Verification of documents
-
వితంతువులకు అగచాట్లు
మోర్తాడ్ :వితంతువులను ఎలాంటి ఇబ్బందికి గురి చే యకుండా వారికి పింఛన్ అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వితంతువు భర్త మరణించిన విషయాన్ని రెవెన్యూ అధికారులే ధ్రువీకరించి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. డెత్ సర్టిఫికెట్ల కో సం వితంతువులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు బహిరంగంగా సభల్లో చెబుతున్న మాటలు. పింఛన్ కోసం వితంతువులు పడుతున్న అగచాట్లు అన్ని ఇన్ని కాదు. అధికార పార్టీ నాయకుల మాటలకు, అధికారులు వ్యవహరిస్తున్న తీరు పూర్తి భిన్నంగా ఉంది. కొత్త విధానంతో ఇబ్బందులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన పింఛన్ విధానంలో వితంతువులకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా వితంతు పింఛన్‌ను మంజూరు చేశారు. కాగా ఇప్పటి ప్రభుత్వం ఆసరా పథకం కింద వితంతు పింఛన్ ఇవ్వడానికి మరణించిన భర్త డెత్ సర్టిఫికెట్‌ను అందచేయాలని ఆదేశించడంతో వితంతువులు అగచాట్లు పడుతున్నారు. ఏడాది వ్యవధిలో మరణించిన వ్యక్తికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్‌ను జారీ చేసే అధికారం తహశీల్దార్‌కు ఉంది. ఏడాది పైబడిన కాలంకు సంబంధించిన సర్టిఫికెట్‌ను జారీ చేయాలంటే రె వెన్యూ డివిజనల్ అధికారికి మాత్రమే అధికారం ఉంది. కాగా రెవెన్యూ రికార్డులలో మరణాల రిజిస్ట్రేషన్ పది సంవత్సరాల నుంచి సక్రమంగా సాగుతుంది. చాలా సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తికి సంబంధించిన మరణం వివరాలు రికార్డులకు ఎక్కలేదు. దీంతో ఎంతో మంది వితంతువులకు తమ భర్త మరణించినట్లు సర్టిఫికెట్ పొందడం కష్టసాధ్యం అవుతుంది. జిల్లాలో గతంలో 74,967 మంది వితంతువులకు పింఛన్లు అందేవి. ఇప్పుడు వారి సంఖ్య పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 83,924 మంది వితంతువులకు పింఛన్లు మంజూరు అ య్యాయి. ఇందులో ఎక్కువ మంది తమ భర్తలను 20, 30 ఏళ్ల కిందనే కోల్పోయారు. మరి కొందరు చిన్నతనంలోనే వైధవ్యం పొందారు. రెవెన్యూ రికార్డు ల్లో మరణాల రిజిస్ట్రేషన్ కొద్ది సంవత్సరాల నుంచి ఉంది. చాలా సంవత్సరాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లేదు. దీంతో అనేక మంది వితంతువులకు తమ భర్త మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లు పొందే అవకా శం లేదు. గతంలోని వితంతువు పింఛన్ జాబితా ఆ ధారంగా ఇప్పుడు వితంతువులకు పింఛన్లు మంజూరు చేశారు. అయితే వితంతువు పింఛన్ పొందుతున్న వారు వచ్చే జనవరి 31లోగా భర్త మరణించినట్లు డెత్ సర్టిఫికెట్‌ను అధికారులకు అందచేయాల్సి ఉంది. డెత్ సర్టిఫికెట్ అందించని వారికి పింఛన్లను నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల వితంతువు పింఛన్ పొందడానికి అర్హత సాధించిన ఎంతో మంది పింఛన్‌ను అందుకునే అవకాశం లేదు. నోటరీ, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవడం డెత్ సర్టిఫికెట్ల కోసం వితంతువులు రూ. 500 వరకు ఖర్చు చేస్తున్నారు. అయినా డెత్ సర్టిఫికెట్లు లభించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. డెత్ సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో మెదలాలని పలువురు కోరుతున్నారు. వితంతువులను డెత్ సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులకు గురిచేయవద్దని అధికారులను పలువురు కోరుతున్నారు. -
‘ఆన్లైన్’లోనే..అన్నీ
320 పంచాయతీల్లో ‘ఈ పంచాయతీ’ సేవలు ప్రస్తుతం తొమ్మిది చోట్ల అందుబాటులో తొలి విడతలో176 మంది ఆపరేటర్లు ప్రైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యత నగరాలు, పట్టణాల్లో చాలా సేవలు ‘ఆన్లైన్లో’నే అందుతుంటాయి. ఇంట్లోనే నెట్ ఉంటే కాలు కదపాల్సిన పనే లేదు. ఇప్పుడు పల్లెల్లో కూడా ‘ఈ సేవలు’ అందించాలని, గ్రామీణు ముంగిటకే అన్ని ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఏర్పాట్లు చేస్తోంది. ఇది పూర్తి స్థాయిలో అమలైతే పల్లెల్లో ఉండేవారికి జనన,మరణ ధ్రువీకరణ పత్రాలు పొందడం, వివిధ రకాల పన్నులను చెల్లింపు సునాయాసంగా చేసుకునే అవకాశం దక్కుతుంది. సాంకేతికత లోగిళ్ల వద్దకే చేరినట్టవుతోంది. మహబూబ్‌నగర్: గ్రామ పంచాయతీలను ‘ఈ పంచాయతీ’లుగా మార్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. కనీసం నాలుగో వంతు పంచాయతీల్లో ‘ఆన్లైన్’ సేవలు అందించడం లక్ష్యంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. భవిష్యత్తులో ‘మీ సేవ’ కేంద్రాల తరహాలో ప్రభుత్వ సేవలను గ్రామీణుల ముంగిటకు చేర్చుతామని అధికారులు చెప్తున్నారు. కంప్యూటర్లు మంజూరు, ఆపరేటర్ల నియామకం,శిక్షణ వంటి కార్యకలాపాలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ.. సేవలు అందించడంలో కీలకమైన మోడెంలు ఏర్పాటు చేయడంలో బీఎస్ఎన్ఎల్ జాప్యం చేస్తోంది. జిల్లాలో 1331 గ్రామ పంచాయతీలకు గాను 320 పంచాయతీలను కంప్యూటరీకరించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. ‘ఈ పంచాయతీ’లుగా పిలిచే 320 గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లు సరఫరా, ఆపరేటర్ల నియామకం, శిక్షణ వంటి కార్యక్రమాల అమలు బాధ్యతను హైదరాబాద్‌లోని కార్వీ అనే ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. అయితే ఎంపిక చేసిన ‘ఈ పంచాయతీ’లకు కంప్యూటర్లు మంజూరు చేయగా, వాటిని ఆయ పంచాయతీలకు సరఫరా చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ల నియామకం కూడా పూర్తయినట్లు సమాచారం. వీరికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా శిక్షణ అనంతరం ఈ పంచాయతీల్లో విధులు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలి విడతలో 176 మంది కంప్యూటర్లు ఆపరేటర్లను నియమించగా, ఒక్కో ఆపరేటర్ రెండేసి ఈ పంచాయతీల్లో విధులు నిర్వర్తించనున్నట్లు సమాచారం. జనాభా, ఆన్లైన్ నెట్వర్క్ లభ్యత, పంచాయతీ ఆదాయం తదితర అంశాల ఆధారంగా ఈ పంచాయతీలను ఎంపిక చేశారు. అయితే ఈ పంచాయతీ సేవల్లో ఇంటర్నెట్ కీలకం కాగా, బీఎస్ఎన్ఎల్ మోడెంలు అమర్చడంలో ఆలస్యమవుతోంది. ప్రయోగాత్మకంగా జిల్లాలో తొలుత 16 పంచాయతీలను ఈ పంచాయతీలుగా మార్చారు. ఇందులో మేజర్ గ్రామ పంచాయతీలు నగర పంచాయతీలుగా ఆవిర్భవించడంతో ప్రస్తుతం తొమ్మిది పంచాయతీల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులో వున్నాయి. జడ్చర్ల, పెబ్బెరు, కొత్తూరు, మక్తల్, ఆత్మకూరు, కొత్తకోట, అమన్‌గల్, కోస్గి, కొడంగల్ పంచాయతీలు ప్రస్తుతం ‘ఈ పంచాయతీ’లుగా పనిచేస్తున్నాయి. ఆర్దిక సంఘం గ్రాంటుతో లింకు 13వ ఆర్దిక సంఘం పంచాయతీరాజ్ సంస్థలకు విడుదల చేస్తున్న గ్రాంటులో 70శాతం పంచాయతీలకే కేటాయించారు. మంచినీటి సరఫరా, పారిశుధ్యం, అంతర్గత రోడ్ల నిర్వహణ వంటి అంశాలతో పాటు గ్రాంటు ద్వారా పంచాయతీలను కంప్యూటరీకరించాలనే నిబంధన కూడా విధించారు. ఈ పంచాయతీ సేవలు అందుబాటులోకి వస్తే జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ, ఇంటిపన్నుతో సహా ఇతర పన్నుల చెల్లింపు, వ్యాపార లెసైన్సుల జారీ వంటి సేవలు సులభతరం కానున్నాయి. గ్రామ పంచాయతీ ఆదాయ, వ్యయాల ఖాతా నిర్వహణ పారదర్శకంగా జరగనుంది. భవిష్యత్తులో ‘మీ సేవ’ తరహాలో ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తేవడంతో పాటు, అదనపు ఆదాయం సమకూర్చే రీతిలో ఈ పంచాయతీల నిర్వహణ ఉండాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. -
‘మీ సేవ’లకు విభజన బ్రేక్
నల్లజర్ల రూరల్, న్యూస్‌లైన్ : ‘మీ సేవ’లకు విభజన బ్రేక్ పడనుంది. మూడు రోజులు కార్యకలాపాలు నిలిచిపోనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆన్లైన్ సేవలు, ప్రజా సంబంధ కార్యకలాపాలకు శుక్రవారం సాయంత్రం నుంచి విఘాతం కలిగింది. ప్రవేశ పరీక్షలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అవసరమయ్యే సమయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజులు పూర్తిగా మీ సేవలు నిలిచిపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జూన్ 2న రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రధాన సర్వర్‌లో మార్పులు చేయనున్నారు. దీని కారణంగా మే 30, 31 జూన్ 1 తేదీల్లో సేవలు స్తంభించనున్నాయి. జూన్ 2వ తేదీ నుంచి మీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని నల్లజర్లలోని కేంద్రం నిర్వాహకుడు కారుమంచి రమేష్ తెలిపారు.