రవాణాశాఖ డిప్యుటీ కమిషనర్ కార్యాలయం
సాక్షి, నిజామాబాద్: డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవాలన్నా.. లెర్నింగ్ లైసెన్స్ గడువు ముగిస్తే కొత్తది తీసుకోవాలన్నా.. డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్‌లో మార్పులు, చేర్పులు చేయాలన్నా.. ఇప్పటి వరకు తప్పనిసరిగా ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇలాంటి కొన్ని రకాల సేవలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే అందించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ సేవల కోసం కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండానే రవాణాశాఖ వెబ్‌సైట్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేసింది. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం లేకుండా జారీ చేసే అన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందించాలని భావిస్తోంది. ఈ మేరకు ఈ ఆన్‌లైన్ సేవలు వెంటనే ప్రారంభించాలని ఆ శాఖ కమిషనరేట్ నుంచి ఆదేశాలు అందాయి. ఆర్టీఓ సేవలను మరింత సరళతరం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఈ సేవలు పొందేవారికి ఊరట లభించింది.
రోజుకు సుమారు 500 మందికి..
జిల్లాలో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పట్టణాల్లో ఆర్టీఓ కార్యాలయాలు ఉన్నాయి. ఇలాంటి సేవల కోసం ఆయా కార్యాలయాలకు రోజుకు సుమారు 400 నుంచి 500 మంది వస్తుంటారు. దీంతో ఆర్టీఓ కార్యాలయాలు కిక్కిరిపోతుంటాయి. కొందరు నేరుగా కాకుండా, ఏజెంట్ల ద్వారా పనులు చేయించుకుంటారు. ఇకపై వీరంతా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. దీనికి తోడు ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం కూడా ఉండదు.
ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు..
పౌరులు ఆయా సేవల కోసం ఇంటి వద్ద నుంచే పనులు చక్కబెట్టుకోవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు నిర్ణీత స్లాట్లను అందుబాటులో ఉంచుతారు. సంబంధిత డాక్యుమెంట్లను రవాణాశాఖ వెబ్‌సైట్‌లో (www.transport.telangana.gov.in) అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లతో కూడిన దరఖాస్తులు నేరుగా ఆశాఖ రాష్ట్ర కార్యాలయంలోని సర్వర్‌కు అనుసంధానం అవుతుంది. ఆయా సేవల కోసం ఆన్‌లైన్‌లోనే ఫీజు మొత్తాన్ని చెల్లిస్తే నిర్ణీత రోజుల్లో ఈ సేవలు అందుతాయి.
ఆన్‌లైన్ సేవలను సద్వినియోగం చేసుకోండి
రవాణాశాఖకు సంబంధించి కొన్ని రకాల సేవలను ఆన్‌లైన్‌లోనే అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సేవలను వినియోగించుకోవాలి. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం లేకుండా పొందే సేవలను పౌరులు ఇంటి నుంచే పొందవచ్చు. కార్యాలయాలనికి రావాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో పొందవచ్చు. – డా.కె.వెంకటరమణ, ట్రాన్స్‌పొర్టు డిప్యుటీ కమిషనర్.
Comments
Please login to add a commentAdd a comment