ట్రెజరీలో ఇక ఈ-పాలన
అన్ని ప్రభుత్వ శాఖల బిల్లులను ఆన్‌లైన్‌లోనే ట్రెజరీకి సమర్పించాలి
ఏప్రిల్ నుంచి పేపర్‌లెస్ వర్క్ ఉద్యోగులకు అందనున్న పారదర్శక సేవలు
ఒంగోలు టూటౌన్: ట్రెజరీలో ఇక పూర్తి స్థాయి ఆన్‌లైన్ సేవలు ప్రారంభం కానున్నాయి. పేపరు కట్టలు (ఉద్యోగుల జీత భత్యాల బిల్లులు) కనపడని పరిస్థితి రాబోతోంది. కాగిత రహిత పాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే బిల్లులతో పాటు ఇతరత్రా బిల్లులన్నీ ఆన్‌లైన్ ద్వారానే ట్రెజరీకి వచ్చేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. నూతన ఆన్‌లైన్ వ్యవస్థ వలన జీపీఎఫ్ అమలులో పొరపాట్లకు తావులేకుండా ఉంటుందని ట్రెజరీ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి పేపరు కట్టలు (బిల్లులు) లేకుండా ఈ కొత్త విధానం అమలు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు ట్రెజరీకి పేపరు బిల్లులు, ఆన్‌లైన్ సేవలు రెండూ అందిస్తూ వస్తున్నారు.
ఈ రెండింటిలో పేపరు పనికి స్వస్తి చెప్పి.. ఏప్రిల్ నుంచి ఆన్‌లైన్ సేవలు పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. అందులో భాగంగానే గత నెల 25న కృష్ణా జిల్లా నూజివీడులో రాష్ట్రంలోని అన్ని ట్రెజరీ అధికారులకు, ఉద్యోగులకు ఆన్‌లైన్ సేవలపై ఒక రోజు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో ట్రెజరీశాఖ స్టేట్ డెరైక్టర్ కనకవల్లి, అడిషనల్ డెరైక్టర్ హనుమంతరావు, జాయింట్ డెరైక్టర్ శివప్రసాద్ పాల్గొన్నారు. పే-రోల్ ప్యాకేజి, పెన్షన్స్ అకౌంట్స్, ఆన్‌లైన్ సేవలపై సమీక్షించినట్లు వర్క్ షాపునకు వెళ్లిన ట్రెజరీ ఉద్యోగులు తెలిపారు. మన జిల్లా నుంచి డిప్యూటీ డెరైక్టర్ ఎ.లక్ష్మికుమారి, 10 మంది సబ్ ట్రెజరీ ఉద్యోగులు వర్క్ షాపునకు వెళ్లారు. జిల్లాలో మొత్తం 12 ఉపఖజానా కార్యాలయాలున్నాయి. మొత్తం 24 వేల మందికిపైగా ఉద్యోగులు, 21,398 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీరందరూ ఖజానా శాఖ ద్వారా వేతనాలు, పెన్షన్లను ప్రతి నెలా పొందుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు సమర్ధవంతంగా పొరపాట్లు లేని సేవలను ట్రెజరీ శాఖ ద్వారా అందిస్తామని ట్రెజరీ ఉద్యోగులు చెబుతున్నారు.