క్యాష్‌లెస్ ఓపీడీ వైద్య బీమా
దేశంలోనే తొలిసారిగా ఔట్ పేషెంట్ చికిత్సకి నగదు రహిత బీమా రక్షణ కల్పించే విధంగా ఐసీఐసీఐ లాంబార్డ్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఐ-హెల్త్ క్యాష్‌లెస్ ఓపీడీ’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకంలోని పాలసీదారులకు కంపెనీ ఒక హెల్త్‌కార్డ్‌ను జారీ చేస్తుంది. ఈ కార్డును స్వైప్ చేయడం ద్వారా ఎటువంటి నగదు లేకుండా నేరుగా చికిత్స చేయించుకోవచ్చు. ఇండియాలో జరుగుతున్న వైద్య చికిత్సా వ్యయంలో 60 శాతం ఔట్ పేషెంట్ విభాగానిదేనని, కాని దీనికి బీమా రక్షణ ఉండకపోవడంతో తొలిసారిగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ చీఫ్ అండర్‌రైటింగ్ సంజయ్ దత్తా తెలిపారు. సంవత్సరానికి రూ.120 ప్రీమియం నుంచి అందుబాటులో ఉన్న ఈ పాలసీ ప్రస్తుతం గ్రూపు ఇన్సూరెన్స్‌కే ఇస్తున్నామని, త్వరలోనే వ్యక్తిగత పాలసీదారులకు కూడా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
టాటా ఏఐఏ మహాలైఫ్ గోల్డ్
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గ్యారంటీ ఆదాయాన్ని అందిస్తూ గరిష్టంగా 85 ఏళ్ల వరకు బీమా రక్షణ కల్పించే విధంగా మహాలైఫ్ గోల్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేవలం 15 ఏళ్లు మాత్రం ప్రీమి యం చెల్లించే ఈ పాలసీలో 10 ఏళ్లు నిండిన తర్వాత నుంచి మెచ్యూర్టీ వరకు ఏటా 5.5 శాతం రాబడిని మనీ బ్యాక్ రూపంలో అందిస్తుంది. 6వ ఏట నుంచి గ్యారంటీ లేని రాబడి కూడా ఉంది. అప్పుడే పుట్టిన వారు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు.
గ్యారంటీ పెన్షన్ పథకం
ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ఈజీ రిటైర్‌మెంట్’ పేరుతో యులిప్ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కనిష్టంగా 10 ఏళ్ల నుంచి గరిష్టంగా 30 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకంలో ప్రీమియాన్ని 5, 10 ఏళ్ల పరిమిత కాలానికి లేదా పూర్తి పాలసీ కాలపరిమితి వరకు చెల్లించవచ్చు. ఈ పథకం రెండు రకాల ఫండ్స్‌ను అందిస్తోంది. బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను ఎంచుకుంటే గరిష్టంగా 50% ఈక్విటీలకు మిగిలినది డెట్ పథకాలకు అందిస్తుంది. అదే సెక్యూర్ ఫండ్ పూర్తిగా 100 % డెట్ పథకాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది.