న్యూఢిల్లీ: ఇక నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయటి రోగుల విభాగం(ఓపీడీ)లో రోగులు వేచి చూడాల్సిన పనిలేదు. వీరి వెతలను దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్ ఓపీడీ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీవాస్తవ మంగళవారం ప్రారంభించారు. ఈ సేవలు 24 ప్రభుత్వ ఆస్పత్రులకు వర్తిస్తాయని ఆయన తెలిపారు. ఒక్కోరోజు ఈ ఆస్పత్రుల్లో ఓపీడీ విభాగాలకు నాలుగువేలకు పైగా రోగులు వస్తున్నారు. వీరి రద్దీని తట్టుకొని సేవలందించడం వైద్యులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఇటు వైద్యులు, అటు రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందు కోసమే ఆన్‌లైన్ ఓపీడీ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని శ్రీవాస్తవ తెలిపారు. ఇంట్లోనే కూర్చుండి రైలు టికెట్‌లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే మాదిరిగానే 15 రోజులు ముందుగానే రోగులు ఏ వైద్యుడిని సంప్రదించాలనుకుంటున్నారో తదితర వివరాలతో అపాయిట్‌మెంట్ తీసుకోవాలన్నారు.
ఢిల్లీ ప్రభుత్వ వెబ్‌సైట్ లింక్ మీద క్లిక్ చేసి యూజర్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆస్పత్రి, వైద్యం కోసం ఏ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించాలనుకునే వివరాలు, తేదీ, అపాయిట్‌మెంట సమయాన్ని నమోదు చేయాలన్నారు. ఇదిలావుండగా ఇదే లింక్ మీద ఆస్పత్రి వైద్య సేవలపై సమస్యలు ఏమైనా ఉంటే ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ప్రతిసారి ఆస్పత్రిని సందర్శించే రోగి మొదటిసారి క్రియేట్ చేసిన యూజర్ ఐడీని నిరంతరాయంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, ఆరోగ్య విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయని వివరించారు. ప్రజా ఆరోగ్య సంస్థల్లో పాటించాల్సిన ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్‌కు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన స్టాండర్డ్ ట్రీట్‌మెంట్ గైడ్‌లైన్స్ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆన్‌లైన్ ఓపీడీ సేవలు
Published Tue, May 27 2014 10:07 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement
Advertisement