న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో మరో ఔట్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించనున్నారు. ప్రతిరోజు ఎయిమ్స్‌కు వైద్యం కోసం వచ్చే వేలాది మంది రోగులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కొత్తగా 400 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రా న్ని కూడా ఏర్పాటు చేయనున్నామని సంస్థ డెరైక్టర్ ఎంసీ మిశ్రా చెప్పారు. మరో 200 పడకలతో శస్త్ర చికిత్స కేంద్రం, 200 పడకల వృద్ధుల సంక్షేమ కేంద్రాన్ని కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తమకు కేటాయించిన రూ.1,365 కోట్ల నిధులతో ఈ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మిశ్రా పేర్కొన్నారు.
రెఫరల్, రీసెర్చ్ ఆస్పత్రిగా 1956, సెప్టెంబర్ 25న ఎయిమ్స్‌ను స్థాపించారు. ఇక్కడ దాదాపు 30 లక్షల మంది రోగులు ఏటా వైద్య సేవలు పొందుతుంటారు. ఇక్కడున్న అధునాతన వైద్య సదుపాయాల కారణంగా ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని మిశ్రా చెప్పారు. తమకు కేటాయించిన నిధులను ఎల్లప్పుడూ సంస్థ విస్తరణకు, సదుపాయాల మెరుగుదలకే ఉపయోగించామని అన్నారు. ఇప్పుడున్న ఔట్ పేషెంట్ విభాగం నిత్యం రద్దీగా ఉంటోందని, అందువల్ల మరిన్ని మెరుగైన సదుపాయాలతో కొత్త ఓపీడీని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఎయిమ్స్‌కు వెనుకనున్న మసీదు ప్రాంతంలో కొత్తగా తొమ్మిది అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోందని, అందులో అనేక కొత్త విభాగాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.
200 పడకల శస్త్రచికిత్స కేంద్రం, 400 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం, వృద్ధుల సంక్షేమ కేంద్రాలను వచ్చే ఒకటి రెండేళ్లలో నెలకొల్పుతామని మిశ్రా పేర్కొన్నారు. అత్యవసర విభాగంలో రద్దీ, అక్కడ ఉత్పన్నమవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొనిమరో ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటుచేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపామని, దీనికి త్వరలోనే ఆమోదం లభించగలదని అన్నారు. ఎయిమ్స్‌లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థినీ విద్యార్థుల కోసం చెరో రెండు హాస్టళ్ల నిర్మాణం పూర్తి కావచ్చిందని చెప్పారు.
ఆస్పత్రిలో పరిశోధనల కోసం మౌలిక సదుపాయాలను మరింత ఉన్నతీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం ఎయిమ్స్‌లో సుమారు 500 మంది పీహెచ్‌డీ విద్యార్థులు వివిధ వైద్యపరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని మిశ్రా చెప్పారు. తమకు కేటాయించిన నిధులతోనే నర్సులు, ప్రొఫెసర్ల, కొత్త డాక్టర్ల శిక్షణనిస్తున్నామని అన్నారు. ట్రామా కేంద్రం విస్తరణ 2015 నాటికి పూర్తి కాగలదని అన్నారు.
ఎయిమ్స్‌లో మరో కొత్త ఓపీడీ
Published Sun, Aug 10 2014 10:21 PM | Last Updated on Thu, Aug 16 2018 4:04 PM
Advertisement