ఇదే‘మీ సేవ ’? | This is the 'in your service? | Sakshi
Sakshi News home page

ఇదే‘మీ సేవ ’?

Published Mon, Oct 14 2013 4:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM

This is the 'in your service?

 

=    నిర్వహణ పట్టని కాంట్రాక్టర్లు     
=    స్కానర్లు లేక ఆగిన ఆన్‌లైన్ సేవలు
=    వేతనాలందక సిబ్బందికి అగచాట్లు
=    వినియోగదార్లకు తప్పని తిప్పలు

 
సాక్షి, సిటీబ్యూరో : పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్న చందంగా తయారైంది నగరంలోని ‘మీ సేవ’ కేంద్రాల పరిస్థితి. ‘సులభంగా.. వేగంగా..’ నినాదంతో ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు సత్వర సేవలందిస్తామని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘మీసేవ’లు రానురాను నగరంలో మృగ్యమౌవుతున్నాయి. సిబ్బంది లేమి.. పనిచేయని స్కానర్లు.. కారణాలేవైతేనేం ప్రభుత్వం ప్రకటించిన సేవలన్నీ అందించడం సాధ్యం కాదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 177 రకాల సేవలను ప్రజలకు అందుబాట్లోకి తెచ్చామని ఓ వైపు ప్రభుత్వం ప్రకటిస్తుండగా... వాస్తవానికి వీటిలో సగానికి పైగా సేవలు ప్రజలకు అందడం లేదు.
 
అవగాహన లోపమేనా?

‘మీసేవ’ కేంద్రాలను ప్రస్తుతం నిర్వహిస్తోన్న కాంట్రాక్టు సంస్థలకు నిర్వహణపై సరైన అవగాహన లేకపోవడంతోనే సేవలను అందించలేకపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పనిచేసిన శాంకో సంస్థ నుంచి మీసేవల కాంట్రాక్టును ఈ ఏడాది మార్చి 19 నుంచి ‘ఉపాధి, రామ్ ఇన్ఫర్మాటిక్స్, ఐటీగ్లోబల్’ సంస్థలు సంయుక్తంగా పొందాయి. వీరు నిర్వహణ బాధ్యతలు చేపట్టేనాటికి 160 సేవలు ఉండగా, తాజాగా అవి 177కి చేరాయి.

అయితే పెరిగిన సేవలకు అనుగుణంగా టెక్నాలజీని గాని, సిబ్బందిని గాని సమకూర్చుకోకపోవడంతో ప్రజలకు సేవలందించడం దుర్భరంగా మారింది. కనీసం ఆయా కేంద్రాల వద్ద సరైన సెక్యూరిటీ ప్రమాణాలు కూడా పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెక్యూరిటీ సిబ్బందికి రెండు నెలల పాటు జీతాలివ్వకపోవడంతో వారు మానేస్తున్నారు. పలు కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు (తాగునీరు, మరుగుదొడ్లు..తదితరమైనవి) లేక ప్రజలు కూడా నానా అవస్థలు పడుతున్నారు.

 పెండింగ్‌లో దరఖాస్తులు

 మీసేవలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 3.79 ల క్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ శాఖలకు పంపిన దరఖాస్తులు (ఇంకా సమాచారం రానివి) 8.02 లక్ష లకు పైగా ఉన్నట్లు తెలిసింది. ఓవైపు సర్వర్‌తో సమస్యలు ఉండగా.. మరోవైపు స్కానర్లు లేకపోవడంతో ఆన్‌లైన్ వ్యవస్థ పనిచేయడం లేదు. పలు కేంద్రాలకు మాన్యువల్(కొరియర్) వ్యవస్థ ద్వారానే దరఖాస్తులు పంపుతున్నట్లు సమాచారం. మీ సేవాకేంద్రాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఆపరేటర్లకు సంఖ్య కనీసం 25 శాతం పెంచాల్సి ఉండగా.. యాజమాన్యం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. నెలనెలా వేతనాలు ఇవ్వక ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిలోనే కొంతమంది ఇతర ఉద్యోగాలు చూసుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆపరేటర్లకు, మేనేజర్లకు వేతనాలు పెంచకపోగా పని గంటలు పెంచేసరికి సిబ్బంది అవస్థలు పడుతున్నారు.
 
 ఇదీ పరిస్థితి..

 మెహిదీపట్నం(పీఅండ్ కాలనీ)కి చెందిన ఓ వ్యక్తి నివాస ధ్రువీకరణపత్రం కావాలని దరఖాస్తు సమర్పించేందుకు సమీపంలోని మీసేవా కేంద్రానికి వెళ్లారు. అయితే.. ఆ దరఖాస్తు ఆసిఫ్‌నగర్ మండలానికి సంబంధించినదని, తాము గోల్కొండ మండల వాసులకు మాత్రమే సేవలందిస్తామని అక్కడి సిబ్బంది చెప్పారు. వాస్తవానికి మీసేవాకేంద్రం ఉన్న ప్రాంతం ఆసిఫ్‌నగర్ మండలంలోనే ఉండడం గమనార్హం. ఆరా తీస్తే.. సదరు మీసేవాకేంద్రంలో స్కానర్లు లేనందున దరఖాస్తును స్కాన్ చేసి ఆసిఫ్‌నగర్ తహశీల్దారు కార్యాలయానికి పంపడం సాధ్యం కాదని సిబ్బంది అలా చెప్పినట్లు తెలిసింది.

అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగర్ కాలనీ మీసేవాకేంద్రానికి వెళ్లమని సిబ్బంది ఉచిత సలహా ఇవ్వడం విశేషం. అంతేకాదు.. ఇక్కడి కేంద్రంలో కరెంట్ పోతే కంప్యూటర్లు ఆగిపోయి కస్టమర్లకు తిప్పలు తప్పడం లేదు. గతంలో ఇక్కడ 16మంది ఆపరేటర్లు పనిచేయగా ప్రస్తుతం కేవలం 8మంది మాత్రమే పనిచేస్తున్నారంటే.. మీసేవా కేంద్రాల నిర్వహణ ఎలా ఉందో ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదేమో.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement