కోవిడ్–19 ముగిసినప్పటికీ ఇదే ట్రెండ్
కోల్‌కతా: కొద్దిరోజులపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను నిలువరించిన కోవిడ్–19 శకం ముగిసినప్పటికీ ఆన్‌లైన్ సర్విసులకు డిమాండ్ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి కారణంగా జనజీవనం నిలిచిపోవడంతో ఊపందుకున్న ఆన్‌లైన్ ట్రెండ్ తదుపరి దశలో మరింత ఊపందుకుంది.
ప్రజలు తమ అవసరాల కోసం ఆఫ్‌లైన్ స్టోర్లకంటే ఆన్‌లైన్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. ఇందుకు స్మార్ట్‌ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ అమ్మకాలు ఆఫ్‌లైన్ స్టోర్లను మించి నమోదవుతున్నట్లు మార్కెట్ రీసెర్చ్ సంస్థల తాజా నివేదిక పేర్కొంది. నీల్సన్‌ఐక్యూ, జీఎఫ్‌కే ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక వివరాలు చూద్దాం..
డోర్ డెలివరీ ఎఫెక్ట్
కరోనా తదుపరి లాక్‌డౌన్‌లు ఎత్తివేయడంతోపాటు.. అన్ని రకాల ఆంక్షలనూ ప్రభుత్వం తొలగించింది. అయినప్పటికీ వినియోగదారులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు ఇటీవల జనంలోకి చొచ్చుకుపోయిన సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నారు. దీంతో ఫిజికల్‌గా స్టోర్ల సందర్శనకంటే ఈకామర్స్‌వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి కాలంలో జోరందుకున్న డోర్ డెలివరీ వ్యవస్థ రానురాను బహుముఖాలుగా విస్తరించింది. ఫలితంగా నిత్యావసరాలు మొదలు విచక్షణ ప్రకారం కొనుగోళ్లు చేపట్టే వస్తువుల విషయంలోనూ ఆన్‌లైన్‌కే ఓటు వేస్తున్నారు.
భారీ వృద్ధి బాటలో
లాక్‌డౌన్ రోజుల్లో కూరగాయలు, ఫాస్ట్‌ఫుడ్ తదితర నిత్యావసరాల కోసం కాంటాక్ట్‌లెస్ డోర్ డెలివరీలకు అలవాటుపడిన ప్రజలు తదుపరి కాలంలో టీవీ సెట్ల దగ్గర్నుంచి ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు తదితర వినిమయ వస్తువులను సైతం ఈ కామర్స్ సైట్ల ద్వారా కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్ లాక్‌డౌన్ రోజులకుమించి కనిపిస్తోంది.
ప్రధానంగా మెట్రో నగర ప్రాంతాలలో ఈకామర్స్ ద్వారా కొనుగోళ్లు భారీగా ఎగశాయి. ఇంటినుంచే కొనుగోలు చేయగలగడం, డోర్‌డెలివరీ సౌకర్యం, విభిన్న ప్రొడక్టుల అందుబాటు తదితర సానుకూలతలు కీలకపాత్రను పోషిస్తున్నాయి. ఫ్రాస్ట్‌ఫ్రీ ఫ్రిజ్‌లు, 55 అంగుళాలకుమించిన టీవీలు వంటి ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు 2023లో రెట్టింపయ్యాయి. కాగా, గతేడాదిలో ఎఫ్‌ఎంసీజీ విభాగ అమ్మకాలు అంతక్రితం ఏడాది(2022)తో పోలిస్తే ఊపందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment