టా భూమికి సంబంధించి పాస్‌బుక్ రాలేదు.
జేసీ: పార్ట్ బీలో ఉన్నందు వల్ల పాస్‌బుక్ రాకుండవచ్చు. సర్వేచేయిస్తాను.
రిజిస్ట్రేషన్ చేసినా బుక్‌లో
నమోదు చేస్తలేరు
రైతు: కుమ్మరి మల్లేషం, శెట్టిపల్లి గ్రామం, వెల్ధుర్తి మండలం గ్రామ శివారులో 38 సర్వే నంబర్‌లో 14 గుంటల పట్టా భూమిని కొనుగోలు చేసి 2006 రిజిస్ట్రేషన్ చేయించాము. కాని బుక్‌లో నమోదు చేయడం లేదు. అలాగే 289, 38 సర్వే నంబర్లలో ఉన్న భూమిలో 15 గుంటల భూమి తక్కువ వస్తుంది. సంబంధిత ఎమ్మార్వో, వీఆర్వో పట్టించుకోవడం లేదు.
జేసీ: మీసేవలో పెట్టిన దరఖాస్తు ఉందా. మీసేవలో రూ.145 చెల్లించి నమోదు చేసుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. మీసేవ రశీదును వాట్సప్‌కు పెట్టండి.
కొన్న భూమిని కోల్పోవాల్సి వస్తుంది
రైతు: రఘుపతి, రాంపూర్ గ్రామం, అల్లాదుర్గం మండలంగ్రామ శివారులోని 260 సర్వే నంబర్‌లో గల 35 గుంటల పట్టా భూమిని మా తండ్రి లక్ష్మీనారాయణ పేరిట కొనుగోలు చేశాము. కాని 266 సర్వే నంబర్‌లో ఉందంటున్నారు. కాగా 260 సర్వే నంబర్‌లో గల భూమి జాతీయ రహదారి విస్తరణలో పోతుంది. సమస్యను పరిష్కరించండి.
జేసీ: రికార్డు ప్రకారం సర్వే నంబర్‌లో ఉన్న భూమిపై హక్కు ఉంటుంది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాము. లేకుంటే కోర్టును కూడా ఆశ్రయించవచ్చు.
బీఈడీ ఎంట్రెన్స్‌లో
నిజాంపేట వాసికి 13వ ర్యాంక్
నిజాంపేట(మెదక్): నిజాంపేట గ్రామానికి చెందిన యువకుడు బీఈడీ ఎంట్రెన్స్ పరీక్షలో సాంఘీకశాస్త్ర్‌రంలో 13వ ర్యాంక్ సాధించాడు. ఈ మేరకు నిజాంపేట గ్రామానికి చెందిన వోగుల సురేష్ గత నెల 31న జరిగిన ఎంట్రెన్స్ పరీక్షలో రాష్ట్రవ్యాప్తంగా మంచి ప్రతిభ కనబరిచాడు. రాష్ట్ర వ్యాప్తంగా 13వ ర్యాంక్ సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
పెద్దశంకరంపేట(మెదక్): వర్షాలు సమృద్ధిగా కురియాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో పలు ఆలయాల్లో శుక్రవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక సంఘం ఉపాధ్యక్షుడు గుడిచంద్రశేఖర్‌శర్మ హనుమాన్ ఆలయంలో చందనోత్సవం నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
కేవీపీఎస్ జిల్లా కమిటీ ఎన్నిక
నర్సాపూర్: కుల వివక్ష వ్యతిరేఖ పోరాట సమితి జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నర్సాపూర్‌లో నిర్వహించిన కేవీపీఎస్ జిల్లా మహా సభల్లో జిల్లా కమిటీని ఎంపిక చేశారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా తుకారం, నాగరాజులు ఎన్నికయ్యారు. తమతో పాటు 19 మందితో కూడిన జిల్లా కమిటీని ఎంపిక చేశారని అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. జిల్లాలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించి ఎవరికీ అన్యాయం జరుగకుండా చూస్తామని వారు పేర్కొన్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
మనోహరబాద్(తుప్రాన్): వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృచెందారు. ఎస్‌ఐ వరప్రసాద్ కథనం ప్రకారం.. కూచారం గ్రామానికి చెందిన బోయిని సత్యనారాయణ(35) తన ఇంటి ముందు ఉన్న ట్రాక్టర్‌ను పక్కకు పెట్టడానికి కింద నిలబడి స్టార్ట్ చేయగా గేర్‌లో ఉన్న ట్రాక్టర్ అకస్మాత్తుగా అతనిపైనుంచి వెళ్లింది. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చెట్టును ఢీకొని..
కొనాయిపల్లి (పీటీ)గ్రామానికి చెందిన శెట్టి బాబు (28) తన బైక్‌పై పనినిమిత్తం రంగాయిపల్లి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అంగన్‌వాడీ పోస్టుల భర్తీ
అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టులు భర్తీ చేసినట్లు సీడీపీఓ సోమశేఖరమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దశంకరంపేట అంగన్‌వాడీ టీచర్, గడిపెద్దాపూర్ తండా మినీ అంగన్‌వాడీ టీచర్, అల్లాదుర్గం మండలం గొల్లకుంట, రేగోడ్ మండలం కొండాపూర్, జంగంలోంక తండా, టేక్మాల్ మండలం పల్వంచ, పెద్దశంకరంపేట మండలం ఉతూలుర్ గ్రామల అంగన్‌వాడీ ఆయా పోస్టులు భర్తీ చేయడమైందని, పోస్టులు పొందినవారు అల్లాదుర్గం ఐసీడీఎస్ కార్యాలయంలో ఉత్తర్వులు తీసుకుని జాయినింగ్ కావాలని ఆమె తెలిపారు. పోస్టుల లిస్టు కార్యాలయంలో అందుబాటులో ఉందన్నారు.
నాలుగు మండలాల్లో..
రామాయంపేట(మెదక్): స్థానిక ఐసీడీఎస్ పరిధిలోని రామాయంపేట, నార్సింగి, చేగుంట, వెల్దుర్తి మండలాలకు సంబంధించి అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లను ఎంపిక కార్యక్రమం పూర్తయిందని స్థానిక ప్రాజెక్టు సీడీపీవో స్వరూప తెలిపారు. ఆమె శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కోనాపూర్, మక్కరాజ్‌పేట, శంఖాపూర్, బోనాల గ్రామాల్లోని ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్ల ఎంపిక కార్యక్రమం పూర్తయిందని తెలిపారు.
మక్కరాజ్‌పేట, శంఖాపూర్, బోనాల, రామాయపల్లి సెంటర్లలో హెల్పర్లు, మినీ కేంద్రాలైన కోనాపూర్ పెద్ద తండా, చిన్నతండాలో టీచర్ల ఎంపిక కార్యక్రమం పూర్తయిందని ఆమె తెలిపారు. ఎంపికైనవారి వివరాలు కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచడం జరిగిందని, లిస్టు చూసుకోవాలని ఆమె సూచించారు.
కాయిదంపల్లిలో పింఛన్‌ల పంపిణీ
అల్లాదుర్గం(మెదక్): గురువారం సాక్షి దినపత్రికలో పింఛన్ పాట్లు అనే శీర్షికతో వార్త ప్రచురితం అయింది. గ్రామాల్లో పింఛన్ ఇవ్వడం లేదని, పోస్టాఫీస్‌లో పింఛన్‌లు ఇవ్వడంతో గ్రామాల నుంచి వచ్చిన వృద్ధులు, వికలాంగులు పడుతున్న ఇబ్బందులను సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో స్పందించిన పోస్టల్ సిబ్బంది శుక్రవారం కాయిదంపల్లి గ్రామానికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్‌లు అందజేశారు. ప్రతి నెల గ్రామాల్లోనే పింఛన్‌లు పంపిణీ చేయిస్తామని ఎంపీడీఓ విద్యాసాగర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment