
డిస్పెన్సరీని ప్రారంభిస్తున్న మంత్రి జయరాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు. కార్మికులకు ఇబ్బంది లేకుండా రాష్ట్రంలోని అన్ని ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గుణదల మోడల్ డిస్పెన్సరీలో ఆన్‌లైన్ విధానాన్ని సోమవారం కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మితో కలిసి మంత్రి జయరాం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కార్మికుల సొమ్మును కూడా దోచుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల సొమ్మును వారి వైద్యం, సంక్షేమం కోసమే ఖర్చు చేస్తోందని తెలిపారు.
ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం ద్వారా కార్మికులు వారి సమయాన్ని ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే.. రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందనే నమ్మకంతో సీఎం వైఎస్ జగన్.. ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలు కూడా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందే అవకాశాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువస్తే.. ఆయన తనయుడు సీఎం జగన్ ఇప్పుడు ప్రతి ఒక్క జబ్బును ఆరోగ్య శ్రీలో చేర్చి పేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నారని చెప్పారు. ప్రజల సంక్షేమంతో పాటు విద్య, ఆరోగ్యానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి మాట్లాడుతూ.. ఆన్‌లైన్ సేవల విధానాన్ని 78 డిస్పెన్సరీలు, 4 ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో అమలు చేస్తామన్నారు. ఈఎస్‌ఐ డైరెక్టర్ ఎల్‌ఎస్‌బీఆర్ కుమార్, కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, ప్రాంతీయ సంచాలకులు కాశీనాథన్ పాల్గొన్నారు.