- సింగరేణిలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభం
- కార్మికుల సంక్షేమానికి వెబ్‌సైట్ ఏర్పాటు
- ఫలిస్తున్న డెరైక్టర్ ‘పా’ వ్యూహం
కొత్తగూడెం (ఖమ్మం) : నిరక్షరాస్యులు అధికంగా ఉండే సంస్థగా ముద్రపడిన సింగరేణిలో గతంలో దళారీల పైరవీలపైనే కార్మికులు ఎక్కువగా ఆధారపడేవారు. ఆ వ్యవస్థను రూపుమాపేందుకు సింగరేణి పర్సనల్ విభాగం అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తూ కార్మికులు.. అధికారులకు మధ్య సమన్వయాన్ని మరింతగా పెంచింది. ఇప్పటి వరకు జోరుగా సాగిన పైరవీలు ఇకపై జరగవు. ఎక్కువగా అభియోగాలు ఉన్న విభాగాలను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేస్తూ కార్మికులకు త్వరితగతిన పనులు జరిగేలా చర్యలు తీసుకుంది.
సెంటర్ ఫర్ గుడ్‌గవర్నెన్స్ విధానాన్ని అన్ని విభాగాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. సింగరేణి సంస్థలో ఇప్పటి వరకు ప్రధానంగా బదిలీలు, మెడికల్ అన్‌ఫిట్ విషయాల్లో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉండేది. మెడికల్ అన్‌ఫిట్ కోసం ఒక్కో కార్మికుడు లక్ష రూపాయల దాకా బ్రోకర్లకు ముట్టజెప్పేవారు. బదిలీల కోసం కూడా పైరవీకారులకు పైకం చెల్లించుకునేవారు. దళారీ వ్యవస్థపై ఎక్కువగా ఫిర్యాదులు రావడంతోపాటు కార్మిక సంఘాలు ఆందోళనలు చేయడంతో విజిలెన్స్ విభాగం బ్రోకర్ దందాకు చెక్‌పెట్టేందుకు నడుం బిగించింది. విజిలెన్స్ విభాగం అధిపతి డెరైక్టర్ (పా) టి.విజయ్‌కుమార్ దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రణాళికలు రూపొం దించారు.
ఆన్‌లైన్‌లో మెడికల్ అన్‌ఫిట్
మెడికల్ అన్‌ఫిట్‌కు హాజరయ్యే కార్మికుల వివరాలను ఆన్‌లైన్‌లోనే పొందుపరచనున్నారు. ఏయే రుగ్మతల కింద మెడికల్ అన్‌ఫిట్ పొందవచ్చో.. వాటిని కూడా ఆన్‌లైన్‌లో సూచించారు. దీంతో అక్రమంగా మెడికల్ అన్‌ఫిట్ తీసుకునే వారికి చెక్‌పెట్టినట్లే కాకుండా.. దళారీలకు చోటులేకుండా పోయినట్లవుతోంది. అయితే, ఈ విధానం మరో నెల రోజుల్లో అమలులోకి రానుంది.
బదిలీలకు ప్రత్యేక వెబ్‌సైట్
గతంలో ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకు కార్మికులు బదిలీ కోరుకుంటే దానికి సంబంధించిన సమాచారం అందేది కాదు. దీంతో నిరక్ష్యరాస్యులైన కార్మికులు కార్యాలయాల చుట్టూ తిరగలేక పైరవీకారులను ఆశ్రయించేవారు. దీనిని అధిగమించేందుకు బదిలీల ప్రక్రియను ఇప్పుడు వెబ్‌సైట్ ద్వారా నిర్వహిస్తున్నారు. తాము పనిచేస్తున్న గనుల వద్దనే కార్మికులు బదిలీ కోసం నమోదు చేయించుకుంటే చాలు ఆ ప్రక్రియ మొదలవుతుంది. దానికి సంబంధించిన వివరాలు, ఫైల్ ఎక్కడ ఉందో.. దాని వివరాలు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో కార్మికులు చూసుకునే అవకాశం ఉంది.
దీంతో ఈ విభాగంలో సైతం పైరవీలకు చెక్ పెట్టినట్లే. ఈ రెండు అంశాలకే ప్రాధాన్యం కల్పించకుండా సింగరేణి అభివృద్ధిలో కార్మికులను భాగస్వాములు చేసేందుకు వారి విలువైన సలహాలను తీసుకునేందుకు ‘సింగరేణి ఐడియా’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు. విలువైన సలహాలు అందించిన వారికి బహుమతులు కూడా అందించనుంది. పనిప్రదేశాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించిన సలహాలను అందించేందుకు సెఫ్టీ సజెక్షన్స్ పేరుతో ఆన్‌లైన్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.