మహిళా రైతు కాకల్ల పద్మ
సాక్షి, జనగామ: రైతులను పట్టాదారు పాస్‌బుక్కులు పరేషాన్ చేస్తున్నాయి. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని రైతుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి అవినీతి అధికారులు ప్రయత్నిస్తుండడంతో ఇక్కట్లు తప్పడం లేదు. అర్హత ఉన్నప్పటికీ పట్టాలు మాత్రం అందించడం లేదు. పట్టాదారు పాస్ బుక్కులు రాక పోవడంతో నిత్యం కార్యాలయాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. పట్టాలు చేతికి రాకపోవడంతో ప్రభుత్వపరంగా రైతులకు అందాల్సిన సౌకర్యాలు రాక పోవడంతో అరిగోస పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 12మండల్లాల్లో 5,62,573 ఎకరాల భూ విస్తీర్ణం ఉంది. అందులో 3,42,635 ఎకరాల సాగు భూమి ఉంది. 193 రెవెన్యూ గ్రామాల్లో 1,50,847 సర్వే నంబర్లలో భూమి విస్తీర్ణం విస్తరించి ఉంది.
బచ్చన్నపేట: పై ఫొటోలో కనిపిస్తున్న మహిళా రైతు బచ్చన్నపేట మండలం ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన కాకల్ల పద్మ. 2011 సంవత్సరంలో తన భర్త (బాలయ్య) చనిపోగా పద్మ మామ అయిన కాకల్ల సాయిలు పేరు మీద ఉన్న నాలుగు ఎకరాల భూమిని తన ముగ్గురు కుమారుల పేరున 2017 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించాడు. ఒక్కొక్కరికి 1.14 ఎకరాల చొప్పున పట్టేదార్ పాస్ పుస్తకాలు కూడా వచ్చాయి. కానీ ఇంత వరకు రైతుబంధు, ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు రావడం లేదు. ఇదేమిటని వ్యవసాయ అధికారులను అడిగితే రికార్డులు సరిగా చేయలేదని, అందుకే డబ్బులు రావడం లేదని అంటున్నారు. వ్యవసాయ కార్యాలయానికి వెళితే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లమని, అక్కడకు వెళితే ఇక్కడకు వెళ్లమని తిప్పించుకుంటున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈ సమస్య ఒక్క పద్మదే కాదు జిల్లాలోని పలువురి రైతుల పరిస్థితి ఇలానే ఉంది.
తప్పని తిప్పలు..
పట్టాదారు పాసుబుక్కుల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. 2017, సెప్టెంబర్ 17వ తేదీ జిల్లాలో భూ ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా 1,50,847 సర్వే నంబర్లను పరిశీలన చేశారు. ఇప్పటి వరకు 1,45,993 పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు. 4,854 పట్టాదారు పాసు పుస్తకాలను పార్ట్–బీలో పెట్టారు. పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాల కోసం రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
వసూళ్ల దందా..
పట్టాదారు పాసుబుక్కులను రైతులకు ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు బహిరంగంగానే డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. పట్టాదారు పాసుబుక్కులను తీసుకోవడానికి సాదాబైమానా పత్రాలను అనుమతి ఇచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలోని వీఆర్‌ఓలు చేతివాటానికి తెరతీశారు. పట్టాదారు పాసుబుక్కుల కోసం మీ సేవలో మ్యూటేషన్ చేసిన రైతులకు కేవలం 45 రోజుల్లో పట్టాను అందించాల్సి ఉంది. కాని విచారణ పేరుతో రెవెన్యూ అధికారులు తమకు డబ్బులు కావాలని కాలయాపన చేస్తున్నారు. ఎకరానికి రూ.10 నుంచి రూ. 20వేల వరకు తీసుకుంటున్నారు. వ్యవసాయ భూములకు ధరలు పెరగడంతో అధికారులు సైతం ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువ ధర ఉన్న భూమలకు మరింత ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అధికారులు అడిగినంత ముట్టచెప్పినప్పటికీ పట్టాలు మాత్రం చేతికి అంతక ఇక్కట్లు పడుతున్నారు.
పథకాలకు దూరం...
పట్టాదారు పాసుబుక్కులు రాకపోవడంతో రైతులు ప్రభుత్వ పథకాలను అందుకోలేక పోతున్నారు. రైతుబంధు, రైతుబీమా, కిసాన్ యోజన వంటి పథకాలకు అర్హులు కాలేక పోతున్నారు. ప్రభుత్వ పథకాలకు నోచుకోక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు భూములు ఉన్నప్పటికీ పట్టాదారు పాసుబుక్కులు లేని కారణంగా ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.
రెండేళ్లుగా తిరుగుతున్నా..
మా అమ్మ లచ్చవ్వ పేరు మీద ఉన్న బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామ శివారులో ఏడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని నా కుమారుడి పేరుమీద పట్టా చేయాలని వీఆర్‌ఓను సంప్రదించాను. దీనికి ఆయన కొంత డబ్బులు అవసరమని తెలపడంతో అడిగిన డబ్బులు ఇచ్చా. నా పనిని గత రెండేళ్లుగా పెండింగ్‌లో పెట్టాడు. రైతుబంధు, కిసాన్ యోజన డబ్బులు ఇంత వరకు రాలేదు. రైతు బీమా బాండ్లు కూడా రాలేదు. ఏ అధికారికి చెప్పినా సమస్యను పట్టించుకోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.– గొడుగు సిద్ధిరాములు, రైతు
తిప్పుకుంటున్నారు..
స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండ గ్రామ శివారులో దాదాపు 40 ఏళ్ల క్రితం రెండు ఎకరాల భూమి కొనుగోలు చేశాం. అప్పటి నుంచి సదరు భూమిలో మేమే కాస్తులో ఉన్నాం. పట్టాదారు పాసుపుస్తకం కోసం తిరుగుతున్నా.. ఇంతవరకు అధికారులు స్పందించడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, బ్యాంకులో అందించే క్రాప్‌లోన్లు రావడం లేదు. రెవెన్యూ రికార్డులో తప్పుగా మరొకరి పేరు ఉండటంతో రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం లేదు. దీంతో ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. అధికారులు స్పందించి విచారణ చేపట్టి పట్టాదారు పుస్తకం అందించి ఆదుకోవాలి.– నీల ఇంద్రమ్మ, శివునిపల్లి
వీఆర్వోలు మారిన పట్టా రాలేదు..
పట్టాదారు పాసుబుక్ కోసం తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. 1బీ పహణీలో వస్తున్నది. ఫొటో తప్పుగా వచ్చింది. తప్పుగా వచ్చిన ఫొటోను సరిగా చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికీ ఇద్దరు వీఆర్వోలు మారిన కొత్త పట్టా పాస్‌బుక్ రాలేదు.– అనపర్తి చంద్రయ్య, వావిలాల రైతు
Comments
Please login to add a commentAdd a comment