ఎయిమ్స్‌లో ‘క్యూ’ల కష్టాలు | Aims' difficulties in q | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్‌లో ‘క్యూ’ల కష్టాలు

Published Mon, Jul 21 2014 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

Aims' difficulties in q

న్యూఢిల్లీ: ఎయిమ్స్ ఆస్పత్రి బయటి రోగుల విభాగానికి (ఓపీడీ) వచ్చే వాళ్లు డాక్టర్ గదికి వెళ్లేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఓపీడీల్లో రద్దీ నానాటికీ పెరుగుతున్నా, తదనుగుణంగా సీనియర్, జూనియర్ డాక్టర్లు, నర్సుల సంఖ్యను పెంచడంపై ఎయిమ్స్ యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ‘ఇక్కడ డాక్టర్లు, రోగుల నిష్పత్తి సక్రమంగా లేదు. గతంలో పోలిస్తే ప్రతి డాక్టర్ ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో రోగులను చూస్తున్నారు. అందుకే రోగులు గంటల కొద్దీ డాక్టర్ల గదుల ముందు నిరీక్షించాల్సి వస్తోంది. బాధితులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా, ఏమీ కాలేదు. నిరీక్షణ కాలాన్ని తగ్గించేందుకు ఏదో ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంది’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆస్పత్రి ఉద్యోగులు కొందరు అన్నారు.
 
 అయితే రద్దీని నియంత్రించడానికి ఆటోమేటెడ్ ఫోన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టామని ఎయిమ్స్ యాజ మాన్యం తెలిపింది. పాత రోగుల సంఖ్యను తగ్గిం చి, మరింత మంది కొత్తవారికి త్వరగా చికిత్స అందేలా చేయడం దీని లక్ష్యం. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన  ఈ పద్ధతిలో పాత రోగులకు ఫోన్ ద్వారా అపాయింట్‌మెంటు ఇస్తారు. ఇది మంచి ఫలితాలు ఇస్తే పూర్తిస్థాయిలో అమలు చేస్తామని అధికారులు అంటున్నారు. అయితే పాత రోగులతోపాటు అత్యవసర చికిత్స అవసరమయ్యే బాధితులకూ ప్రత్యేక విభాగం అవసరమని కొందరు అంటున్నారు. ‘నా కూతురు రక్తహీనతతో బాధపడుతున్నందున, తక్షణ వైద్యసాయం అవసరమని డాక్టర్లు చెప్పడంతో నేను వెంటనే అత్యవసర విభాగానికి రావాల్సి వచ్చింది. డాక్టర్ గదిలోకి వెళ్లేందుకు మేం గంట నిరీక్షించాల్సి వచ్చింది.
 
 అత్యవసర రోగులకు వెంటనే చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి’ అని సంగమ్‌విహార్‌వాసి మంజులాదేవి అభిప్రాయపడ్డారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో లోపల నిరీక్షించడం కూడా ఇబ్బందిగానే ఉంటుందని పాత రోగులు చెబుతున్నారు. ‘ప్రభుత్వ ఆస్పత్రికి రావాలనుకుంటే గంటల తరబడి నిరీక్షించడం తప్పనిసరన్న విషయం తెలుసు.  ఎంత ఎండ, చలి ఉన్నా రోగి అలాగే నిరీక్షించాలి. ఫ్యాన్లు ఎక్కడా కనిపించవు. దోమలు, ఈగలు స్వైరవిహారం చేస్తుంటాయి’ అని జితేందర్ సింగ్ చెప్పారు.   మధుమేహం, హైపర్‌టెన్షన్ ఉన్న రోగి కూడా కనీసం 40 నిమిషాల పాటు నిరీక్షిస్తూనే ఉండాలని బాధితులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement