‘మీ సేవ’లకు విభజన బ్రేక్
నల్లజర్ల రూరల్, న్యూస్‌లైన్ : ‘మీ సేవ’లకు విభజన బ్రేక్ పడనుంది. మూడు రోజులు కార్యకలాపాలు నిలిచిపోనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆన్‌లైన్ సేవలు, ప్రజా సంబంధ కార్యకలాపాలకు శుక్రవారం సాయంత్రం నుంచి విఘాతం కలిగింది. ప్రవేశ పరీక్షలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అవసరమయ్యే సమయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు, మూడు రోజులు పూర్తిగా మీ సేవలు నిలిచిపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జూన్ 2న రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రధాన సర్వర్‌లో మార్పులు చేయనున్నారు. దీని కారణంగా మే 30, 31 జూన్ 1 తేదీల్లో సేవలు స్తంభించనున్నాయి. జూన్ 2వ తేదీ నుంచి మీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని నల్లజర్లలోని కేంద్రం నిర్వాహకుడు కారుమంచి రమేష్ తెలిపారు.