Ram Informatics
-
ఇన్క్యుబేషన్ సెంటర్ల ఏర్పాటులో రామ్ఇన్ఫో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ సొల్యూషన్స్ అందించే లిస్టెడ్ సంస్థ రామ్ఇన్ఫో వచ్చే మూడేళ్లలో టాప్ 5 మధ్య స్థాయి టెక్ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా అమెరికాలో కూడా కార్యకలాపాలు విస్తరిస్తోంది. అంకుర సంస్థలకోసం అమెరికాలో రెండు, భారత్‌లో ఒకటి చొప్పున ఇన్క్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ఎండీ ఎల్ శ్రీనాథ్‌రెడ్డి బుధవారమిక్కడ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా 1994లో ఏర్పాటైన రామ్ఇన్ఫో .. ఈసేవ, మీసేవ, సువిధా వంటి సొల్యూషన్స్‌తో అటు ప్రభుత్వాలు, ఇటు కంపెనీలకు ఐటీ, డిజిటల్ పరివర్తన సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో సాగిస్తున్న కార్యకలాపాలను 2024–25లో 15 రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. 135 మిలియన్ డాలర్ల ఆదాయం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. -
హైదరాబాద్ ఐటీ సంస్థ రామ్ ఇన్ఫో నిధుల సమీకరణ
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీ సంస్థ రామ్ ఇన్ఫో లిమిటెడ్ భారీ నిధుల సమీకరణ ప్రణాళిక చేపట్టింది. ప్రాధాన్యతా షేర్ల కేటాయింపు ద్వారా రూ.62 కోట్ల నిధుల సమీకరణ ప్రణాళికకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ తాజాగా ప్రకటించింది. సేకరించిన నిధులను కంపెనీ అభివృద్ధి, నాయకత్వ విస్తరణ, జాతీయ, అంతర్జాతీయ విస్తరణ కోసం ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. టెక్నాలజీ, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న తమ అనుబంధ, జాయింట్ వెంచర్లలో భవిష్యత్తు పెట్టుబడి అవసరాలను తీర్చడం రామ్ ఇన్ఫో లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. "కంపెనీ ఆదాయం, స్థిరమైన వృద్ధిని మెరుగుపరచడానికి, సర్వీస్ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి, భౌగోళిక పరిధిని విస్తరించడానికి ఈ వ్యూహాత్మక చర్య ఉద్దేశించినది" అని రామ్ ఇన్ఫో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. బలమైన ఆర్డర్లను, సర్వీస్ గ్రోత్‌ను పెంపొందించుకునేందుకు, తమ షేర్హోల్డర్లకు విలువను సృష్టించడానికి నిధుల సమీకరణ సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. -
ఇదే‘మీ సేవ ’?
= నిర్వహణ పట్టని కాంట్రాక్టర్లు = స్కానర్లు లేక ఆగిన ఆన్లైన్ సేవలు = వేతనాలందక సిబ్బందికి అగచాట్లు = వినియోగదార్లకు తప్పని తిప్పలు సాక్షి, సిటీబ్యూరో : పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్న చందంగా తయారైంది నగరంలోని ‘మీ సేవ’ కేంద్రాల పరిస్థితి. ‘సులభంగా.. వేగంగా..’ నినాదంతో ఆన్లైన్ ద్వారా ప్రజలకు సత్వర సేవలందిస్తామని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘మీసేవ’లు రానురాను నగరంలో మృగ్యమౌవుతున్నాయి. సిబ్బంది లేమి.. పనిచేయని స్కానర్లు.. కారణాలేవైతేనేం ప్రభుత్వం ప్రకటించిన సేవలన్నీ అందించడం సాధ్యం కాదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 177 రకాల సేవలను ప్రజలకు అందుబాట్లోకి తెచ్చామని ఓ వైపు ప్రభుత్వం ప్రకటిస్తుండగా... వాస్తవానికి వీటిలో సగానికి పైగా సేవలు ప్రజలకు అందడం లేదు. అవగాహన లోపమేనా? ‘మీసేవ’ కేంద్రాలను ప్రస్తుతం నిర్వహిస్తోన్న కాంట్రాక్టు సంస్థలకు నిర్వహణపై సరైన అవగాహన లేకపోవడంతోనే సేవలను అందించలేకపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పనిచేసిన శాంకో సంస్థ నుంచి మీసేవల కాంట్రాక్టును ఈ ఏడాది మార్చి 19 నుంచి ‘ఉపాధి, రామ్ ఇన్ఫర్మాటిక్స్, ఐటీగ్లోబల్’ సంస్థలు సంయుక్తంగా పొందాయి. వీరు నిర్వహణ బాధ్యతలు చేపట్టేనాటికి 160 సేవలు ఉండగా, తాజాగా అవి 177కి చేరాయి. అయితే పెరిగిన సేవలకు అనుగుణంగా టెక్నాలజీని గాని, సిబ్బందిని గాని సమకూర్చుకోకపోవడంతో ప్రజలకు సేవలందించడం దుర్భరంగా మారింది. కనీసం ఆయా కేంద్రాల వద్ద సరైన సెక్యూరిటీ ప్రమాణాలు కూడా పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెక్యూరిటీ సిబ్బందికి రెండు నెలల పాటు జీతాలివ్వకపోవడంతో వారు మానేస్తున్నారు. పలు కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు (తాగునీరు, మరుగుదొడ్లు..తదితరమైనవి) లేక ప్రజలు కూడా నానా అవస్థలు పడుతున్నారు. పెండింగ్‌లో దరఖాస్తులు మీసేవలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 3.79 ల క్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ శాఖలకు పంపిన దరఖాస్తులు (ఇంకా సమాచారం రానివి) 8.02 లక్ష లకు పైగా ఉన్నట్లు తెలిసింది. ఓవైపు సర్వర్‌తో సమస్యలు ఉండగా.. మరోవైపు స్కానర్లు లేకపోవడంతో ఆన్లైన్ వ్యవస్థ పనిచేయడం లేదు. పలు కేంద్రాలకు మాన్యువల్(కొరియర్) వ్యవస్థ ద్వారానే దరఖాస్తులు పంపుతున్నట్లు సమాచారం. మీ సేవాకేంద్రాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఆపరేటర్లకు సంఖ్య కనీసం 25 శాతం పెంచాల్సి ఉండగా.. యాజమాన్యం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. నెలనెలా వేతనాలు ఇవ్వక ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిలోనే కొంతమంది ఇతర ఉద్యోగాలు చూసుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆపరేటర్లకు, మేనేజర్లకు వేతనాలు పెంచకపోగా పని గంటలు పెంచేసరికి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఇదీ పరిస్థితి.. మెహిదీపట్నం(పీఅండ్ కాలనీ)కి చెందిన ఓ వ్యక్తి నివాస ధ్రువీకరణపత్రం కావాలని దరఖాస్తు సమర్పించేందుకు సమీపంలోని మీసేవా కేంద్రానికి వెళ్లారు. అయితే.. ఆ దరఖాస్తు ఆసిఫ్‌నగర్ మండలానికి సంబంధించినదని, తాము గోల్కొండ మండల వాసులకు మాత్రమే సేవలందిస్తామని అక్కడి సిబ్బంది చెప్పారు. వాస్తవానికి మీసేవాకేంద్రం ఉన్న ప్రాంతం ఆసిఫ్‌నగర్ మండలంలోనే ఉండడం గమనార్హం. ఆరా తీస్తే.. సదరు మీసేవాకేంద్రంలో స్కానర్లు లేనందున దరఖాస్తును స్కాన్ చేసి ఆసిఫ్‌నగర్ తహశీల్దారు కార్యాలయానికి పంపడం సాధ్యం కాదని సిబ్బంది అలా చెప్పినట్లు తెలిసింది. అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగర్ కాలనీ మీసేవాకేంద్రానికి వెళ్లమని సిబ్బంది ఉచిత సలహా ఇవ్వడం విశేషం. అంతేకాదు.. ఇక్కడి కేంద్రంలో కరెంట్ పోతే కంప్యూటర్లు ఆగిపోయి కస్టమర్లకు తిప్పలు తప్పడం లేదు. గతంలో ఇక్కడ 16మంది ఆపరేటర్లు పనిచేయగా ప్రస్తుతం కేవలం 8మంది మాత్రమే పనిచేస్తున్నారంటే.. మీసేవా కేంద్రాల నిర్వహణ ఎలా ఉందో ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదేమో.