అనంతపురం సిటీ : రోగుల సౌకర్యార్థం సర్వజనాస్పత్రిలో ఔట్‌పేషెంట్ (ఓపీ) సేవలను అదనంగా గంట సమయం పెంచినట్లు సూపరింటెండెంట్ జగన్నాథ్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక వైద్యుల సమావేశ భవనంలో అన్ని విభాగాల వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సూపరింటెండెంట్ తో పాటు ఆర్‌ఎంఓ వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ రామస్వామినాయక్‌లు పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఇకపై ఓపీ సేవలు ఉదయం 8.30 కే మెదలై మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయన్నారు. రోగులకు ఎక్స్‌రే, రక్త, కంటి, స్కానింగ్ లాంటి పరీక్షలను వేగవంతం చేసి ఒకే రోజులోనే రిపోర్టులు ఇచ్చే విధంగా కృషి చేయాలన్నారు. వైద్యులతో పాటు నర్సులు, ఆస్పత్రి సిబ్బంది రోగుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. అత్యవసర వైద్య సేవల్లో కూడా ఆయా విభాగాల వైద్యులు కచ్చితంగా అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందించాలన్నారు.
ఈ-ఔషధి విధానం అమలులో అనంత ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వైద్యులు తమ విధులను కచ్చితంగా నిర్వర్తించాలన్నారు. విధులకు డుమ్మా కొడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగుల పేరు, వారికున్న జబ్బులు, ఆస్పత్రిలో చికిత్స పొందిన కాలం తదితర వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి ఉన్నతాధికారి కార్యాలయానికి పంపాలని ఆదేశాలు చేశారు.
ఓపీ సేవల సమయం పెంపు
Published Sat, Jul 16 2016 6:38 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
Advertisement