OPD
-
అవుట్ పేషెంట్ కవరేజీ తీసుకుంటే మేలా...?
ఆరోగ్యపరంగా ధీమాగా ఉండాలంటే నేడు వైద్య బీమా ఉండాల్సిందే. ఆస్పత్రి పాలైతే చికిత్స వ్యయాలను బీమా కంపెనీ చెల్లిస్తుంది. మరి ఆస్పత్రిలో చేరే అవసరం లేకుండా అవుట్ పేషెంట్‌గా తీసుకునే చికిత్సల వ్యయాల సంగతేంటి? ఎప్పుడైన ఆలోచించారా...? ఆస్పత్రిలో వైద్యుల కన్సల్టేషన్, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందుల కొనుగోలు వ్యయాలు వీటికి ఎవరికి వారు విడిగా చెల్లించుకోవాలా..? లేక బీమా పాలసీలో కవరేజీ కావాలా? వైద్య బీమా పాలసీలో ఇది కూడా ముఖ్యమైన అంశమే. చాలా కంపెనీలు రెగ్యులర్ హెల్త్ పాలసీలతోపాటు అవుట్ పేషెంట్ విభాగం (ఓపీడీ) నుంచి పొందే చికిత్సలకు కూడా కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. అయితే, ఓపీడీ కవరేజీని ఎంచుకునే ముందు వేటికి కవరేజీ లభిస్తుంది? ఎంత మేర గరిష్టంగా క్లెయిమ్‌కు అనుమతిస్తారు? తదితర అంశాలను తప్పక తెలుసుకోవాలి. వీటికి ప్రీమియం కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి. ఓపీడీ కవరేజీని విడిగా పాలసీ రూపంలో కంపెనీలు ఆఫర్ చేయడం లేదు. సాధారణ హెల్త్ పాలసీకి అనుబంధంగానే ఓపీడీ కవరేజీ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, అపోలో మ్యునిక్, ఐసీఐసీఐ లాంబార్డ్, మ్యాక్స్ బూపా ఈ కవరేజీతో పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా ఓపీడీ కవరేజీలో డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు, వైద్యులు రాసిన మందులకు అయ్యే వ్యయాలు, వైద్య పరీక్షల వ్యయాలకు కవరేజీ ఉంటుంది. వీటికి క్లెయిమ్‌ను ఆస్పత్రి ద్వారా క్యాష్‌లెస్ రూపంలో పొందొచ్చు. లేదా రీయింబర్స్మెంట్ విధానంలోనూ పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే, మొత్తం బీమాలో ఓపీడీ కవరేజీ ఎంత మేర గరిష్టంగా క్లెయిమ్ చేసుకోవచ్చన్నది ముఖ్యంగా తెలుసుకోవాలి. సాధారణంగా ఓపీడీ కవరేజీ చాలా పరిమితంగానే ఉండొచ్చు. వైద్య బీమా రూ.10 లక్షల కవరేజీకి తీసుకుంటే అందులో ఓపీడీ కవరేజీ గరిష్టంగా ఒక ఏడాదిలో రూ.10,000కే పరిమితం అవుతుంది. దీనికి మించి ఎంత ఖర్చు చేసినా కంపెనీ ఇవ్వదు. ఇక కొన్ని కన్సల్టేషన్లకు, మందుల కొనుగోలుకు మళ్లీ పరిమితులను కంపెనీలు విధిస్తుంటాయి. ఉదాహరణకు మ్యాక్స్ బూపా డాక్టర్ కన్సల్టేషన్ ఫీజుకు గరిష్టంగా రూ.600వరకే ఇస్తోంది. రూ.10 లక్షల పాలసీలో ఒక ఏడాదికి ఇలా గరిష్టంగా 10 డాక్టర్ కన్సల్టేషన్లకు అయిన వ్యయాలను చెల్లిస్తోంది. ఇతర ఓపీడీ ప్రయోజనాలు కూడా ఈ పాలసీలో ఉన్నాయి. అదే రూ.4 లక్షలకు పాలసీ తీసుకుంటే కన్సల్టేషన్లు నాలుగింటికే పరిమితం. డయాగ్నోస్టిక్ టెస్ట్‌లకు పరిమితి రూ.1,500. ప్రీమియం చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో వైద్యుల వద్దకు వెళ్లడం సర్వ సాధారణం. అయితే, బీమా కంపెనీలు మాత్రం ఓపీడీ కవరేజీకి అధిక ప్రీమియం వసూలు చేస్తున్నాయి. ఓపీడీ కవరేజీ అన్నది వసూలు చేసే ప్రీమియానికి కాస్తంత ఎక్కువగా ఉండటాన్ని చాలా కంపెనీల్లో గమనించొచ్చు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఓపీడీ ప్రయోజనాలతో కూడిన రూ.4 లక్షల వైద్య బీమా పాలసీని 35 ఏళ్ల వయసున్న వ్యక్తి, అతని జీవిత భాగస్వామి, ఒక చిన్నారి (మొత్తం ముగ్గురు)కి కలిపి వార్షికంగా రూ.15,000 ప్రీమియంను వసూలు చేస్తోంది. ఇందులో ఓపీడీ క్లెయిమ్ బెనిఫిట్ పరిమితి ఏడాదికి ముగ్గురికీ కలిపి రూ.3,280 మాత్రమే. ఇదే కుటుంబం రూ.5 లక్షల హెల్త్ పాలసీని ఓపీడీ లేకుండా తీసుకుంటే వార్షిక ప్రీమియం రూ.11,915. అంటే రూ.3,280 ఓపీడీ కవరేజీ కోసం కంపెనీ రూ.3,085ను ప్రీమియంగా వసూలు చేస్తున్నట్టు అర్థమవుతోంది. మ్యాక్స్‌బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్లోనూ ఇదే విధమైన పరిస్థితి ఉంది. రూ.10 లక్షల వైద్య బీమా పాలసీని ఓపీడీ కవరేజీతో తీసుకుంటే ప్రీమియం రూ.4,000–7,000 వరకు అదనంగా (ఓపీడీ లేని పాలసీ ప్రీమియంతో పోలిస్తే) ఉంది. ప్రత్యామ్నాయాలూ ఆలోచించాలి..! ఓపీడీ కవరేజీ తీసుకుంటే అదనంగా చెల్లించే ప్రీమియానికి సెక్షన్ 80డీ కింద ఆదాయపన్ను మినహాయింపు ఉంది. ఓపీడీ కవరేజీ కింద కంపెనీల నుంచి పొందే రీయింబర్స్‌మెంట్‌కు పన్ను లేదు. అయితే, పన్ను ఆదా ఒక్కటే ఓపీడీ కవరేజీ తీసుకోవడానికి కారణం కారాదు. ఉదాహరణకు మధుమేహ సమస్యతో ఉన్న వారు, హైబీపీతో బాధపడుతున్న వారు తరచూ వైద్యుల వద్దకు వెళ్లాల్సి రావడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరపడుతుంది. మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఈ తరహా వ్యక్తులకు బీమా కంపెనీల నుంచి తగినంత కవరేజీ లభించకపోవచ్చు. ఒకవేళ లభించినా ప్రీమియం అధికంగా ఉంటుంది. అందుకని ఓపీడీ కవరేజీ తీసుకోవడం కంటే అందుకు అయ్యే వ్యయాలను తట్టుకునేందుకు విడిగా ఆదా చేసుకోవడం మంచిది. ఇందుకోసం వేతనంలో కొంత మేర పక్కన పెడుతూ, ఆ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేదంటే షార్ట్‌టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్లలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ నిధి అవుట్ పేషెంట్ చికిత్సల రూపంలో ఎదురయ్యే అకస్మిక ఖర్చులను తట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. -
ఎయిమ్స్‌లో మరో కొత్త ఓపీడీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో మరో ఔట్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించనున్నారు. ప్రతిరోజు ఎయిమ్స్‌కు వైద్యం కోసం వచ్చే వేలాది మంది రోగులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కొత్తగా 400 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రా న్ని కూడా ఏర్పాటు చేయనున్నామని సంస్థ డెరైక్టర్ ఎంసీ మిశ్రా చెప్పారు. మరో 200 పడకలతో శస్త్ర చికిత్స కేంద్రం, 200 పడకల వృద్ధుల సంక్షేమ కేంద్రాన్ని కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో తమకు కేటాయించిన రూ.1,365 కోట్ల నిధులతో ఈ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మిశ్రా పేర్కొన్నారు. రెఫరల్, రీసెర్చ్ ఆస్పత్రిగా 1956, సెప్టెంబర్ 25న ఎయిమ్స్‌ను స్థాపించారు. ఇక్కడ దాదాపు 30 లక్షల మంది రోగులు ఏటా వైద్య సేవలు పొందుతుంటారు. ఇక్కడున్న అధునాతన వైద్య సదుపాయాల కారణంగా ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని మిశ్రా చెప్పారు. తమకు కేటాయించిన నిధులను ఎల్లప్పుడూ సంస్థ విస్తరణకు, సదుపాయాల మెరుగుదలకే ఉపయోగించామని అన్నారు. ఇప్పుడున్న ఔట్ పేషెంట్ విభాగం నిత్యం రద్దీగా ఉంటోందని, అందువల్ల మరిన్ని మెరుగైన సదుపాయాలతో కొత్త ఓపీడీని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఎయిమ్స్‌కు వెనుకనున్న మసీదు ప్రాంతంలో కొత్తగా తొమ్మిది అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోందని, అందులో అనేక కొత్త విభాగాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. 200 పడకల శస్త్రచికిత్స కేంద్రం, 400 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం, వృద్ధుల సంక్షేమ కేంద్రాలను వచ్చే ఒకటి రెండేళ్లలో నెలకొల్పుతామని మిశ్రా పేర్కొన్నారు. అత్యవసర విభాగంలో రద్దీ, అక్కడ ఉత్పన్నమవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొనిమరో ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటుచేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపామని, దీనికి త్వరలోనే ఆమోదం లభించగలదని అన్నారు. ఎయిమ్స్‌లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థినీ విద్యార్థుల కోసం చెరో రెండు హాస్టళ్ల నిర్మాణం పూర్తి కావచ్చిందని చెప్పారు. ఆస్పత్రిలో పరిశోధనల కోసం మౌలిక సదుపాయాలను మరింత ఉన్నతీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం ఎయిమ్స్‌లో సుమారు 500 మంది పీహెచ్డీ విద్యార్థులు వివిధ వైద్యపరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని మిశ్రా చెప్పారు. తమకు కేటాయించిన నిధులతోనే నర్సులు, ప్రొఫెసర్ల, కొత్త డాక్టర్ల శిక్షణనిస్తున్నామని అన్నారు. ట్రామా కేంద్రం విస్తరణ 2015 నాటికి పూర్తి కాగలదని అన్నారు. -
ఎయిమ్స్‌లో ‘క్యూ’ల కష్టాలు
న్యూఢిల్లీ: ఎయిమ్స్ ఆస్పత్రి బయటి రోగుల విభాగానికి (ఓపీడీ) వచ్చే వాళ్లు డాక్టర్ గదికి వెళ్లేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఓపీడీల్లో రద్దీ నానాటికీ పెరుగుతున్నా, తదనుగుణంగా సీనియర్, జూనియర్ డాక్టర్లు, నర్సుల సంఖ్యను పెంచడంపై ఎయిమ్స్ యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ‘ఇక్కడ డాక్టర్లు, రోగుల నిష్పత్తి సక్రమంగా లేదు. గతంలో పోలిస్తే ప్రతి డాక్టర్ ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో రోగులను చూస్తున్నారు. అందుకే రోగులు గంటల కొద్దీ డాక్టర్ల గదుల ముందు నిరీక్షించాల్సి వస్తోంది. బాధితులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా, ఏమీ కాలేదు. నిరీక్షణ కాలాన్ని తగ్గించేందుకు ఏదో ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంది’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆస్పత్రి ఉద్యోగులు కొందరు అన్నారు. అయితే రద్దీని నియంత్రించడానికి ఆటోమేటెడ్ ఫోన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టామని ఎయిమ్స్ యాజ మాన్యం తెలిపింది. పాత రోగుల సంఖ్యను తగ్గిం చి, మరింత మంది కొత్తవారికి త్వరగా చికిత్స అందేలా చేయడం దీని లక్ష్యం. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పద్ధతిలో పాత రోగులకు ఫోన్ ద్వారా అపాయింట్మెంటు ఇస్తారు. ఇది మంచి ఫలితాలు ఇస్తే పూర్తిస్థాయిలో అమలు చేస్తామని అధికారులు అంటున్నారు. అయితే పాత రోగులతోపాటు అత్యవసర చికిత్స అవసరమయ్యే బాధితులకూ ప్రత్యేక విభాగం అవసరమని కొందరు అంటున్నారు. ‘నా కూతురు రక్తహీనతతో బాధపడుతున్నందున, తక్షణ వైద్యసాయం అవసరమని డాక్టర్లు చెప్పడంతో నేను వెంటనే అత్యవసర విభాగానికి రావాల్సి వచ్చింది. డాక్టర్ గదిలోకి వెళ్లేందుకు మేం గంట నిరీక్షించాల్సి వచ్చింది. అత్యవసర రోగులకు వెంటనే చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి’ అని సంగమ్‌విహార్‌వాసి మంజులాదేవి అభిప్రాయపడ్డారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో లోపల నిరీక్షించడం కూడా ఇబ్బందిగానే ఉంటుందని పాత రోగులు చెబుతున్నారు. ‘ప్రభుత్వ ఆస్పత్రికి రావాలనుకుంటే గంటల తరబడి నిరీక్షించడం తప్పనిసరన్న విషయం తెలుసు. ఎంత ఎండ, చలి ఉన్నా రోగి అలాగే నిరీక్షించాలి. ఫ్యాన్లు ఎక్కడా కనిపించవు. దోమలు, ఈగలు స్వైరవిహారం చేస్తుంటాయి’ అని జితేందర్ సింగ్ చెప్పారు. మధుమేహం, హైపర్‌టెన్షన్ ఉన్న రోగి కూడా కనీసం 40 నిమిషాల పాటు నిరీక్షిస్తూనే ఉండాలని బాధితులు చెబుతున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆన్లైన్ ఓపీడీ సేవలు
న్యూఢిల్లీ: ఇక నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయటి రోగుల విభాగం(ఓపీడీ)లో రోగులు వేచి చూడాల్సిన పనిలేదు. వీరి వెతలను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ ఓపీడీ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీవాస్తవ మంగళవారం ప్రారంభించారు. ఈ సేవలు 24 ప్రభుత్వ ఆస్పత్రులకు వర్తిస్తాయని ఆయన తెలిపారు. ఒక్కోరోజు ఈ ఆస్పత్రుల్లో ఓపీడీ విభాగాలకు నాలుగువేలకు పైగా రోగులు వస్తున్నారు. వీరి రద్దీని తట్టుకొని సేవలందించడం వైద్యులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఇటు వైద్యులు, అటు రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందు కోసమే ఆన్లైన్ ఓపీడీ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని శ్రీవాస్తవ తెలిపారు. ఇంట్లోనే కూర్చుండి రైలు టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకునే మాదిరిగానే 15 రోజులు ముందుగానే రోగులు ఏ వైద్యుడిని సంప్రదించాలనుకుంటున్నారో తదితర వివరాలతో అపాయిట్మెంట్ తీసుకోవాలన్నారు. ఢిల్లీ ప్రభుత్వ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసి యూజర్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆస్పత్రి, వైద్యం కోసం ఏ డిపార్ట్మెంట్ను సంప్రదించాలనుకునే వివరాలు, తేదీ, అపాయిట్మెంట సమయాన్ని నమోదు చేయాలన్నారు. ఇదిలావుండగా ఇదే లింక్ మీద ఆస్పత్రి వైద్య సేవలపై సమస్యలు ఏమైనా ఉంటే ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ప్రతిసారి ఆస్పత్రిని సందర్శించే రోగి మొదటిసారి క్రియేట్ చేసిన యూజర్ ఐడీని నిరంతరాయంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. యునెటైడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఆరోగ్య విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయని వివరించారు. ప్రజా ఆరోగ్య సంస్థల్లో పాటించాల్సిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్‌కు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. -
క్యాష్‌లెస్ ఓపీడీ వైద్య బీమా
దేశంలోనే తొలిసారిగా ఔట్ పేషెంట్ చికిత్సకి నగదు రహిత బీమా రక్షణ కల్పించే విధంగా ఐసీఐసీఐ లాంబార్డ్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఐ-హెల్త్ క్యాష్‌లెస్ ఓపీడీ’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకంలోని పాలసీదారులకు కంపెనీ ఒక హెల్త్కార్డ్ను జారీ చేస్తుంది. ఈ కార్డును స్వైప్ చేయడం ద్వారా ఎటువంటి నగదు లేకుండా నేరుగా చికిత్స చేయించుకోవచ్చు. ఇండియాలో జరుగుతున్న వైద్య చికిత్సా వ్యయంలో 60 శాతం ఔట్ పేషెంట్ విభాగానిదేనని, కాని దీనికి బీమా రక్షణ ఉండకపోవడంతో తొలిసారిగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ చీఫ్ అండర్‌రైటింగ్ సంజయ్ దత్తా తెలిపారు. సంవత్సరానికి రూ.120 ప్రీమియం నుంచి అందుబాటులో ఉన్న ఈ పాలసీ ప్రస్తుతం గ్రూపు ఇన్సూరెన్స్కే ఇస్తున్నామని, త్వరలోనే వ్యక్తిగత పాలసీదారులకు కూడా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. టాటా ఏఐఏ మహాలైఫ్ గోల్డ్ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గ్యారంటీ ఆదాయాన్ని అందిస్తూ గరిష్టంగా 85 ఏళ్ల వరకు బీమా రక్షణ కల్పించే విధంగా మహాలైఫ్ గోల్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేవలం 15 ఏళ్లు మాత్రం ప్రీమి యం చెల్లించే ఈ పాలసీలో 10 ఏళ్లు నిండిన తర్వాత నుంచి మెచ్యూర్టీ వరకు ఏటా 5.5 శాతం రాబడిని మనీ బ్యాక్ రూపంలో అందిస్తుంది. 6వ ఏట నుంచి గ్యారంటీ లేని రాబడి కూడా ఉంది. అప్పుడే పుట్టిన వారు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. గ్యారంటీ పెన్షన్ పథకం ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ఈజీ రిటైర్మెంట్’ పేరుతో యులిప్ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కనిష్టంగా 10 ఏళ్ల నుంచి గరిష్టంగా 30 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకంలో ప్రీమియాన్ని 5, 10 ఏళ్ల పరిమిత కాలానికి లేదా పూర్తి పాలసీ కాలపరిమితి వరకు చెల్లించవచ్చు. ఈ పథకం రెండు రకాల ఫండ్స్‌ను అందిస్తోంది. బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకుంటే గరిష్టంగా 50% ఈక్విటీలకు మిగిలినది డెట్ పథకాలకు అందిస్తుంది. అదే సెక్యూర్ ఫండ్ పూర్తిగా 100 % డెట్ పథకాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది.