సాక్షి, అనంతపురం : జిల్లాను ఇప్పటికే డెంగీ మహమ్మారి వణికిస్తోంది. దీనికితోడు మలేరియా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ రికార్డుల ప్రకారం జూన్ నాటికి 200 మలేరియా కేసులుండగా.. జూలై ఆఖరు నాటికి ఆ సంఖ్య 304కు చేరుకుంది. అనంతపురం సర్వజనాస్పత్రిలోని ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగానికి రోజూ దాదాపు వెయ్యి మంది జ్వర పీడితులు వస్తుండగా.. వారిలో 20 మంది వరకు మలేరియా బాధితులు ఉంటున్నారు. పాముదుర్తి, కదిరి, నల్లమాడ, తనకల్లు, గోరంట్ల క్లష్టర్ల పరిధిలో వందలాది మంది మలేరియాతో బాధపడుతున్నారు. వీరిలో కొందరు స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తుండగా, కాస్తో కూస్తో ఆర్థిక స్తోమత కలిగిన
వారు మాత్రం ప్రయివేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు.
ముందు జాగ్రత్త చర్యలు కరువు
జిల్లాలో ప్రతియేటా మలేరియా కేసులు అధికంగానే ఉంటున్నాయి. 80 శాతం మంది బాధితులు ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండడంతో వీరి వివరాలు రికార్డుల్లో నమోదు కావడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులను మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామంలో ఏడాదిలో మూడు నుంచి ఐదు కేసులు నమోదైతే.. అక్కడ మాత్రమే ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది 345 గ్రామాల్లో దోమల నివారణకు పైరాథాయిడ్‌ను జూలై13 నుంచి ఆఖరు వరకు పిచికారీ చేశారు. జూన్‌లో పెనకచర్ల డ్యాం, గార్లదిన్నె ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ నివారణ చర్యలు చేపట్టిన అధికారులు.. మిగిలిన ప్రాంతాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ ఏడాది జూలై నాటికి గత సంవత్సరం కంటే 84 కేసులు అధికంగా నమోదైనట్లు అధికారుల లెక్కలే చెబుతున్నాయి. ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు కురుస్తుండడంతో పాటు వాతావరణంలో మార్పుల వల్ల చాలామంది జ్వరాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అధికారులు పత్రికల్లో వచ్చే వార్తలకు ఖండనలు ఇవ్వడానికి, కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు నిర్వహించడానికే పరిమితమవుతున్నారు. మరికొంత మంది సొంత నర్సింగ్ హోంలలో తీరిక లేకుండా గడుపుతున్నారన్న విమర్శలున్నాయి.
అధ్వానంగా పారిశుద్ధ్యం
చాలా గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. దీనివల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పారిశుద్ధ్యం మెరుగుదలకు చేపడుతున్న చర్యలు నామమాత్రమే. మునిసిపాలిటీలలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ చేపట్టిన పారిశుద్ధ్య వారోత్సవాలు మొక్కుబడిగా సాగుతున్నాయి.
చర్యలు తీసుకుంటున్నాం
మలేరియా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల 345 గ్రామాల్లో నివారణ చర్యలు చేపట్టాం. మరిన్ని గ్రామాల్లో దోమల నివారణకు పైరాథాయిడ్‌ను పిచికారీ చేస్తాం. గత ఏడాది కంటే ఈసారి మలేరియా బాధితుల సంఖ్య కాస్త పెరిగిన మాట వాస్తవమే. బాధితుల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు సిద్ధంగా ఉన్నాయి.
- డాక్టర్ ఆదినారాయణ, జిల్లా మలేరియా వైద్యాధికారి, అనంతపురం
జనం విలవిల
Published Sun, Aug 3 2014 3:38 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement