బేస్తవారిపేట, న్యూస్‌లైన్: ప్రభుత్వం రెండేళ్ల క్రితం రచ్చబండ, రెవెన్యూ సదస్సుల్లో మంజూరు చేసిన తాత్కాలిక రేషన్‌కార్డులకు రేషన్ సరఫరా నిలిచిపోయింది. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి మంజూరు చేయించుకున్న కార్డుదారులకు మూడు నెలల నుంచి డీలర్లు రేషన్ ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా రచ్చబండలో కార్డులు పంపిణీ చేసింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారులు కుటుంబ సభ్యుల ఫొటోలు వీఆర్వోలకు అందజేశారు. కంప్యూటర్‌లో ఫొటోలు, కార్డుల సమాచారం రెవెన్యూ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. హైదరాబాద్ సర్వర్‌లో సమస్య తలెత్తడంతో కొంత మంది ఫొటోలు మాత్రమే అప్‌లోడు అయ్యాయి. జిల్లాలోని 56 మండలాల్లో 20, 970 మంది కార్డుదారుల సమాచారం అప్‌లోడు కాలేదు. సమాచారం కంప్యూటర్‌లో నమోదుకాని కార్డుదారులందరికీ మూడు నెలల నుంచి రేషన్ నిలిపివేశారు. జిల్లాలో అత్యధికంగా పామూరు 1069, మార్కాపురం 1,146, ఒంగోలు(అర్బన్) 982, కనిగిరి 945, యర్రగొండపాలెం 729, పుల్లలచెరువు 726, పొదిలి 670, త్రిపురాంతకం మండలంలో 608 మంది కార్డుదారుల సమాచారం అప్‌లోడు కాలేదు.
కంప్యూటర్‌లో సమాచారం అప్‌లోడు చేసినపుడు కొందరికి వేరే కార్డుకు యూఐడీ నంబర్ ఇచ్చినట్లు వెబ్‌సైట్ చూపిస్తోంది. దీంతో రేషన్ కార్డుల సమాచారం ఆన్‌లైన్ చేయడం కుదరడంలేదు. సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో ఫొటోలు అప్‌లోడు చేయలేకపోతున్నారు. మూడు నెలలుగా పేదలకు బియ్యం, కందిపప్పు, పామాయిల్, చక్కెర, కిరోసిన్ అందకుండా పోవడంతో అవస్థలు పడుతున్నారు. ప్రతినెలా రేషన్ దుకాణాల వద్దకు వెళ్లడం డీలర్లు ఈనెల కూడా రాలేదని చెప్పడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు.
వెబ్‌సైట్ సమస్య వల్లే.. దక్షిణామూర్తి ఏఫ్‌ఐ, గిద్దలూరు
కంప్యూటర్ డేటా నమోదు చేయని, ఫొటోలు అప్‌లోడు చేయనివాళ్లకు రేషన్ సరఫరా నిలిచిపోయింది. రెండు నెలల క్రితమే డీలర్లకు జాబితా అందించాం. వెబ్‌సైట్‌లో సమస్యలుండి ఫొటోలు అప్‌లోడు కాకపోతే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం.
రేషన్‌కు ఆన్‌లైన్ అడ్డు
Published Mon, Feb 10 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement