డబ్బిస్తే పాస్..లేదంటే బుక్కే | farmers are concern on passbooks | Sakshi
Sakshi News home page

డబ్బిస్తే పాస్..లేదంటే బుక్కే

Published Sat, Dec 27 2014 2:17 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

డబ్బిస్తే పాస్..లేదంటే బుక్కే - Sakshi

డబ్బిస్తే పాస్..లేదంటే బుక్కే

పైసలిస్తేనే పాస్‌బుక్... రెవెన్యూ ఉద్యోగుల నినాదంగా మారింది. రైతుల అవసరాలను అడ్డం పెట్టుకుని వారితో బేరసారాలకు దిగుతున్నారు. రుణమాఫీకి పట్టాదారు పాసుపుస్తకం కావాల్సి ఉండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. అధికార పార్టీ రికమెండేషన్ ఉంటే కొంత రాయితీ కూడా ఇస్తున్నారండోయ్. ఈ మధ్య ఏసీబీ దాడులు జరుగుతుండడంతో కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేతివాటం చూపిస్తున్నారు.

అదిగో కారు ... అమ్మో ఏసీబీదేమో
తహశీల్దారు కార్యాలయాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఈ కారే సాక్ష్యం. మరమ్మతులకు గురవడంతో ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం ఓ వాహన చోదకుడు కారును కొమరోలు తహశీల్థార్ కార్యాలయానికి కూత వేటు దూరంలో వదిలి వెళ్లిపోయాడు. అదే సమయంలో రెవెన్యూ సిబ్బంది మధ్యాహ్న భోజనం కోసం బయటకు వచ్చారు. తిరిగి కార్యాలయానికి వెళ్లే సమయానికి కారు ఎదురుపడింది. అమ్మో ఏసీబీ వాళ్లు వచ్చి ఉంటారని భయపడిన పలువురు ఉద్యోగులు సాయంత్రం వరకూ కార్యాలయం మొహమే చూడలేదు.

పలు ధ్రువీకరణ పత్రాలకోసం వచ్చిన వారంతా  ఇబ్బందులు పడ్డారు.  ఇటీవల మార్కాపురం డివిజన్‌లోని దోర్నాల మండలంలో ఏసీబీ అధికారులకు వీఆర్వో దొరికిపోవడంతో మరింత భయం వీరిలో నెలకుంది. రెండు, మూడు గంటలైనా రాకపోవడంతో వీరు ఎక్కడున్నారని సహోద్యోగులు ఆరా తీసి ఏసీబీ, గీసీబీ జాంతనై అని చెప్పడంతో ఒక్కొక్కరుగా సాయంత్రం ఐదు తరువాత రావడం ప్రారంభించారు. దిక్కుమాలిన కారు ఎంత భయపెట్టిందంటూ తరువాత హాయిగా నవ్వుకున్నారు.

భయంతో పనే మానేశారు
గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేటతోపాటు కొన్ని మండలాల్లో పాస్‌పుస్తకాలు సిద్ధంగా ఉన్నా పంపిణీ మాత్రం చేయడం లేదు. కారణం ఏసీబీ దాడుల భయం. పుస్తకానికి డబ్బులు తీసుకుంటే ఏసీబీ వలలో ఎక్కడ చిక్కుకోవాల్సి వస్తుందోనన్న భయంతో అన్నీ అనుకూలిస్తేనే మోక్షం కలిగిస్తున్నారు. ఇటీవల యర్రగొండపాలెంలోని పెద్దారవీడు మండలంలో ఒక వీఆర్‌ఓ డూప్లికేట్ పాసు పుస్తకానికి డబ్బులు వసూలు చేస్తూ పట్టుపడడంతో ఈ అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బేస్తవారిపేటలో ఏసీబీ అధికారుల భయంతో ఒకరోజు కార్యాలయానికే రాకుండా మానుకున్నారు. అటు డబ్బులు తీసుకోక ... ఇటు పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడంతో చీమకుర్తిలో 202, సంతనూతలపాడులో 80, మద్దిపాడులో 60, నాగులుప్పలపాడులో 110, మార్కాపురంలో 200, తర్లుపాడులో 37, కందుకూరు నియోజకవర్గంలో 600 పాసుపుస్తకాలు పెండింగులో ఉన్నాయి.
 
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రైతుకు అన్ని అర్హతలున్నా పట్టాదారు పాసుపుస్తకం చేతికి రావాలంటే కనీసం ఐదు వేల నుంచి పది వేల రూపాయల వరకూ సమర్పించుకోవాల్సిందే.  సంతనూతలపాడు నియోజకవర్గంలో పాసుపుస్తకానికి ఎనిమిది వేల నుంచి పది వేల రూపాయల వరకూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అధికార పార్టీ నేతలతో సిఫార్స్ చేయించుకుంటే రెండు వేల రూపాయల వరకూ రాయితీ ఇస్తున్నారు.  
 
నిలదీస్తే...
ఒకవేళ ఏ రైతైనా నిలదీస్తే ‘పాసుపుస్తకాల కోసం ఆర్‌డీవో కార్యాలయానికి ఇండెంట్ పెట్టాం రావాలి ... వచ్చిన తర్వాత చూద్దా’మంటూ కుంటిసాకులకు దిగుతున్నారు.  తీరిక లేదు. మండల కార్యాలయాల్లో సమావేశాలున్నాయి, పని ఒత్తిడంటూ తప్పించుకోవడానికి చూస్తున్నారు. సహనం కోల్పోయి ఎదురుతిరిగితే ఆన్‌లైన్‌లో సమస్యలున్నాయని సమయం పడుతుందంటూ కంప్యూటర్‌పై త ప్పంతా నెట్టేస్తారు. లేకపోతే సబ్‌డివిజన్ కాలేదు, సర్వే నెంబర్లు రాలేదంటూ తిప్పుతున్నారు.  
 
కనిగిరికి చెందిన షఫీ అనే వ్యక్తి తనకున్న 64 సెంట్ల భూమికి సంబంధించి సంవత్సరన్నర నుంచి పాస్‌బుక్ కోసం తిరుగుతున్నాడు. రెవెన్యూ సదస్సుల్లో కూడా దరఖాస్తు చేసుకున్నాడు. అడంగల్, ఈ సేవా, ఇప్పుడు మీ సేవాలో దరఖాస్తు చేసుకోవాలంటూ తిప్పుతున్నారు.
 
చీరాలో 79 మంది రైతులను  పాస్ పుస్తకాల కోసం మూడు నెలల నుంచి తిప్పుతున్నారు. ఈ-పాస్‌పుస్తకాలు వస్తాయంటూ వారికి పాస్‌పుస్తకాలు ఇవ్వకపోవడంతో వారు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

గుడ్లూరులో రెండు వందల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో వందమందికి పాస్‌పుస్తకాలు ఇచ్చారు. అయితే వీరిని కూడా ఇప్పుడు ఈపాస్ పుస్తకాలు తీసుకోవాలంన్నారు. చాలా చోట్ల పాస్‌బుక్ వచ్చినా టైటిల్ డీడ్, అండంగల్ ఇవ్వకుండా తిప్పుతున్నారు.

వలివేటివారిపాలెంలో 378 పాస్‌పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి. పాసుపుస్తకాలు ప్రింటింగ్ కాలేదని వచ్చిన వెంటనే ఇస్తామంటూ చుక్కలు చూపిస్తున్నారు.
 
‘ఈ’ తంటాలు
ప్రస్తుతం ఈ-పాస్ పుస్తకం అంటున్నారు. దీని కోసం ముందు మీసేవాలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను తహశీల్దార్ కార్యాలయానికి పంపుతారు. అక్కడ నిబంధనల పేరుతో జాప్యం చేస్తున్నారు. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న రైతులు  తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి సంప్రదిస్తుంటే చేయి తడిపితేనే పాసవుతాయంటున్నారు. లేదంటే నిరీక్షణ తప్పదంటూ బెదిరించడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రైతులకు పట్టాదార్ పాసుపుస్తకాలు సకాలంలో ఇప్పించాలని కష్టాల్లో ఉన్న కర్షకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement