మోర్తాడ్ :వితంతువులను ఎలాంటి ఇబ్బందికి గురి చే యకుండా వారికి పింఛన్ అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వితంతువు భర్త మరణించిన విషయాన్ని రెవెన్యూ అధికారులే ధ్రువీకరించి సర్టిఫికెట్‌లు జారీ చేస్తారు. డెత్ సర్టిఫికెట్‌ల కో సం వితంతువులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు బహిరంగంగా సభల్లో చెబుతున్న మాటలు. పింఛన్ కోసం వితంతువులు పడుతున్న అగచాట్లు అన్ని ఇన్ని కాదు. అధికార పార్టీ నాయకుల మాటలకు, అధికారులు వ్యవహరిస్తున్న తీరు పూర్తి భిన్నంగా ఉంది.
కొత్త విధానంతో ఇబ్బందులు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన పింఛన్ విధానంలో వితంతువులకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా వితంతు పింఛన్‌ను మంజూరు చేశారు. కాగా ఇప్పటి ప్రభుత్వం ఆసరా పథకం కింద వితంతు పింఛన్ ఇవ్వడానికి మరణించిన భర్త డెత్ సర్టిఫికెట్‌ను అందచేయాలని ఆదేశించడంతో వితంతువులు అగచాట్లు పడుతున్నారు. ఏడాది వ్యవధిలో మరణించిన వ్యక్తికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్‌ను జారీ చేసే అధికారం తహశీల్దార్‌కు ఉంది. ఏడాది పైబడిన కాలంకు సంబంధించిన సర్టిఫికెట్‌ను జారీ చేయాలంటే రె వెన్యూ డివిజనల్ అధికారికి మాత్రమే అధికారం ఉంది.
కాగా రెవెన్యూ రికార్డులలో మరణాల రిజిస్ట్రేషన్ పది సంవత్సరాల నుంచి సక్రమంగా సాగుతుంది. చాలా సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తికి సంబంధించిన మరణం వివరాలు రికార్డులకు ఎక్కలేదు. దీంతో ఎంతో మంది వితంతువులకు తమ భర్త మరణించినట్లు సర్టిఫికెట్ పొందడం కష్టసాధ్యం అవుతుంది. జిల్లాలో గతంలో 74,967 మంది వితంతువులకు పింఛన్‌లు అందేవి. ఇప్పుడు వారి సంఖ్య పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 83,924 మంది వితంతువులకు పింఛన్‌లు మంజూరు అ య్యాయి. ఇందులో ఎక్కువ మంది తమ భర్తలను 20, 30 ఏళ్ల కిందనే కోల్పోయారు.
మరి కొందరు చిన్నతనంలోనే వైధవ్యం పొందారు. రెవెన్యూ రికార్డు ల్లో మరణాల రిజిస్ట్రేషన్ కొద్ది సంవత్సరాల నుంచి ఉంది. చాలా సంవత్సరాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లేదు. దీంతో అనేక మంది వితంతువులకు తమ భర్త మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్‌లు పొందే అవకా శం లేదు. గతంలోని వితంతువు పింఛన్ జాబితా ఆ ధారంగా ఇప్పుడు వితంతువులకు పింఛన్‌లు మంజూరు చేశారు. అయితే వితంతువు పింఛన్ పొందుతున్న వారు వచ్చే జనవరి 31లోగా భర్త మరణించినట్లు డెత్ సర్టిఫికెట్‌ను అధికారులకు అందచేయాల్సి ఉంది.
డెత్ సర్టిఫికెట్ అందించని వారికి పింఛన్‌లను నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల వితంతువు పింఛన్ పొందడానికి అర్హత సాధించిన ఎంతో మంది పింఛన్‌ను అందుకునే అవకాశం లేదు. నోటరీ, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవడం డెత్ సర్టిఫికెట్‌ల కోసం వితంతువులు రూ. 500 వరకు ఖర్చు చేస్తున్నారు. అయినా డెత్ సర్టిఫికెట్‌లు లభించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. డెత్ సర్టిఫికెట్‌ల విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో మెదలాలని పలువురు కోరుతున్నారు. వితంతువులను డెత్ సర్టిఫికెట్‌ల కోసం ఇబ్బందులకు గురిచేయవద్దని అధికారులను పలువురు కోరుతున్నారు.
వితంతువులకు అగచాట్లు
Published Sat, Dec 27 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement
Advertisement