కృష్ణరాజపురం: రైతులు ఎంతో కష్టపడి పండించిన కూరగాయలు దళారుల చేతుల్లో పెట్టి మోసపోకుండా ఉండేందుకు కేఆర్‌పురం మార్కెట్‌లో సరికొత్త విధానం అమల్లోకి రానుంది. మార్కెట్‌లో కూరగాయలు ఎంత ధర ఉందో తెలుసుకోవడం కోసం ఆన్‌లైన్ వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీనిని ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాదు. రైతులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమిది. దేశంలో మొదటి సారిగా కూరగాయల మార్కెట్‌లో ఆన్‌లైన్ వ్యవస్థను కృష్ణరాజపురంలో ఏర్పాటు చేయనున్నారు. కృష్ణరాజపురం మార్కెట్‌కు ప్రతి రోజూ వేలాది మంది రైతులు తాము పం డించిన కూరగాయలను తీసుకవచ్చి అమ్ముతుంటారు. అఖిల కర్ణాటక రైతు, వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఈ మార్కెట్‌లో ఆన్‌లైన్ వ్యవస్థను ప్రవేశ పెట్టారు.
కూరగాయలను మార్కెట్‌కు తీసుకురావడానికి ముందే ఎంత ధర పలుకుతుందో తెలుసుకోవచ్చు. అప్పుడు రై తులు ఆ రోజు కోత పెట్టుకోవచ్చా వద్దా, మార్కెట్‌కు తీ సుకువెళ్లాలా వద్దా అన్న నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అంతా పూర్తి చేసి అందుబాటులోకి వస్తే మాత్రం రైతు లు దళారీల చేతుల్లో మోసపోయే అవకాశం ఉండదు. మరో రెండు నెలల్లో ఈ ఆన్‌లైన్ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన ఆప్‌ను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు గ్రామీణ ప్రాంతం, కోలారు, చిక్కబళ్లాపురం, రామనగర, హాసన, మైసూరు, తుమకూరు, నెళమంగళతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రైతులకు కూడా ఈ ఆప్ ద్వారా లబ్ధి చేకూరనుంది.
ప్రస్తుతం సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సంతకు ప్రతి రోజు కనీసం 2 వేల మంది రైతులు వచ్చి వ్యాపారం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రతి రోజు 10 వేల మంది కోనుగోలుదారులు వస్తున్నారు. సుమారు రూ.2 కోట్ల వ్యాపారం ఇక్కడ మార్కెట్‌లో జరుగుతుందని రైతులు అంటున్నారు. ఆన్‌లైన్ వ్యవస్థను ఎర్పాటు చేస్తున్నందున మరింత ఎక్కువ మంది రైతులు ఇక్కడకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇక్కడికి వచ్చి రైతులు, కొనుగోలుదారుల భద్రతను దృష్టి లో పెట్టుకొని వ్యాపారులు, రైతులు కలిసి సుమారు 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్కెట్‌లోని రోడ్లను సైతం బాగు చేస్తున్నారు. వర్షం పడితే చిత్తడిగా మారే మార్కెట్ దారులను సిమెంటు రోడ్లుగా మార్చి అభివృద్ధి చేస్తున్నారు.
సంతలో ఆన్‌లైన్ వసతులు
Published Mon, Mar 2 2015 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement
Advertisement