out patient
-
AIIMS: నేడు సగం రోజు సెలవుపై వెనక్కి తగ్గిన ఢిల్లీ ఎయిమ్స్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయం ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమవారం అవుట్ పేషెంట్ విభాగాన్ని మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసి ఉంచాలంటూ శనివారం జారీ చేసిన మెమోరాండంను ఢిల్లీ ఎయిమ్స్ వెనక్కి తీసుకుంది. అవుట్ పేషెంట్ సేవలు(ఓపీడీ)సహా అన్ని విభాగాలు యథావిధిగా తెరిచి ఉంచాలంటూ ఆదివారం తాజాగా మెమోరాండం జారీ చేసింది. అన్ని కేంద్రాల, విభాగాల అధిపతులు, యూనిట్లు, బ్రాంచ్ ఆఫీసర్లు తమ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు ఈ సమాచారం అందజేయాలని కోరింది. రోగులకు అసౌకర్యం కలగరాదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఓపీడీ సహా అన్ని సేవలు సోమవారం రోజంతా యథావిధిగా కొనసాగుతాయని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ కూడా తెలిపింది. -
ఓపీ సేవల సమయం పెంపు
అనంతపురం సిటీ : రోగుల సౌకర్యార్థం సర్వజనాస్పత్రిలో ఔట్‌పేషెంట్ (ఓపీ) సేవలను అదనంగా గంట సమయం పెంచినట్లు సూపరింటెండెంట్ జగన్నాథ్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక వైద్యుల సమావేశ భవనంలో అన్ని విభాగాల వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సూపరింటెండెంట్ తో పాటు ఆర్ఎంఓ వెంకటేశ్వరరావు, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ రామస్వామినాయక్లు పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఇకపై ఓపీ సేవలు ఉదయం 8.30 కే మెదలై మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయన్నారు. రోగులకు ఎక్స్‌రే, రక్త, కంటి, స్కానింగ్ లాంటి పరీక్షలను వేగవంతం చేసి ఒకే రోజులోనే రిపోర్టులు ఇచ్చే విధంగా కృషి చేయాలన్నారు. వైద్యులతో పాటు నర్సులు, ఆస్పత్రి సిబ్బంది రోగుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. అత్యవసర వైద్య సేవల్లో కూడా ఆయా విభాగాల వైద్యులు కచ్చితంగా అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. ఈ-ఔషధి విధానం అమలులో అనంత ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వైద్యులు తమ విధులను కచ్చితంగా నిర్వర్తించాలన్నారు. విధులకు డుమ్మా కొడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగుల పేరు, వారికున్న జబ్బులు, ఆస్పత్రిలో చికిత్స పొందిన కాలం తదితర వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి ఉన్నతాధికారి కార్యాలయానికి పంపాలని ఆదేశాలు చేశారు. -
జనం విలవిల
సాక్షి, అనంతపురం : జిల్లాను ఇప్పటికే డెంగీ మహమ్మారి వణికిస్తోంది. దీనికితోడు మలేరియా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ రికార్డుల ప్రకారం జూన్ నాటికి 200 మలేరియా కేసులుండగా.. జూలై ఆఖరు నాటికి ఆ సంఖ్య 304కు చేరుకుంది. అనంతపురం సర్వజనాస్పత్రిలోని ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగానికి రోజూ దాదాపు వెయ్యి మంది జ్వర పీడితులు వస్తుండగా.. వారిలో 20 మంది వరకు మలేరియా బాధితులు ఉంటున్నారు. పాముదుర్తి, కదిరి, నల్లమాడ, తనకల్లు, గోరంట్ల క్లష్టర్ల పరిధిలో వందలాది మంది మలేరియాతో బాధపడుతున్నారు. వీరిలో కొందరు స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తుండగా, కాస్తో కూస్తో ఆర్థిక స్తోమత కలిగిన వారు మాత్రం ప్రయివేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు కరువు జిల్లాలో ప్రతియేటా మలేరియా కేసులు అధికంగానే ఉంటున్నాయి. 80 శాతం మంది బాధితులు ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండడంతో వీరి వివరాలు రికార్డుల్లో నమోదు కావడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులను మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామంలో ఏడాదిలో మూడు నుంచి ఐదు కేసులు నమోదైతే.. అక్కడ మాత్రమే ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది 345 గ్రామాల్లో దోమల నివారణకు పైరాథాయిడ్‌ను జూలై13 నుంచి ఆఖరు వరకు పిచికారీ చేశారు. జూన్‌లో పెనకచర్ల డ్యాం, గార్లదిన్నె ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ నివారణ చర్యలు చేపట్టిన అధికారులు.. మిగిలిన ప్రాంతాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ ఏడాది జూలై నాటికి గత సంవత్సరం కంటే 84 కేసులు అధికంగా నమోదైనట్లు అధికారుల లెక్కలే చెబుతున్నాయి. ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు కురుస్తుండడంతో పాటు వాతావరణంలో మార్పుల వల్ల చాలామంది జ్వరాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అధికారులు పత్రికల్లో వచ్చే వార్తలకు ఖండనలు ఇవ్వడానికి, కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు నిర్వహించడానికే పరిమితమవుతున్నారు. మరికొంత మంది సొంత నర్సింగ్ హోంలలో తీరిక లేకుండా గడుపుతున్నారన్న విమర్శలున్నాయి. అధ్వానంగా పారిశుద్ధ్యం చాలా గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. దీనివల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పారిశుద్ధ్యం మెరుగుదలకు చేపడుతున్న చర్యలు నామమాత్రమే. మునిసిపాలిటీలలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ చేపట్టిన పారిశుద్ధ్య వారోత్సవాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. చర్యలు తీసుకుంటున్నాం మలేరియా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల 345 గ్రామాల్లో నివారణ చర్యలు చేపట్టాం. మరిన్ని గ్రామాల్లో దోమల నివారణకు పైరాథాయిడ్‌ను పిచికారీ చేస్తాం. గత ఏడాది కంటే ఈసారి మలేరియా బాధితుల సంఖ్య కాస్త పెరిగిన మాట వాస్తవమే. బాధితుల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు సిద్ధంగా ఉన్నాయి. - డాక్టర్ ఆదినారాయణ, జిల్లా మలేరియా వైద్యాధికారి, అనంతపురం -
క్యాష్‌లెస్ ఓపీడీ వైద్య బీమా
దేశంలోనే తొలిసారిగా ఔట్ పేషెంట్ చికిత్సకి నగదు రహిత బీమా రక్షణ కల్పించే విధంగా ఐసీఐసీఐ లాంబార్డ్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఐ-హెల్త్ క్యాష్‌లెస్ ఓపీడీ’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకంలోని పాలసీదారులకు కంపెనీ ఒక హెల్త్కార్డ్ను జారీ చేస్తుంది. ఈ కార్డును స్వైప్ చేయడం ద్వారా ఎటువంటి నగదు లేకుండా నేరుగా చికిత్స చేయించుకోవచ్చు. ఇండియాలో జరుగుతున్న వైద్య చికిత్సా వ్యయంలో 60 శాతం ఔట్ పేషెంట్ విభాగానిదేనని, కాని దీనికి బీమా రక్షణ ఉండకపోవడంతో తొలిసారిగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ చీఫ్ అండర్‌రైటింగ్ సంజయ్ దత్తా తెలిపారు. సంవత్సరానికి రూ.120 ప్రీమియం నుంచి అందుబాటులో ఉన్న ఈ పాలసీ ప్రస్తుతం గ్రూపు ఇన్సూరెన్స్కే ఇస్తున్నామని, త్వరలోనే వ్యక్తిగత పాలసీదారులకు కూడా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. టాటా ఏఐఏ మహాలైఫ్ గోల్డ్ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గ్యారంటీ ఆదాయాన్ని అందిస్తూ గరిష్టంగా 85 ఏళ్ల వరకు బీమా రక్షణ కల్పించే విధంగా మహాలైఫ్ గోల్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేవలం 15 ఏళ్లు మాత్రం ప్రీమి యం చెల్లించే ఈ పాలసీలో 10 ఏళ్లు నిండిన తర్వాత నుంచి మెచ్యూర్టీ వరకు ఏటా 5.5 శాతం రాబడిని మనీ బ్యాక్ రూపంలో అందిస్తుంది. 6వ ఏట నుంచి గ్యారంటీ లేని రాబడి కూడా ఉంది. అప్పుడే పుట్టిన వారు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. గ్యారంటీ పెన్షన్ పథకం ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ఈజీ రిటైర్మెంట్’ పేరుతో యులిప్ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కనిష్టంగా 10 ఏళ్ల నుంచి గరిష్టంగా 30 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకంలో ప్రీమియాన్ని 5, 10 ఏళ్ల పరిమిత కాలానికి లేదా పూర్తి పాలసీ కాలపరిమితి వరకు చెల్లించవచ్చు. ఈ పథకం రెండు రకాల ఫండ్స్‌ను అందిస్తోంది. బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకుంటే గరిష్టంగా 50% ఈక్విటీలకు మిగిలినది డెట్ పథకాలకు అందిస్తుంది. అదే సెక్యూర్ ఫండ్ పూర్తిగా 100 % డెట్ పథకాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది.