పోలీస్ నెట్‌వర్క్ షట్‌డౌన్
ఏలూరు అర్బన్: హ్యాకింగ్ అనే పదం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తెలుగు రాష్ట్రాల పోలీసు నెట్‌వర్క్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి పోలీస్‌స్టేషన్లు, కార్యాలయాల్లో కంప్యూటర్లు రాన్‌సమ్‌వేర్ వైరస్ బారిన పడి మూగబోయాయి. పోలీసు ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించడం తలమునకలవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో కంప్యూటర్లను తక్షణం షట్‌డౌన్ చేయాలని రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు యుద్ధప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు అందేంతవరకూ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయరాదని ఆర్డర్ వేశారు. దీంతో జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో కంప్యూటర్‌లను ఆపరేటర్‌లు షట్‌డౌన్ చేశారు. ఏలూరు సీఐ ఉడతా బంగార్రాజు మాట్లాడుతూ హ్యాకర్స్ దాడికి పాల్పడటంతో రాష్ట్రంలో దాదాపు సగం పోలీస్‌స్టేషన్లలో నెట్‌వర్క్ సేవలు నిలిచిపోయాయని చెప్పారు. విజయనగరం, విశాఖ, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో నెట్‌వర్క్‌లు పూర్తిగా స్తంభించాయన్నారు. కంప్యూటర్ రంగ నిపుణులు మాత్రం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్లు మాత్రమే హ్యాక్ అయ్యాయని, ఆండ్రాయిడ్ వెర్షన్ వాడుతున్న కంప్యూటర్‌లకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారన్నారు. ఈ సమస్య కేవలం రాష్ట్రానికే పరిమితం కాదని ప్రపంచంలోని పలు దేశాల్లో పోలీస్ నెట్‌వర్క్‌లు సైబర్ దాడుల బారిన పడ్డాయని చెప్పారు.